YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Monday, 9 July 2012

జగన్‌పై అక్కసెందుకు బాబూ

మునిగే నౌకలాగా తయారైన టీడీపీ నుంచి ఒక్కొక్కరుగా నాయకులు నిష్ర్కమిస్తూ ఉంటే ఆ పార్టీ అధినేత ఎన్.చంద్రబాబునాయుడు మాత్రం వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డిపై నిందలేయడం అభ్యంతరకరమని వైఎస్సార్ కాంగ్రెస్ కేంద్ర పాలక మండలి సభ్యుడు జూపూడి ప్రభాకరరావు ధ్వజమెత్తారు. పార్టీ నుంచి నేతలు ఎందుకు వెళ్లి పోతున్నారో గ్రహించి ఇల్లు చక్కదిద్దుకోవాల్సిన బాబు బయటి వారిపై అక్కసు వెళ్లగక్కడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జూపూడి విలేక రులతో మాట్లాడుతూ చంద్రబాబు ప్రజా విశ్వాసం కోల్పోయారనీ ఆయనను ఎవరూ నమ్మడం లేదనీ త్వరలో టీడీపీని మూసేసి నెత్తిన గుడ్డేసుకుని వెళ్లి పోవాల్సిన రోజు వస్తుందనీ విమర్శించారు. ఎన్టీఆర్ టీడీపీని స్థాపించిన రోజున ఉన్న ప్రాభవం ప్రస్తుతం బాబు సారథ్యంలో కుంగి పోతోందని ఆయన అన్నారు. ఒకప్పుడు 48 శాతం ఓట్లతో బలీయంగా ఉండిన ఆ పార్టీ ఇపుడు 22 శాతానికి దిగజారిందని ఆయన అన్నారు. టీడీపీ వరుస ఓటములకు కారణాలేమిటో అంచనా వేయడంలో బాబు ఘోరంగా విఫలం అయ్యారనీ 2012 ఉప ఎన్నికల్లో ఓటమికి కారణం జగన్‌ను కాంగ్రెస్ నేతలు సరిగ్గా కట్టడి చేయలేక పోవడమేనని చెప్పడమే అందుకు నిదర్శనమని ప్రభాకర్ అన్నారు. జగన్‌ను జైల్లో పెట్టడం వల్ల ఆ సానుభూతితో గెలిచారని బాబు నమ్మ బలకడాన్ని ఆయన ఎద్దేవా చేశారు. 

‘మా పార్టీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ వేసిన పిటిషన్‌కు అనుగుణంగా బాబు ధైర్యంగా విచారణ కోరాలి. అపుడు సీబీఐ ఆయన్ను కూడా జైల్లో పెడుతుంది. జైలుకు వెళ్లి నువ్వు కూడా ప్రజల తీర్పు కోరు, వారు సానుభూతి తెలుపుతారో లేదో అపుడు తెలుస్తుంది’ అని నిలదీశారు. సానుభూతి పనిచేసిందనుకుంటే పొరబాటనీ జగన్‌పై చేసిన ఆరోపణలు ప్రజలు నమ్మలేదు కనుకనే వైఎస్సార్ కాంగ్రెస్‌ను గెలిపించారని ఆయన అన్నారు. కానీ చంద్రబాబుపై ప్రజలకు అలాంటి విశ్వాసం లేదని ఆయన అన్నారు. 2009లో వై.ఎస్.రాజశేఖరరెడ్డి మరణం తరువాత ఏర్పడిన రాజకీయ శూన్యత నేపథ్యంలో కూడా ప్రతిపక్ష నాయకుడుగా చంద్రబాబు ఏ మాత్రం ప్రభావం చూపలేక పోయారని ఆయన అన్నారు. అప్పటి నుంచీ 41 అసెంబ్లీ, రెండు లోక్‌సభ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగితే ప్రతిపక్షం ఒక్కసీటు కూడా గెల్చుకోలేక పోయిందని ఆయన అన్నారు. జగన్‌పై ప్రజల్లో అపారమైన నమ్మకం, విశ్వాసం ఉన్నాయనీ అందుకే ఆయనకు పట్టం గడుతున్నారనీ ఇది గ్రహించకుండా బాబు తన పార్టీ శ్రేణులను భ్రమల్లో పెట్టే విధంగా మాట్లాడుతున్నారని అన్నారు. 


కొడాలి నాని నిష్ర్కమిస్తే ఆయపై ఆరోపణలు చేయడానికి 9 మంది టీడీపీ నాయకులతో విలేకరుల సమావేశం పెట్టించడం వింతగా ఉందని ఆయన అన్నారు. నాని వెంట పార్టీ వారెవ్వరూ పోలేదని నమ్మించే యత్నం చేశారని ఆయన అన్నారు. జగన్ 30 కోట్ల రూపాయలు ఇస్తేనే నాని వెళ్లారని టీడీపీ చేసిన ఆరోపణలను ప్రస్తావించగా ‘మరి నాని ఇంత కాలం టీడీపీలో ఉన్నందుకు ఆ పార్టీ ఎంత ఇచ్చిందట? ఇది సహజంగా ఉత్పన్నమయ్యే ప్రశ్నే కదా...అయినా ఈ ఆరోపణలకు నానియే సమాధానం ఇస్తే మంచిది’ అని ప్రభాకర్ అన్నారు. ఎపుడో తాను కేంద్రంలో చక్రం తిప్పానని చెప్పుకునే బాబు ఇపుడు తన చక్రం తాను తిప్పుకోలేని స్థితిలో ఉన్నారనీ బహుశా ఆయన తిప్పిన చక్రం ఇపుడు ఆయన మెడకు విష్ణు చక్ర ం మాదిరిగా మారిందేమో అని వ్యంగంగా అన్నారు. బీసీలకు వచ్చే ఎన్నికల్లో వంద సీట్లిస్తానని బాబు చెప్పడాన్ని ప్రస్తావిస్తూ అలా ఆయన చాలా సార్లు చెప్పారనీ ఆచరణలో మాత్రం అమలు చేయలేదన్నారు. అయినా నిజంగా అయన వారికి వంద సీట్లిస్తే తాను స్వాగతిస్తానని అన్నారు. 2009 ఎన్నికల్లో కూడా బాగా డబ్బున్న బీసీలకే టికెట్లు ఇచ్చారన్నారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!