వైఎస్సార్‌సీపీ నేత కె.కె.మహేందర్‌రెడ్డి
నేత సమస్యలపై జగన్ ధర్మవరంలో దీక్ష చేశారు
అలాగే విజయమ్మ కూడా ముందుకొచ్చారు
మూడేళ్లలో కేటీఆర్ ఆ ప్రాంతానికి ఏం చేశారు?
హైదరాబాద్, న్యూస్‌లైన్: మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి వల్లే సిరిసిల్లలో ఆత్మహత్యలు ఆగాయని వైఎస్సార్ కాంగ్రెస్ కేంద్ర పాలకమండలి సభ్యుడు కె.కె.మహేందర్‌రెడ్డి ఉద్ఘాటించారు. ఆయన మరణానంతరం చేనేతల సమస్యలు మళ్లీ మొదటికి వచ్చాయని, దీంతో తమపార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి అనంతపురం జిల్లా ధర్మవరం వేదికగా దీక్ష కూడా చేశారని గుర్తుచేశారు. అదే విధంగా సిరిసిల్ల మరమగ్గాల కార్మికుల సమస్యల పరిష్కారంకోసం ప్రభుత్వంపై ఒత్తిడి చేసేందుకు విజయమ్మ ముందుకొచ్చారని వివరించారు. అలాంటి వ్యక్తిపై కేటీఆర్ విమర్శలు చేయడం ఆయన అపరిపక్వతకు నిదర్శనమన్నారు. సిరిసిల్లలో మరమగ్గాలపై ఆధారపడిన వారి సమస్యల పరిష్కారం కోసం ఆ ప్రాంత ఎమ్మెల్యేగా కె.తారకరామారావు(కేటీఆర్) మూడేళ్ల కాలంలో ఏం సాధించారో చెప్పాలని నిలదీశారు. శనివారమిక్కడ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. దివంగత సీఎం వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలోనే చేనేతలకు మంచి జరిగిందన్నారు. ప్రత్యేక ప్యాకేజీలు ఇచ్చి ఆదుకున్నది కూడా వైఎస్సేనని చెప్పారు. ‘‘సిరిసిల్లలోని పవర్‌లూమ్స్‌కు సబ్సిడీ విద్యుత్ అందించారు. అంత్యోదయ పథకం ద్వారా ఒక్కొక్క కుటుంబానికి 35 కేజీల బియ్యాన్ని అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంఘాలకు రూ.25 వేలు అందజేస్తే, సిరిసిల్లలో ఒక్కొక్క సంఘానికి రూ.5 లక్షల దాకా ఇచ్చారు. వైఎస్ ప్రకటించిన ప్యాకేజీల కారణంగానే సిరిసిల్లలో ఆత్మహత్యలు ఆగాయి’’ అని మహేందర్‌రెడ్డి తెలిపారు. భర్త మరణించినా, అధికార ప్రతిపక్షాలు కుట్రతో కుమారుడిని జైల్లో నిర్బంధించినా విజయమ్మ తన గుండెను దిటువు చేసుకొని ప్రజాసమస్యలపై పోరాడుతుంటే మద్దతివ్వాల్సిందిపోయి విమర్శించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
ఆగ స్టులో తెలంగాణ వస్తుంటే లేఖ ఎందుకు?
తెలంగాణపై వైఎస్సార్ కాంగ్రెస్ ఇప్పటికే స్పష్టమైన వైఖరిని వెల్లడించిందని మహేందర్‌రెడ్డి చెప్పారు. తెలంగాణను ఇచ్చే శక్తి, అడ్డుకునే ఆలోచన వైఎస్సార్ కాంగ్రెస్‌కు లేదని పార్టీ ప్లీనరీలోనే ప్రకటించామన్నారు. అంతేకాదు ఇడుపులపాయ సాక్షిగా తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించినట్లు గుర్తుచేశారు. తెలంగాణ ఆకాంక్ష మేరకు ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి తిరిగి పోటీ చేసిన అభ్యర్థులపై కూడా తమ పార్టీ పోటీ పెట్టలేదన్నారు. రాజ్యాంగంలోని 3వ అధికరణ ప్రకారం రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే అర్హత కేంద్రానికే ఉంటుందని తెలిపారు. అయితే కేటీఆర్... సిరిసిల్ల పర్యటనకు ముందే వైఎస్సార్ కాంగ్రెస్ తెలంగాణ పట్ల స్పష్టమైన వైఖరి చెప్పాలనడం అర్థరహితమన్నారు. ఆగస్టులో తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని ఒకవైపు కేసీఆర్ చెబుతుంటే మరోవైపు కేటీఆర్ లేఖ ఇవ్వాలని అడగటమేంటని ప్రశ్నించారు. కేసీఆర్‌పై కేటీఆర్‌కు నమ్మకంలేదా? అని నిలదీశారు. తెలంగాణ బిడ్డలుగా రాష్ట్ర ఏర్పాటుకోసం తామంతా సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఇప్పటికైనా జెండాలు పక్కనపెట్టి ఎజెండాతో ముందుకొస్తే తాము కూడా కలిసి వస్తామన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment