గుడివాడ : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుపై గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. వెన్నుపోటుదారునికి పేటెంట్ హక్కు చంద్రబాబుదని... ఆయన నీతులు చెప్పటం సిగ్గుచేటు అన్నారు. సంజాయిషీ అడక్కుండానే తనను ఎందుకు పార్టీ నుంచి సస్పెండ్ చేశారో చెప్పాలని నాని డిమాండ్ చేశారు. గుడివాడ టీడీపీ కార్యాలయంలో నాని బుధవారం విలేకర్ల సమావేశంలో మాట్లాడారు.
తెలుగుదేశం పార్టీ చంద్రబాబు సొత్తు కాదని, ఎన్టీఆర్ మీద అభిమానంతోనే తాను పార్టీలోకి వచ్చానన్నారు. అప్పుడు సీఎం కుర్చీకోసం ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచారని, ఇప్పుడు ఆయన అభిమాని అయిన తనను పార్టీ నుంచి గెంటేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రగిరిలో తరిమేస్తే కుప్పం పారిపోయిన వ్యక్తి తనపై జనం తిరగబడమని చెప్పటం సిగ్గుచేటు అన్నారు. ఉప ఎన్నికల్లో జనం చంద్రబాబును ఛీకొట్టారని,. ఎక్కడా డిపాజిట్లు కూడా దక్కలేదన్నారు. ఢిల్లీ ఆదేశాల మేరకే టీడీపీ పనిచేస్తోందని ఆయన ఆరోపించారు.
చంద్రబాబు టీడీపీ అధ్యక్షుడిగా ఉండగా పార్టీ బాగుపడదని కొడాలి నాని అన్నారు. తన సస్పెన్షన్ పై న్యాయ పోరాటం చేస్తానని ఆయన తెలిపారు. చంద్రబాబుతో పాటు తనపై ఆరోపణలు చేసిన వారంతా బహిరంగ క్షమాపణ చెప్పాలని నాని డిమాండ్ చేశారు. తనపై సస్పెన్షన్ ఎత్తివేసి, బహిరంగ క్షమాపణ చెబితే తాను తెలుగుదేశం పార్టీలో కొనసాగుతానన్నారు. ఒకవేళ తనపై సస్పెన్షన్ ఎత్తివేయకుంటే వైఎస్ జగన్ తో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు.
చంద్రబాబు నియంత్రలా వ్యవహరిస్తున్నారని కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కొడుకును రాజకీయాల్లోకి తెచ్చేందుకు కుతంత్రాలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు తీరుతో ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుందన్నారు. అవినీతి చక్రవర్తికి మారుపేరు అయిన బాబు రాజ్యసభ సీటును రూ.300 కోట్లకు అమ్ముకున్నారని ఆరోపించారు. డబ్బులకు అమ్ముడపోయే వ్యక్తినే అయితే తాను వైఎస్ఆర్ హయంలోనే కాంగ్రెస్ పార్టీలో చేరేవాడినని నాని తెలిపారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులతో చర్చించి భవిష్యత్ కార్యచరణపై నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. దేవినేని ఉమ తన తమ్ముడిని ఎంతకు అమ్మారో చెప్పాలని నాని డిమాండ్ చేశారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment