YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Thursday, 12 July 2012

జగన్‌కు, ప్రజలకు క్షమాపణలు చెప్పాలి

ముఖ్యమంత్రి అబద్ధాలు చెప్పారు
జీవోలపై హైకోర్టుకు ఎందుకు జవాబు చెప్పలేదు?
ఇపుడు మంత్రుల కోసం సుప్రీంకు జవాబివ్వడం కుట్ర కాదా?

హైదరాబాద్, న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చెయ్యని నేరానికి అన్యాయంగా అరెస్టు కావడానికి కారణమైన రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు, రాష్ట్ర ప్రజలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని ఆ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు జూపూడి ప్రభాకరరావు డిమాండ్ చేశారు. ఆయన గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జగన్‌పై మాజీ మంత్రి శంకర్‌రావు కేసు వేసినపుడు 26 జీవోలపై సమాధానం ఇవ్వని ప్రభుత్వం.. ఇపుడు మంత్రులు ఇరకాటంలో పడతారని భావించి వారి తరఫున అవి సక్రమమేనని సుప్రీంకోర్టుకు వివరణ ఇవ్వడానికి సిద్ధపడుతోందని విమర్శించారు. జీవోల జారీ మంత్రివర్గ సమష్టి నిర్ణయం అయినప్పటికీ హైకోర్టుకు మాత్రం ఆ విషయం విన్నవించలేదన్నా రు. 

మంత్రులకు న్యాయసహాయం అందిస్తున్న ప్రభుత్వం గతంలో హైకోర్టుకు ఎం దుకు సమాధానం చెప్పలేదని సీఎంను ప్రశ్నిస్తే.. జగన్ కేసులో రాష్ట్ర ప్రభుత్వం ఒక పార్టీ కాదని కిరణ్‌కుమార్ రెడ్డి చెప్పడం శుద్ధ అబద్ధమని జూపూడి ధ్వజమెత్తారు. ఈ కేసులో ఇం ప్లీడ్ అయిన టీడీపీ నేతలు కె.ఎర్రన్నాయుడు, అశోక్ గజపతి రాజు వేసిన పిటిషన్‌లో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం పార్టీలుగా ఉన్నాయని జూపూడి వివరించారు. అందుకు సంబంధించిన కోర్టు ప్రతులను విలేకరులకు ప్రదర్శించారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి కూడా ఇందులో పార్టీగా ఉన్నారని పేర్కొన్నారు.

నాడు ప్రభుత్వం సమాధానం చెప్పనందుకే దర్యాప్తు

హైకోర్టు ఇచ్చిన తీర్పు పాఠంలోని 41వ పేరాలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి జీవోలపై ఎలాంటి సమాధానం రానందునే తాము జగన్ ఆస్తులపై విచారణకు ఆదేశించాల్సి వస్తోందని పేర్కొన్నట్లు జూపూడి గుర్తుచేశారు. కావాలనే రాష్ట్ర ప్రభుత్వం జగన్‌పై విచారణ జరిగేలా చేసి ఆ వ్యవహారం సీబీఐ చేతికి వెళ్లే విధంగా వ్యవహరించిందని ఆయన అన్నారు. సీబీఐ మాత్రం తన విధులను విస్మరించి వ్యక్తిగత కక్షతో జగన్‌పై అభియోగాలు మోపి జైల్లో పెట్టిందని జూపూడి విమర్శించారు. కిరణ్ ఓ వైపు అసలు ఈ జీవోల జారీలో ఎలాంటి ‘క్విడ్ ప్రొ కో’ లేదని చెబుతున్నారని, కానీ గతంలో హైకోర్టుకు అదే విషయం ఆయన చెప్పకుండా నాటకాలాడారని దుయ్యబట్టారు. ‘‘మంత్రులు నిబంధనల్లో భాగంగానే జీవోలు ఇస్తే ఇక ఎవరి తప్పూ లేనట్లే కదా! జగన్‌ను అన్యాయంగా జైల్లో పెట్టడానికి జరిగిన కుట్ర వల్లనే గతంలో స్పందించలేదనేది అర్థం అవుతోందని కదా’’ అని అన్నారు. టీడీపీ మాయలో పడి అపుడు హైకోర్టుకు సమాధానం చెప్పని ప్రభుత్వం ఇపుడు తన మంత్రులను ఎలాగైనా బయటకు తీసుకు రావాలని చూస్తోందని జూపూడి చెప్పారు. అన్యాయంగా జగన్‌ను ఒక నిందితుడిగా చూపే యత్నం చేసి ఆయన కుటుంబాన్ని రోడ్డుమీదకు తీసుకు వచ్చినందుకు ప్రభుత్వం లెంపలు వేసుకోవాలన్నారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!