YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Friday, 13 July 2012

రాష్ట్రపతి ఎన్నిక తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో కీలక నిర్ణయాలు!

తెలంగాణ, వైఎస్సార్ కాంగ్రెస్‌ల చుట్టే హస్తినలో చర్చలు

హైదరాబాద్, న్యూస్‌లైన్: రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు తప్పవా? రాష్ట్రానికి సంబంధించి కేంద్రం కీలక నిర్ణయాలు ప్రకటించనుందా? ఆంధ్రప్రదేశ్‌లో పూర్తిగా దెబ్బతిన్న కాంగ్రెస్‌కు కాయకల్ప చికిత్స చేయాలని నిశ్చయించిన ఆ పార్టీ అధిష్టానం, చేయాల్సిన పెను మార్పులపై ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టిందా? రాష్ట్ర రాజకీయ పార్టీల్లో ఇప్పుడిదే హాట్ టాపిక్‌గా మారింది. రాష్ట్రపతి ఎన్నిక, ఆగస్టు తొలి వారంలో ఉప రాష్ట్రపతి ఎన్నికలయ్యాక రాష్ట్రంలో కీలక మార్పులుంటాయని గట్టిగా విన్పిస్తోంది. రాష్ట్ర పరిణామాలు, సంస్థాగతంగా పార్టీ బాగా బలహీనపడ్డ వైనాలపై తొలుత ఉదాసీనంగా వ్యవహరించిన అధిష్టానం, తాజా ఉప ఎన్నికల ఫలితాలు చూసి బెంబేలెత్తింది. దేశంలోకెల్లా అత్యధిక లోక్‌సభ స్థానాలు అందించిన రాష్ట్రంలో ఇంతటి దైన్యానికి కారణమేమిటంటూ తర్జనభర్జన పడుతోంది. రాష్ట్ర నేతల నివేదికలు చూసి, అంతా సవ్యంగానే ఉందని పొరబడ్డామని, ప్రక్షాళన అనివార్యమని భావిస్తున్నట్టు సమాచారం. ఎలా చూసినా కీలక మార్పులు చేస్తే తప్ప రాష్ట్రంలో పార్టీని గాడిలో పెట్టలేమన్న కచ్చితమైన అభిప్రాయానికి వచ్చినట్టు చెబుతున్నారు. ఒకవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఎదుర్కోవడం, మరోవైపు తెలంగాణ అంశాన్ని పరిష్కరించడం ఎలాగన్న రెండు అంశాల చుట్టే చర్చలు సాగుతున్నాయి. వీటిని దృష్టిలో ఉంచుకుని, మున్ముందు కాంగ్రెస్‌కు రాజకీయంగా లాభదాయకమనుకున్న కోణంలోనే నిర్ణయాలుంటాయని చెబుతున్నారు. ఆ క్రమంలోనే రాష్ట్రం నుంచి ఎంతమంది నాయకులొచ్చినా ఎవరినీ కాదనకుండా ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ అపాయింట్‌మెంట్ ఇస్తున్నారు. చెప్పేదంతా వింటూ, వారిచ్చే నివేదికలు తీసుకుంటున్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శి రాహుల్‌గాంధీ కూడా రాష్ట్రంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. నేతలను ఒక్కొక్కరుగా పిలిపించుకుని మరీ చర్చలు జరుపుతున్నారు. ప్రధానంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవడంపైనే పరోక్షంగా వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆయన్ను కలిసిన నేతలంటున్నారు.

అనేక ప్రతిపాదనలు..

చర్చలు, సంప్రదింపుల నేపథ్యంలో అనేక ప్రతిపాదనలు అధిష్టానం ముందుకొచ్చినట్టు తెలుస్తోంది. రాష్ట్ర విభజనతో రాజకీయంగా కాంగ్రెస్‌కొచ్చే లాభనష్టాల బేరీజు, ప్రాంతాలవారీగా బలాబలాల సమీక్ష, జగన్‌కు అడ్డుకట్ట, పొత్తులు, భావి సమీకరణలపై ఢిల్లీ నేతలు దృష్టి సారించారు. తెలంగాణ ఇచ్చేస్తే రాజకీయంగా జరిగే మార్పులు, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పరిస్థితి, కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో వచ్చే సీట్లు తదితరాలపై మల్లగుల్లాలు పడుతున్నట్టు చెబుతున్నారు. ‘‘తెలంగాణ ఇవ్వకుండా ఇంకేమైనా ప్రత్యామ్నాయాలున్నాయా, వాటితో వచ్చే ఎన్నికల్లో లాభమా, నష్టమా వంటి అంశాలనూ అధిష్టానం లోతుగా పరిశీలిస్తోంది. తెలంగాణ అంశాన్ని ఎన్నికల దాకా నాన్చితే జరిగే పరిణామాలతో పాటు రాష్ట్రంలో మార్పుచేర్పులనూ అధిష్టానం బేరీజు వేస్తోంది. అయితే ఏ నిర్ణయం తీసుకున్నా చివరికి వైఎస్సార్ కాంగ్రెస్‌ను అడ్డుకునేలానే ఉండాలి. దాంతోపాటు అంతిమంగా రాష్ట్రం నుంచి అత్యధిక లోక్‌సభ స్థానాలు గెలుచుకోవాలన్నదే పెద్దల అభిమతం’’ అని పీసీసీ ముఖ్య నేత ఒకరన్నారు.

సంచలన ప్రకటన..?

రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలయ్యాక రాష్ట్ర రాజకీయాల్లో సంచలన మార్పుచేర్పులుంటాయని గట్టిగా విన్పిస్తోంది. అయితే అవి ఎలాంటివన్న విషయం మాత్రం ఎవరూ కచ్చితంగా చెప్పలేకపోతున్నారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన చేస్తుందని కొందరు, నాయకత్వ మార్పు వరకే పరిమితమవుతారని మరికొందరు అంటున్నారు. ఏదో ఒక మార్పు మాత్రం తప్పదని అధిష్టానం ఇప్పటికే పలువురు నేతలకు సంకేతాలిచ్చింది. వాటి ఆధారంగానే వారు ప్రాంతాలవారీ విశ్లేషణల్లో మునిగిపోయారు. తెలంగాణపై ఇంకా నానిస్తే నష్టమేనని, ఏదో ఒకటి తేల్చాలనే ఇటీవల పెద్దలను వరుగా కలుస్తున్న కాంగ్రెస్ నేతలంతా కోరుతున్నారు. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కూడా ఈ మధ్య ఎక్కడ మాట్లాడినా, తెలంగాణపై త్వరలోనే కీలక నిర్ణయం వస్తుందని చెబుతున్నారు. ఢిల్లీ నేత ఒకరు కేసీఆర్‌తో సంప్రదింపుల్లో ఉన్నందుకే ఆయన అంత గట్టిగా చెబుతున్నారని టీఆర్‌ఎస్ వర్గాలంటున్నాయి. కానీ ఢిల్లీ వెళ్లొచ్చిన నేతలు మాత్రం, కేంద్రంలో ఆ స్థాయిలో కదలికలేమీ లేవని చెబుతున్నారు. తెలంగాణ అంశం దేశ ప్రయోజనాలతో ముడిపడి ఉందన్న సీఎం కిరణ్ తాజా వ్యాఖ్యలను గుర్తు చేస్తున్నారు.

ఏం జరుగుతోంది ... రాష్ట్ర నేతలతో రాహుల్ ఆరా
రాష్ట్రానికి చెందిన పలువురు కాంగ్రెస్ నేతలతో రాహుల్‌గాంధీ ఇటీవల వరుసగా భేటీ అవుతున్నారు. కొందరు అపాయింట్‌మెంటు తీసుకొని వెళ్తుంటే, మరికొందరిని రాహులే పిలిపించుకొని చ ర్చిస్తున్న వైనం రాష్ట్ర కాంగ్రెస్‌లో చర్చనీయంగా మారింది. ఎంపీలతో పాటు సీనియర్ నాయకులతో కూడా చర్చిస్తున్నారు. ఎంపీలు కావూరి సాంబశివరావు, రాయపాటి సాంబశివరావు, ఎస్పీవై రెడ్డి, మధు యాష్కీ, గుత్తా సుఖేందర్‌రెడ్డి, మందా జగన్నాథం, పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి, మంత్రులు టీజీ వెంకటేశ్, ఎరాసు ప్రతాప్‌రెడ్డి, ఎమ్మెల్సీలు పాలడుగు వెంకటరావు, కేఆర్ ఆమోస్, రుద్రరాజు పద్మరాజు తదితరులు ఆయన్ను కలిశారు. దీని ఆంతర్యంపై పలురకాల విశ్లేషణలు సాగుతున్నాయి. వారితో ఏం మాట్లాడుతున్నారు, ఏం అడుగుతున్నారు, వారేం చెబుతున్నారన్నవి ఆసక్తికరంగా మారాయి. రాష్ట్ర సమస్యలపై లోతైన అవగాహన పెంచుకునేందుకు రాహుల్ ప్రాధాన్యమిస్తున్నారని ఆయన్ను కలిసొచ్చిన నేతలంటున్నారు. పార్టీ, ప్రభుత్వ పరిస్థితులపై ఆరా తీయడంతో పాటు అంతర్గత సమస్యలు, అధిగమించే వ్యూహాలపై రాహుల్ ప్రశ్నలు వేస్తున్నారు. సీఎం కిరణ్, పీసీసీ చీఫ్ బొత్స పనితీరు, వైఎస్సార్ కాంగ్రెస్‌తో ఎదురవుతున్న సమస్యలు, టీడీపీ స్థితిగతులతో పాటు తెలంగాణపైనా ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ అంశంపైనే ఎక్కువ ప్రశ్నలు వేశారని నేతలంటున్నారు. ప్రధాని అభ్యర్థిగా రాహుల్‌ను ఫోకస్‌లోకి తెచ్చే క్రమంలో దేశ పరిస్థితులపై ఆయనకు అవగాహన కల్పించేందుకే ఇదంతా జరుగుతోందని చెబుతున్నారు. ఇతర రాష్ట్రాల నేతలతోనూ రాహుల్ ఇలాగే భేటీ అవుతున్నారని గుర్తు చేస్తున్నారు. రాహుల్ పెద్దగా ప్రశ్నలు వేయకుండా, నేతలు చెప్పేది వినేందుకే ప్రాధాన్యమిస్తున్నారని ఆయన్ను కలిసొచ్చిన సీనియర్లు వివరించారు. అంతే తప్ప ఏ విషయం మీదా తన అభిప్రాయం ఇదీ అని కూడా చెప్పడం లేదన్నారు!

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!