YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Tuesday, 10 July 2012

విద్యుత్ సంక్షోభం తీవ్రం... కరెంటు కోతలు భారీగా పెంపు


విద్యుత్ సంక్షోభం తీవ్రం... కరెంటు కోతలు భారీగా పెంపు 
హైదరాబాద్‌లో 3, జిల్లా కేంద్రాల్లో 5 గంటలు కట్
మండలాల్లో 7 గంటలు, గ్రామాల్లో 12 గంటలు కోతలు 
పరిశ్రమలకు వారంలో ఐదు రోజులు విద్యుత్ కట్ 
సిమెంటు, స్టీలు, ఫార్మాలకు నెలలో 16 రోజులు కోత 
అదను సమయంలో వ్యవసాయానికీ విద్యుత్ కరువు... 
గతంలో ఎన్నడూ లేని గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్న రాష్ట్రం 
ఈ ఏడాదే రూ. 6 వేల కోట్ల చార్జీలు పెంచి.. సరఫరా మరిచారు
సంక్షోభ నివారణ చర్యలపై రాష్ట్ర సర్కారు నిర్లిప్తం
ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టిపెట్టని వైనం

హైదరాబాద్, న్యూస్‌లైన్: రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం మరింత తీవ్రమవుతోంది. రోజురోజుకూ విద్యుత్ కోతలు పెరిగిపోతున్నాయి. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వర్షాకాలంలోనూ ఉక్కపోత అనుభవించాల్సి వస్తోంది. ఎన్ని గంటలు, ఎన్ని రోజులు విద్యుత్ కోతలు అమలవుతున్నాయని కాకుండా.. ఎన్ని గంటలు, రోజులు విద్యుత్ సరఫరా అవుతుందని లెక్కవేసుకునే విధంగా పరిస్థితులు దిగజారాయి. విద్యుత్ పంపిణీ సంస్థలు తాజాగా కరెంటు కోతలను మరింతగా పెంచాయి. 

పరిశ్రమలకు ప్రస్తుతం వారానికి మూడు రోజులుగా ఉన్న కరెంటు కోతలను నాలుగు రోజులకు పెంచారు. ఇవి సోమవారం (9వ తేదీ) నుంచే అమలులోకి వచ్చాయి. పరిశ్రమలకు ఈ కోతలే కాకుండా.. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కూడా కేవలం లైటింగ్‌కు మాత్రమే విద్యుత్ సరఫరా అవుతుంది. అంటే ఇది కూడా కలుపుకుంటే వారానికి మరో రోజు అవుతుంది. అంటే పరిశ్రమలకు విద్యుత్ సరఫరా అయ్యేది వారంలో కేవలం రెండే రెండు రోజులన్నమాట. ఇక.. స్టీలు, సిమెంటు, ఫార్మా వంటి నిరంతరం నడిచే (కంటిన్యూయస్ ప్రాసెసింగ్) పరిశ్రమలకు మొత్తం డిమాండ్‌లో 50 శాతం విద్యుత్‌ను మాత్రమే సరఫరా చేస్తామని విద్యుత్ సంస్థలు తేల్చిచెప్పాయి. మిగిలిన 50 శాతం కోతలు విధిస్తామని చెప్పాయి. లేనిపక్షంలో వరుసగా నెలకు 16 రోజుల మేరకు (ప్రస్తుతం 12 రోజుల కోత ఉంది) విద్యుత్‌ను నిలిపివేస్తామని స్పష్టం చేశాయి. 

ఈ మేరకు విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు తాజాగా ఆదేశాలు జారీచేశాయి. చిన్నతరహా పరిశ్రమలకూ విద్యుత్ కోతల వాత తప్పలేదు. వీటికి కూడా వారంలో ఐదు రోజుల విద్యుత్ కోతలు అమలులోకి వచ్చాయి. దీంతో పరిశ్రమలన్నీ మూసివేత దశకు చేరుకుంటున్నాయి. ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే పరిస్థితి ఈ విధంగా ఉందంటే ఇక భవిష్యత్తు అగమ్యగోచరంగా తయారైంది. పరిశ్రమలను ఇక తాము మూసుకోవాల్సిందేనని ఆంధ్రప్రదేశ్ చిన్నతరహా పరిశ్రమల సంఘాల సమాఖ్య (ఫ్యాప్సియా) అధ్యక్షుడు ఎ.పి.కె.రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు గ్రామాల్లో పరిస్థితి చెప్పనలవి కాదు. రోజుకు 12 గంటల నుంచి 15 గంటల వరకూ విద్యుత్ కోతలు అమలవుతున్నాయి. కరెంటు ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని దయనీయ స్థితిలో గ్రామాలున్నాయి. జిల్లా కేంద్రాల్లో కూడా నాలుగు గంటలుగా ఉన్న విద్యుత్ కోతలు 5 గంటలకు పెరిగాయి. మండల కేంద్రాలు, మునిసిపాలిటీలల్లో 6 గంటల నుంచి 7 గంటలకు కోతల సమయం పెరిగింది. ఇంతచేసి వ్యవసాయానికైనా సక్రమంగా ఏడు గంటలు కరెంటు వస్తోందా? అంటే అదీ లేదు. దీంతో అటు వర్షాలు లేక ఇటు కరెంటు లేక వేసిన విత్తులు కాస్తా మొగ్గలోనే వాడిపోతున్నాయి. 

చార్జీలు పెంచారు... సరఫరా మరిచారు!

గతంలో ఎన్నడూ లేని విధంగా 2012-13 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ. 4,500 కోట్ల విద్యుత్ చార్జీల భారాన్ని ఏప్రిల్ 1 నుంచి రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై మోపింది. దీనికితోడు తాజాగా మరో రూ. 1,481 కోట్ల సర్దుబాటు చార్జీల (ఎఫ్‌ఎస్‌ఏ) భారాన్ని కూడా ఈ ప్రభుత్వం జూలై నుంచే ప్రజలపై బాదటం ప్రారంభించింది. చార్జీలు పెంచిన సందర్భంగా సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఒక ప్రకటన చేస్తూ ‘‘ప్రజలకు నాణ్యమైన విద్యుత్‌ను మెరుగ్గా సరఫరా చేసేందుకే చార్జీలు పెంచాం’’ అని చెప్పారు. అయితే.. విద్యుత్ చార్జీలైతే పెంచారు కానీ.. సరఫరా మాత్రం మెరుగుపడకపోగా మరింతగా క్షీణించటం విశేషం. రోజురోజుకూ కోతల సమయం పెరుగుతూనే ఉంది. అయినప్పటికీ విద్యుత్ సరఫరాను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కనీస చర్యలు తీసుకోవటం లేదు. అదనపు విద్యుత్ కొనుగోలుకు ససేమిరా అంటోంది. రిలయన్స్ సంస్థ నిర్వాకం వల్ల గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్రాజెక్టులకు గ్యాస్ సరఫరా తగ్గింది. ఈ స్థానంలో ప్రత్యామ్నాయ గ్యాస్ కొనుగోలు చేసి, విద్యుత్ ఉత్పత్తిని పెంచేందుకు ప్రభుత్వం ఏ ప్రయత్నమూ చేయటం లేదు. కేంద్రం నుంచి అదనపు విద్యుత్‌ను రాబట్టేందుకూ పెద్ద ప్రయత్నాలేమీ చేయడం లేదు.

డిమాండ్ - సరఫరా పరిస్థితి ఇదీ... 

రాష్ట్రంలో ఈ నెల 9న (సోమవారం) విద్యుత్ డిమాండ్ 250 మిలియన్ యూనిట్లు (ఎంయూలు)గా నమోదైంది. సరఫరా 215.8 ఎంయూలు మాత్రమే జరిగింది. మిగిలిన 34.2 ఎంయూల మేరకు విద్యుత్ కోతలు అమలవుతున్నాయి. గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంట్లకు గ్యాస్ లేకపోవటంతో వాటిలో విద్యుత్ ఉత్పత్తిఅంతంత మాత్రంగానే ఉంది. జలాశయాల్లోనూ నీరు లేకపోవటంతో జల విద్యుత్ ఉత్పత్తి దారుణంగా పడిపోయింది. జల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 72 ఎంయూలు కాగా.. ప్రస్తుతం ఉత్పత్తి అవుతోంది 5 ఎంయూలు మాత్రమే. గ్యాస్ ఆధారిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 2,770 మెగావాట్లు కాగా, ఉత్పత్తి అవుతోంది 1,100 మెగావాట్లు మాత్రమే. డిమాండ్‌కు, సరఫరాకు తీవ్రలోటు ఏర్పడిన ఈ పరిస్థితుల్లో అదనపు విద్యుత్ కొనుగోలుకు ప్రభుత్వం ఏ చర్యలూ తీసుకోవటం లేదు. ఫలితంగా వ్యవసాయానికీ విద్యుత్ సరఫరా పడిపోయింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 9,362 వ్యవసాయ ఫీడర్లలో కేవలం 1,045 ఫీడర్లకు ఏడు గంటల కంటే తక్కువగా విద్యుత్‌ను సరఫరా చేశామని డిస్కంలే చెప్తున్నాయి. ఇవి అధికారిక లెక్కలు. అనధికారికంగా ఈ ఫీడర్ల సంఖ్య నాలుగు వేలకు పైగా ఉంటుందని అధికారులే చెప్తున్నారు. అంటే సుమారు సగం వ్యవసాయ ఫీడర్లకు ఏడు గంటల విద్యుత్ మిథ్యగానే మారిందన్నమాట.

కొరత తీర్చే ప్రయత్నాలేవీ..? 

రాష్ట్రంలో విద్యుత్ కోతలను మొత్తంగా కాకపోయినా సాధ్యమైనంత మేరకు తగ్గించే వీలు ఉంది. ఇందుకోసం ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి 2008లో రాష్ట్రంలో పంటలను కాపాడటం కోసం, ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడటం కోసం ఏకంగా రూ. 6 వేల కోట్ల మేరకు వెచ్చించి అదనపు విద్యుత్ కొనుగోలు చేశారు. అయితే, ప్రస్తుత ప్రభుత్వం మాత్రం ఆ దిశగా కనీస ప్రయత్నం కూడా చేయటం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విద్యుత్ కొరత నివారణకు నిపుణులు చూపిస్తున్న మార్గాలివీ...
కృష్ణా-గోదావరి బేసిన్‌లో రిలయన్స్ సంస్థ గ్యాస్ ఉత్పత్తి తగ్గిపోయిన కారణంగా.. గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంట్లకు కేవలం 38 శాతం ప్లాంటు లోడ్ ఫ్యాక్టర్ (పీఎల్‌ఎఫ్)కు మాత్రమే గ్యాస్ వస్తోంది. ఫలితంగా 1600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా ఆర్-ఎల్‌ఎన్‌జీను వినియోగించి 500 మెగావాట్ల వరకు అదనపు విద్యుత్‌ను ఉత్పత్తి చేయటానికి అవకాశం ఉంది. 
గ్యాస్ స్థానంలో ప్రత్యామ్నాయంగా ఆర్-ఎల్‌ఎన్‌జీతో పాటు నాఫ్తాను కూడా వినియోగించే అవకాశం ఉంది. తద్వారా మరో 500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అవకాశం ఉంది. 
కేంద్ర విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు చెందిన కొంత విద్యుత్‌ను ఏ రాష్ట్రాలకూ కేటాయించకుండా కేంద్రం తన వద్ద ఉంచుకుంటుంది. ఆయా రాష్ట్రాల్లో విద్యుత్ లోటును బట్టి ఈ విద్యుత్‌ను కేటాయిస్తుంది. ఈ విద్యుత్‌లో కేరళ 150 మెగావాట్లను తన్నుకుపోయింది. కేరళలో విద్యుత్ కోతలే లేవు. సర్కారు ప్రయత్నిస్తే ఈ విద్యుత్‌ను రాష్ట్రానికితీసుకురావచ్చు. 
హర్యానాలోని జజ్జర్ వద్ద ఎన్‌టీపీసీ విద్యుత్ ప్లాంటు నుంచి మనకు సకల జనుల సమ్మె కాలంలో 231 మెగావాట్ల విద్యుత్‌ను కేటాయించారు. అయితే, తాజాగా జూలై 1 నుంచి ఇందులో నుంచి కర్ణాటక 100 మెగావాట్లను ఎగరేసుకుపోయింది. కర్ణాటకకు చెందిన కేంద్ర విద్యుత్‌శాఖ సహాయ మంత్రి ఒత్తిడే ఇందుకు కారణం. వాస్తవానికి కర్ణాటకలోనూ విద్యుత్ సరఫరా పరిస్థితి మెరుగ్గా ఉంది. ఈ నేపథ్యంలో కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి.. 100 మెగావాట్ల విద్యుత్ మళ్లీ మనకే వచ్చే విధంగా చేసుకునే వీలుంది.
చివరి అవకాశంగా.. మార్కెట్లో అధిక ధరకు విద్యుత్‌ను కొనుగోలు చేయవచ్చు. యూనిట్ ధర రూ. 8 నుంచి రూ. 10 పలుకుతున్న పరిస్థితుల్లో విద్యుత్ సంస్థలు ఈ ధైర్యం చేయలేవు. కాబట్టి.. ప్రభుత్వమే ఈ భారాన్ని భరించి విద్యుత్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!