YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Friday, 13 July 2012

సీబీఐ నన్ను టార్గెట్ చేసింది: నిమ్మగడ్డ ప్రసాద్

బెయిల్ పిటిషన్‌పై విచారణలో నిమ్మగడ్డ ప్రసాద్ వెల్లడి
విచారణకు పూర్తిగా సహకరించినా అరెస్టు చేశారు
ఇతర పెట్టుబడిదారులంతా బయటే ఉన్నారు
విచారణ ఈనెల 16కి వాయిదా

హైదరాబాద్, న్యూస్‌లైన్: వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారంలో మొదటి చార్జిషీట్‌లో నిందితులుగా ఉన్న పెట్టుబడిదారులంతా బయటే ఉన్నారని, వాన్‌పిక్ సంస్థల అధినేత నిమ్మగడ్డ ప్రసాద్‌ను సీబీఐ లక్ష్యంగా చేసుకొందని ఆయన తరపు న్యాయవాది రాజశేఖర్ సీబీఐ ప్రత్యేక కోర్టుకు నివేదించారు. విచారణకు ప్రసాద్ సహకరించినప్పటికీ, సీబీఐ ఆయన్ని అరెస్టు చేసిందని తెలిపారు. బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ నిమ్మగడ్డ ప్రసాద్ దాఖలు చేసిన పిటిషన్‌ను ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి యు.దుర్గాప్రసాద్‌రావు శుక్రవారం మరోసారి విచారించారు. ఈ సందర్భంగా రాజశేఖర్ వాదనలు వినిపిస్తూ.. నిమ్మగడ్డ ప్రసాద్ సీబీఐ దర్యాప్తునకు పూర్తిగా సహకరించారని, ఆయనకు తెలిసిన అన్ని విషయాలను చెప్పారని తెలిపారు. ప్రసాద్ 8 సార్లు మాత్రమే విచారణకు హాజరైనట్లు సీబీఐ చెబుతోందని, అయితే, ఆయన 13 సార్లు విచారణకు హాజరయ్యారని, ఇందుకు సంబంధించిన ఆధారాలను కోర్టు ముందుంచేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. సీబీఐ కేసు డైరీని నిర్వహించడంలేదని, 13 సార్లు హాజరైనా 8 సార్లు మాత్రమే వచ్చారంటూ కోర్టుకు తప్పుడు సమాచారం ఇస్తోందని ఆరోపించారు. ఇక్కడే సీబీఐ దురుద్దేశం బయటపడుతోందన్నారు. సీబీఐ విచారణకు పిలిచే ముందురోజు వ్యాపార పనుల్లో భాగంగా ప్రసాద్ విదేశాలకు వెళ్లాల్సి ఉందని, అయితే చట్టం మీద గౌరవంతోనే ఆయన విదేశీ పర్యటనను రద్దు చేసుకొని సీబీఐ ఎదుట హాజరయ్యారని తెలిపారు. నిమ్మగడ్డ ప్రసాద్ తప్పు చేసి ఉంటే విదేశాలకు పారిపోయి ఉండేవారని, చట్టబద్ధంగానే లాభాల కోసమే జగన్‌మోహన్ రెడ్డి సంస్థలతోపాటు అనేక సంస్థల్లో పెట్టుబడులు పెట్టారని వివరించారు. 

స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అభివృద్ధికి నోచుకోని వెనుకబడిన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే రస్ అల్ ఖైమా (రాక్)తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని తెలిపారు. ఇందులో భాగంగా పోర్టులకు 4 వేల ఎకరాలు, పారిశ్రామికవాడకు 18 వేల ఎకరాలు కేటాయించిందని చెప్పారు. ఇందులో 13 వేల ఎకరాలు స్వాధీనం చేసుకున్నారని, ఈ భూములకు మార్కెట్ ధర చెల్లించారని తెలిపారు. జీవోల్లోని నిబంధనల మేరకే వీటిని కొనుగోలు చేశారని, ఇందులో ప్రభుత్వానికి ఒక్క పైసా కూడా నష్టం లేదని వివరించారు. రాక్‌తో కలిసి వ్యాపార భాగస్వామిగా రూ.20 వేల కోట్ల ఖర్చుతో ఈ ప్రాంతంలో పారిశ్రామికవాడ, పోర్టులను అభివృద్ధి చేసి ఉపాధి కల్పించాలని ప్రసాద్ భావించారని, ఇప్పటికే కొన్ని కోట్లు ఖర్చు చేశారని చెప్పారు. 2006 డిసెంబర్ నుంచే జగన్ సంస్థల్లో ప్రసాద్ పెట్టుబడులు పెట్టారని తెలిపారు. లాభాల కోసమే ఆయన పెట్టుబడులు పెట్టారని చెప్పారు. పెట్టుబడులు పెట్టడమే నిమ్మగడ్డ ప్రసాద్ వ్యాపారమని వివరించారు. 

వాన్‌పిక్‌కు చెందిన 17 మంది ఉద్యోగులు లెక్కలేనన్ని సార్లు సీబీఐ ఎదుట హాజరై అన్ని వివరాలు సమర్పించారని, ట్రక్కుల్లో డాక్యుమెంట్లను తెచ్చి సీబీఐకి అందజేశారని పేర్కొన్నారు. నిమ్మగడ్డ ప్రసాద్ ఒక్క డాక్యుమెంట్ కూడా ఇవ్వలేదని, ఆయన ఉద్యోగుల ద్వారా తీసుకున్నామని సీబీఐ ఆరోపిస్తోందని, అయితే... ప్రసాద్ అనుమతి లేకుండా ఉద్యోగులు సీబీఐకి సమాచారం ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నించారు. గంగవరం, కృష్ణపట్నం పోర్టుల తరహాలో ఈ ఒప్పందం లేదని సీబీఐ ఆరోపిస్తోందని, అన్ని ఒప్పందాలు ఒకేలా ఉండాల్సిన అవసరం లేదని అన్నారు. నిజాంపట్నం, వాడరేవుల అభివృద్ధితోపాటు పారిశ్రామికవాడ ఏర్పాటుకు రాక్ ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని, ఇందులో నిమ్మగడ్డ మన దేశం తరపున వ్యాపార భాగస్వామి మాత్రమేనని పేర్కొన్నారు. ఒప్పందం చేసుకున్న వాళ్లను వదిలేసి భాగస్వామిగా ఉన్న నిమ్మగడ్డను అరెస్టు చేశారన్నారు. డ్రాఫ్ట్ ఒప్పందానికి, ఎంఓయూకు ఎటువంటి మార్పు లేదని, అన్ని విభాగాల పరిశీలన, మంత్రి మండలి ఆమోదం తర్వాతే ఒప్పందానికి ఆమోదముద్ర వేశారని వివరించారు. బెయిల్ పిటిషన్‌పై సీబీఐ వాదనల కోసం తదుపరి విచారణను కోర్టు ఈనెల 16కు వాయిదా వేసింది.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!