టీడీపీ పాలిట్‌బ్యూరో మాజీ సభ్యురాలు ఉప్పులేటి కల్పన గురువారం మధ్యాహ్నం వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు విజయమ్మను ఆమె నివాసంలో కలుసుకున్నారు. అంతకుముందు ఉదయం ఆమె చంచల్‌గూడ జైలులో పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డిని కలిశారు. విజయమ్మతో కొద్ది సేపు సమావేశమైన అనంతరం నివాసం బయట మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ త్వరలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరతానని ప్రకటించారు. తన నియోజకవర్గానికి వెళ్లి అక్కడ కార్యకర్తలు, శ్రేయోభిలాషులతో సమావేశమై పార్టీలో చేరే విషయాన్ని వెల్లడిస్తానని వివరించారు. నెల్లూరు ఎం.పి మేకపాటి రాజమోహన్ రెడ్డికి మాతృ వియోగం సంభవిస్తే ఆయన కుటుంబంతో సన్నిహిత సంబంధాలున్న వ్యక్తిగా పరామర్శించడానికి ఆయన కార్యాలయానికి వెళ్లి కలిసిన కొద్ది సేపట్లోనే తనను టీడీపీ నుంచి సస్పెండ్ చేస్తూ ఆ పార్టీ ప్రకటించడం అన్యాయం, దారుణం అనీ దీన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నాననీ కల్పన తెలిపారు.
పార్టీ నుంచి తనను బహిష్కరించి నందుకే జగన్ వైపు నిలబడాలనే ఉద్దేశ్యంతో విజయమ్మను కలిశానని పేర్కొన్నారు. టీడీపీలో దళితులు, బడుగు బలహీనవర్గాలకు స్థానం లేదనీ అక్కడ అగ్రకులాలకు ఓ న్యాయం, దళితులకు మరొక న్యాయం జరుగుతోందని విమర్శించారు. తనను టీడీపీ నుంచి బలవంతంగా బయటకు పంపారనీ ఇపుడు స్వతంత్రురాలిననీ తనపై ఎలాంటి ఆంక్షలు లేవు కనుక జైలులో జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిసి ఆ తరువాత విజయమ్మను కలిశానని తెలిపారు. వాస్తవానికి తన నియోజకవర్గ కార్యకర్తలు ఏడాది నుంచే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరదామని ఒత్తిడి తెస్తున్నారనీ వారి అభీష్టానుసారం నడుచుకుంటానని అన్నారు.
‘విజయవాడలో వల్లభనేని వంశీ జగన్‌ను రోడ్డుపై కలిస్తే ఏమీ చేయలేదు...రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి జగన్‌తో మంతనాలు జరిపితే ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అంతెందుకు బాబు తానే స్వయంగా చిదంబరంను ఎవరికీ తెలియకుండా కలిశారు. మొన్న ప్రణబ్‌తో ఆయన ఫోన్‌లో మాట్లాడారు. కానీ నేను రాజమోహన్ రెడ్డిని కలిసినందుకే ఎలాంటి సంజాయిషీ గానీ, వివరణ గానీ కోరకుండా పార్టీ నుంచి సస్పెండ్ చేశారు’ అని ఆమె అన్నారు. సామాజిక సమతౌల్యం కోసమే తనను పాలిట్‌బ్యూరోలోకి తీసుకున్నారు తప్ప కీలక నిర్ణయాలు తీసుకునేటపుడు బాబు తమ సూచనలు, సలహాలు తీసుకున్నది లేదని ఆమె అన్నారు.
తాను 2004లో పార్టీలో చేరి ఎనిమిదేళ్లుగా కష్టపడి పనిచేస్తున్నాననీ డబ్బు, సమయం వృథా చేసుకున్నానని ఆమె వెల్లడించారు. కష్టపడి పనిచేసే వారికే పదవులు ఇస్తానని బాహాటంగా చెప్పే చంద్రబాబు ఆచరణలో అది చేయరని అన్నారు. ఎమ్మెల్సీ, రాజ్యసభ పదవులు వచ్చినపుడు కోట్లు ఎక్కువగా ఎక్కడి నుంచి వస్తాయో వారికే ఇచ్చారనీ పదవులను బాబు వేలం వేస్తున్నారని ఆమె ఆరోపించారు. ప్యాకేజీలు ఇస్తున్నందునే వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరుతున్నారని బాబు చేస్తున్న విమర్శలన్నీ కట్టుకథలనీ జగన్ వెంట జనం ఉన్నారు కనుకనే అందరూ వస్తున్నారని ఆమె ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఎన్నికోట్లు ఇస్తే జగన్ మాదిరిగా ప్రజాభిమానం పొందగలరని ఆమె అన్నారు.
కల్పనతో పాటుగా విజయమ్మను కలిసిన వారిలో వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ, పార్టీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎం.వి.ఎస్.నాగిరెడ్డి, కృష్ణా జిల్లా అడ్‌హాక్ కమిటీ కన్వీనర్ సామినేని ఉదయభాను, జిల్లా అధికార ప్రతినిధి ముత్తారెడ్డి ఉన్నారు.
No comments:
Post a Comment