YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Saturday, 14 July 2012

నారావారి పరువు ఏమి కావాలి?


సైకిల్ పార్టీ వాళ్లు చంచల్‌గూడ జైలు ముందు ఓ సస్పెన్షన్ కౌంటరు పెట్టుకుంటే సరి! వారి మందలోని ఎమ్మెల్యేనో, ఎంపీనో, మరొకరో శత్రువుతో ములాకత్ అయి బయటికి రాగానే గేటు దగ్గరే సస్పెన్షను పత్రం చేతికిస్తే వారికీ సుఖం. అందుకునే వారికీ సుఖం. వారూ వీరూ తిట్టుకునే తిట్లను లోకానికి వెదజల్లాల్సిన మీడియా నారదులకు మరీ సౌకర్యం. పనిలో పనిగా లోటస్‌పాండు గడీ దగ్గరా ఇంకో ఎక్స్‌టెన్షన్ కౌంటరు తెరిచి జగన్‌మాతను కలిసొచ్చే పాపులకూ అక్కడికక్కడే శుభలేఖ అందజేస్తే బెస్టు!
కులదీపకుడు బాబు ఏమి చేసినా, ఏమి చేయకపోయినా భళా అని ఆకాశానికెత్తడానికి మిత్ర మీడియా ఎప్పుడూ సిద్ధమే. అలాగని తాము ఏమి చేసినా చెల్లుతుందని బాబు దేశం ఆసాములు అహంకరిస్తే కాస్త డేంజరు. ఎందుకంటే రోజులు మారాయి. అన్నీ నమ్మి, మళ్లీ మళ్లీ మోసపోవడానికి జనం సిద్ధంగా లేరు. ఖర్మం చాలకపోతే మన ఆయుధం మనకే ఎదురుతిరగవచ్చు. ఎవరినో కలిసినంత మాత్రానే, అది పెత్తందారెవరికో ఒళ్లు మండించిన మాత్రానే ఎంతటివాడినైనా ఉన్నపళాన వేటువేయటం రైటు అని స్థిరం చేసే పక్షంలో రేపు అలాంటి వేటే నేటి పెత్తందార్లమీదా పడవచ్చు.
అసలే గ్రహచారం బాగా లేదు. చూస్తూనే ఉన్నాం కదా? ఒకప్పుడు దేశ రాజధానిలోనే చక్రం తిప్పి ప్రధానమంత్రిగా ఎవరుండాలో, రాష్టప్రతిగా ఎవరిని ఎన్నుకోవాలో, సెంట్రల్ గవర్నమెంటు పాలసీలను ఎవరికోసం ఎలా వంచాలో నిర్దేశించగలిగిన సూపర్‌మాన్ బాబుకు నేడు సొంత పార్టీలోనే చక్రం సరిగా తిరగని స్థితి! బిల్ క్లింటన్, టోనీ బ్లేర్లకే చదువు చెప్పగలిగిన విజన్ 2020 రూపశిల్పికి 2014 ఎన్నికల్లో పరువు నిలుపుకోవటం ఎలాగన్నదే దిక్కుతోచడం లేదు.
2009 జనరల్ ఎలక్షన్ల తరవాత 41 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగితే పనిమంతుడు బాబుగారి పార్టీ వాటిలో ఒక్క సీటూ గెలవలేదు. అంతేగాక 22 చోట్ల జయప్రదంగా డిపాజిట్లు పోయాయి. తెలంగాణ, రాయలసీమ, కోస్తాంధ్ర అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాల ప్రజలు బాబును సమానంగా ఆదరిస్తున్నారు. డిపాజిట్లు మూడు ప్రాంతాల్లోనూ గల్లంతయ్యాయి.
కాలం కలిసొచ్చినప్పుడు నాయుడుగారు ఏ ఎత్తు వేసినా పారింది. నాలుక ఎలా మడత వేసినా చెల్లింది. మద్యనిషేధం అవసరమని ఎంత గట్టిగా వాదించాడో అక్కర్లేదని అంత ఘాఠ్ఠిగానూ జనాన్ని నమ్మించగలిగిన బుద్ధిశాలి ఆయన. సెక్యులర్ ఫ్రంటులో ఊరేగినంతకాలమూ కమ్యూనల్ దుష్టశక్తిగా తాను దూషించిన భాజపాతోనే ఎన్డీఎ పందిరికింద మంచం పొత్తు పెట్టుకుని నెగ్గగలిగిన మాటకారి ఆయన. ఏం లాభం? చాకచక్యంలో చాణక్యుడిని చంపి పుట్టినా, చేటుకాలం దాపురించాక అతి తెలివితేటలు నారా వారికి ఎందుకు పనికి రాకుండా పోయాయి. తెలంగాణను ఒక కంటా, సీమాంధ్రను ఇంకో కంటా కనికట్టు చేయొచ్చని రెండు కళ్ల సిద్ధాంతాన్ని ఆయన లేవదీస్తే, అక్కడా ఇక్కడా మాడుపగిలి మొన్నటి ఉపఎన్నికలతో రెండు కళ్లూ పోయాయి. శత్రువుకు శత్రువు మిత్రుడన్న రాజనీతిని వెలగబెట్టి కాంగ్రెసుతో లోపాయకారి సంధి కుదుర్చుకుని జగన్ ఫ్యానును చెడగొట్టబోతే మాచ్ ఫిక్సింగుల గుట్టు రట్టయి సైకిల్ చైనే పుట్టుక్కుమంది. ఒకప్పటి ‘దేశం’ కోటలైన నర్సాపురం, రామచంద్రపురాల్లో తమ నోట తామే మన్నుకొట్టుకుని కాంగ్రెసు పల్లకిని మోసి, డిపాజిట్లను త్యాగం చేసినా మహాత్యాగి బాబును మెచ్చుకున్న వాళ్లు లేరు. అధికార స్వార్థం కోసం తెరాసతో పొత్తు కలిసినా, కత్తి దూసినా బాబు దేశానికి మిగిలింది భంగపాటే.
తెలంగాణపై ఎటూ తేల్చలేని నిస్సహాయతవల్ల తెలంగాణ ఎమ్మెల్యేలు సైకిలు వదిలి కారు ఎక్కారంటే అర్థం ఉంది. కాని సొంత సామాజిక వర్గానికి సొంత ఎస్టేటు అనుకున్న సీమాంధ్రలోనూ ఎమ్మెల్యేలు, మోతుబరులు పార్టీ నుంచి పారిపోతూంటే ఏమనుకోవాలి? కోవూరు ఎమ్మెల్యే సైకిలు దూకి పంకా పట్టుకుంటే పెద్ద మెజారిటీతో గెలవటం చూశాక... పార్టీ భవిష్యత్తు మీద ఆశలొదులుకున్న మిగతా తమ్ముళ్లకూ ఫిరాయింపు గుబులు మళ్లింది. నన్ను చూడు - నా చక్కదనం చూడు అని మహానాయకుడు ఎన్ని వగలు పోయినా పాపిష్టి బ్రదర్సు జైలువైపు, లోటస్‌పాండు వైపు పక్క చూపులు చూస్తున్నారంటే నాయకుల వారు తలకాయను ఏ గోడకు బాదుకోవాలి? జనరల్ ఎన్నికలకు ఏడాది ముందే అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటిస్తానని డాబుసరిగా బాబు ప్రకటిస్తే... అప్పటిదాకా ఆగకుండా ఎన్నికలకు రెండేళ్ల ముందే - పార్టీ తరఫున మళ్లీ పోటీ చేసేదిలేదని ఎమ్మెల్యేలు చేటకొడుతూంటే నారావారి పరువు ఏమి కావాలి? ఐదేళ్ల కింద వరంగల్లు బి.సి. సదస్సులో ఇచ్చిన ఉత్తుత్తి హామీకి మళ్లీ గాలికొట్టి బిసిలకు వంద అసెంబ్లీ సీట్లు అని కొత్తగా గొంతుచించుకున్నా బిసి వర్గాలు బొత్తిగా పట్టించుకోకపోతే రాజకీయం ఎలా నడపాలి?
వారసత్వ రాజకీయాలను వ్యతిరేకిస్తూ పుట్టిన తెలుగుదేశానికి వారసత్వ రాజకీయాలే ఇప్పుడు శాపం కావటం ఒక తమాషా. మామగారు తన రాజకీయ వారసత్వం ఎవరికివ్వాలో తేల్చకముందే మాయచేసి, అడ్డం తిరిగి దాన్ని తన్నుకు పోగలిగిన అసాధ్యుడికి... ఇప్పుడు తన వారసత్వాన్ని తన కుమారుడికి కట్టబెట్టటం ఎలాగన్నదే కంటికి కునుకు లేకుండా చేస్తున్నది. పెద్ద ఎన్టీఆర్‌నే లాగి అవతల పారేసి, మీడియా మాయాజాలంతో సింహాసనం ఆక్రమించి, తొమ్మిదేళ్లు నిరాఘాటంగా రాజ్యమేలగలిగిన మొనగాడికి ఇప్పుడు పిల్ల ఎన్టీఆర్ కాలిలో ముల్లులా, కంట్లో నలుసులా తయారై తన రాజకీయ జీవితానికే సవాలుగా మారాడేమిటి చెప్మా?! పట్టుబట్టి తాను టిక్కెటు ఇప్పించుకున్న గుడివాడ ఎమ్మెల్యే గోడ దూకటం వెనక తన దర్శకత్వం లేదని చిన్నోడు నోటితో అంటూనే ఉంటాడు. కట్టె కాలేదాకా తెలుగుదేశంలోనే ఉంటానని... ‘ఇప్పటికి నా వయసింకా నిండా ఇరవై ఎనిమిదే’ కనుక చాలా భవిష్యత్తు ఉందని నొసటితో వెక్కిరిస్తూనే ఉంటాడు. నందమూరి వంశం ప్రాపకం కోసం బాలయ్యకు లోకయ్యను అల్లుణ్ని చేసి పడిన కష్టమంతా జూనియర్ పితలాటకంతో రొష్టుగా మారింది. 2014 ఎన్నికల్లోనూ ‘దేశం’ దశ తిరిగేది లేదని తేలిపోయాక - నిన్నటిదాకా కిక్కురుమనని వారికి కూడా తోకలు లేవడాన్ని చూసే కదా... చరిత్రలో ఎన్నడూ లేనిది ‘మహానాడు’ను రద్దు చేసుకున్నది? అందరికీ అలుసై, అసలే రోజులు బాగా లేనప్పుడు తిరుగుబాటుదార్లపై ఒంటికాలిమీద లేచి చడామడా సస్పెన్షన్లు చేస్తూ పోతే ఓటి పార్టీలో చివరికి మిగిలేదెందరు?

http://www.andhrabhoomi.net/content/papam-babu-desam

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!