YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal
Thursday, April 10, 2025

Wednesday, 11 July 2012

డబ్బు ఎవరు వెదజల్లుతారన్నది మొన్న కోవూరు ఉప ఎన్నికల్లోనే చూశాం



హైదరాబాద్, న్యూస్‌లైన్: టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రజల విశ్వాసంతోపాటు సొంత పార్టీ నేతల విశ్వాసాన్ని కూడా పూర్తిగా కోల్పోయారని, అందుకే కొందరు నాయకులు తమ దారి తాము వెతుక్కుంటున్నారనీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్య నిర్వాహక మండలి సభ్యుడు, నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్యాకేజీలు ఇచ్చి కొడాలి నాని వంటి నాయకులను వైఎస్సార్ కాంగ్రెస్ వైపు తిప్పుకుంటున్నారని బాబు చేసిన విమర్శలపై తీవ్ర అభ్యంతరం తెలిపారు. ‘‘కొడాలి నాని మనస్తత్వం అలాంటిదా... అయన అలా అమ్ముడు పోతారా... అసలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అలా చేస్తుందా... డబ్బు ఎవరు వెదజల్లుతారన్నది మొన్న కోవూరు ఉప ఎన్నికల్లోనే చూశాం. నిన్నటికి నిన్న 18 అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కూడా చూశాం. ఎవరు ఎలా ఖర్చు చేశారనేది ప్రజలకు బాగా తెలుసు’’ అని మేకపాటి అన్నారు.

నెల్లూరు లోక్‌సభ ఉప ఎన్నికల సమీక్ష సమావేశం ముగిసిన అనంతరం బుధవారమిక్కడ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఒక ఎమ్మెల్యేకు 30 కోట్లు, 50 కోట్ల రూపాయలు ఇచ్చి తనవైపు లాక్కునే పరిస్థితి ఉందంటే రాష్ట్ర ప్రజలు ఏ మాత్రం నమ్మరన్నారు. బాబు ఎందుకిలా మాట్లాడి పలుచన అవుతున్నారో అర్థం కావడం లేదని, టీడీపీని ఇక ఆ దేవుడే రక్షించాలని వ్యాఖ్యానించారు. బాబు తనకు తానుగా ప్రజల్లో విశ్వాసం లేకుండా చేసుకున్నారని, అందుకే ఎక్కడ భవిష్యత్తు ఉంటుందని అనుకుంటున్నారో అక్కడికి ఆయన పార్టీ నాయకులు వెళ్లిపోతున్నారని చెప్పారు. ‘‘చంద్రబాబు తన భవిష్యత్తును ఎలా చూసుకున్నారో.. నేను నా భవిష్యత్తును ఎలా చూసుకున్నానో మిగతా వాళ్లు కూడా అంతే కదా! ఎక్కడికి వె ళ్తే భవిష్యత్తు ఉంటుందనుకుంటారో, ఎమ్మెల్యేలుగా రాణించగలమనుకుంటారో అక్కడికి వాళ్లు వె ళ్తున్నారు. అందులో తప్పేముంది..’’ అని అన్నారు.

జీవోలు సక్రమమైతే జగన్‌పై కేసు లేనట్టే..
మంత్రులకు న్యాయ సహాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జారీ అయిన 26 జీవోలు సక్రమమేనని వెల్లడవుతోందని, అలాంటప్పుడు ఇక జగన్‌పై కేసు ఉండే ప్రసక్తే లేదని మేకపాటి చెప్పారు. ‘క్విడ్ ప్రొ కో’ ఆరోపణల ఆధారంగానే సీబీఐ దర్యాప్తు చేస్తోందని, జీవోల జారీ సక్రమమైనప్పుడు ఈ కేసు నిలబడదన్నారు. ‘‘జగన్ నిజంగా మహానాయకుడు. వయసులో చిన్నవాడైనా, ఆయన్ను మహానాయకుడనే అంటాను. రానున్న రోజుల్లో జాతీయస్థాయిలో ఆయన పెద్ద నాయకుడవుతాడు. ఆయన్ను అన్యాయంగా ఇన్ని రోజులు జైల్లో పెట్టడాన్ని ప్రజలు జీర్ణించుకోలేక పోతున్నారు’ అని మేకపాటి అన్నారు. జగ న్‌పై తప్పుడు విచారణ చేస్తున్నందుకు సీబీఐ ఆయనకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!