YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Thursday, 12 July 2012

నేనే బీసీ బాబా.


హైదరాబాద్, న్యూస్‌లైన్: వెనుకబడిన వర్గాలకు వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు ఇస్తానని, అధికారంలోకి వస్తే ఆ వర్గాల వారికి రూ. 10 వేల కోట్లతో ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తానని.. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ప్రకటించిన ‘బీసీ పాలసీ’ ఇటు బీసీ సంఘాల్లోనే కాదు.. అటు సొంత పార్టీలోనూ వివాదాస్పదంగా మారింది. బీసీల సంక్షేమం విషయంలో కానీ.. ఇచ్చిన హామీలను నెరవేర్చటంలో కానీ బాబు ‘ట్రాక్ రికార్డు’ చూస్తే.. ఆయన మాటలను విశ్వసించేది ఎవరని టీడీపీ సీనియర్ నేతలు సైతం ప్రశ్నిస్తున్నారు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఆరేళ్ల పాలనలో బీసీల కోసం ప్రత్యేకంగా ఎలాంటి హామీలు ఇవ్వకుండానే.. ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ, గృహనిర్మాణం, పావలా వడ్డీ పథకం వంటి అనేక సంక్షేమ పథకాలతో వారి సామాజిక, ఆర్థిక, రాజకీయ ఎదుగుదలకు బాటలు పరచగా.. చంద్రబాబు తన తొమ్మిదేళ్ల కాలంలో బీసీలకు ఏం ఒరగబెట్టారని ఆయన తాజా హామీలను ఆ వర్గాల ప్రజలు విశ్వసిస్తారని వారు నిలదీస్తున్నారు. ‘‘బీసీ వర్గాల విద్యార్థుల ప్రీమెట్రిక్ స్కాలర్‌షిప్‌ల కోసం బాబు పాలన చివరి ఏడాదిలో కేవలం రెండు కోట్ల రూపాయలు మాత్రమే కేటాయిస్తే.. వైఎస్ పాలన ఐదో సంవత్సరంలో రూ. 9.27 కోట్లు ఇచ్చారు. బీసీలకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్‌ల కింద చంద్రబాబు పాలన చివరి ఏడాదిలో రూ. 77 కోట్లు మాత్రమే ఇస్తే.. వైఎస్ పాలన ఐదో సంవత్సరంలో రూ. 409 కోట్లు అందించారు. 

బీసీ సంక్షేమ శాఖకు కూడా బాబు చివరి ఏడాది పాలనలో రూ. 348 కోట్లు కేటాయిస్తే.. వైఎస్ ఐదో ఏడాది పాలనలో రూ. 1,305 కోట్లు కేటాయించారు. అలాగే.. వైఎస్ ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం ద్వారా లక్షలాది మంది బీసీ విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించగలిగారు.. వైఎస్ ఐదేళ్ల పాలనలో రూ. 26,000 కోట్లకు పైగా నిధులు ఇందుకు వ్యయం చేశారు. అలాగే.. బాబు తొమ్మిదేళ్ల పాలనలో పైరవీలు చేసుకోగల వారికి తప్ప బీసీ వర్గాల వారికి బలహీనవర్గాల గృహనిర్మాణ శాఖ నుంచి అందిన సాయం నామమాత్రం. కానీ.. వైఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ, ఎస్సీ, ఎస్టీ తదితర వర్గాల వారికి 40 లక్షల ఇళ్లు కట్టిస్తే.. అందులో ప్రధానంగా బీసీ వర్గాల వారికే దాదాపు 20 లక్షల ఇళ్లు కట్టించారు. ఇందులో ఒక్కో ఇంటికి రూ. 13,200 చొప్పున ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చింది. అంటే బీసీ వర్గాల వారికి రూ. 2,640 కోట్ల రూపాయలు వైఎస్ హయాంలో సబ్సిడీగా అందింది. అలాగే.. బాబు హయాంలో బీసీ వర్గాల వారే కాదు.. పేద కుటుంబాల్లో ఎవరికి జబ్బుచేసినా ప్రభుత్వ ఆస్పత్రిలో సైతం సరైన చికిత్స అందే దిక్కు ఉండేది కాదు. కానీ.. వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చాక ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ ఉచిత బీమా పథకంతో.. ఏ జబ్బు చేసినా కార్పొరేట్ ఆస్పత్రిలో సైతం ప్రభుత్వ ఖర్చుతో ఉచితంగా శస్త్రచికిత్సలు జరుగుతున్నాయి. ఈ పథకం కింద ఏడు లక్షల మంది బీసీ వర్గాల వారి శస్త్రచికిత్సల కోసం వైఎస్ హయాంలో రూ. 1,500 కోట్లు ఖర్చు పెట్టారు. ఇక బాబు హయాంలో మహిళా సంఘాలను పార్టీ ఓటు బ్యాంకుగా చూశారు కానీ.. మహిళల సాధికారత కోసం నిజాయతీగా చేపట్టిన చర్యలు సున్నా.

వైఎస్ వచ్చాక మహిళా సంఘాలకు బ్యాంకుల ద్వారా పావలా వడ్డీకే రుణాలు అందించటం ద్వారా బీసీ మహిళలకు రూ. 1,400 కోట్ల మేర వడ్డీ రాయితీ లభించింది. అంతేకాదు.. బ్యాంకుల నుంచి రూ. 28,000 కోట్ల మేర రుణాలు పొంది వివిధ రకాల వ్యాపారాలు, వ్యవసాయాల్లో పెట్టుబడులుగా పెట్టి సాధికారత సాధించే దిశగా పయనిస్తున్నారు. ఇలాంటి పథకాలేవీ అమలు చేయకుండా.. ఎవరికీ వీసమెత్తు ప్రయోజనం కలిగించకుండా.. చంద్రబాబు ఏదో చేశానని.. ఇంకా ఏదేదో చేసేస్తానని అంటే నమ్మేదెవరు?’’ అని తెలుగుదేశం పార్టీకే చెందిన సీనియర్ బీసీ వర్గ నాయకుడు ఒకరు కుండబద్దలు కొట్టారు. 2009 ఎన్నికలకు ముందు టీడీపీ నుంచి బీసీలకు 100 సీట్లు ఇస్తామని అప్పటి మిత్రపక్షాలైన వామపక్షాలు, టీఆర్‌ఎస్ అగ్రనాయకుల సమక్షంలో ఆర్భాటంగా ప్రకటించిన చంద్రబాబు.. వారం తిరక్కుండానే ఆ మాట తప్పి కనీసం 50 మందికి కూడా సీట్లు ఇవ్వకుండా బీసీలను దారుణంగా దగా చేసిన విషయం.. బాబు మర్చిపోయినా బీసీ వర్గాల ప్రజలు మరచిపోలేదని ఆయన స్పష్టంచేస్తున్నారు. చంద్రబాబునాయుడి హామీల్లో విశ్వసనీయత అనేది నేతిబీరకాయలో నెయ్యి చందమేనన్న విషయం ప్రజలకు పూర్తిగా అర్థమైపోయిందని టీడీపీ నాయకులే తేల్చిచెబుతున్నారు. 

చట్టసభల్లో బీసీ రిజర్వేషన్లపై ఏంచేశారు..? 
చట్టసభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్ల కోసం పోరాడతామని ప్రకటించిన చంద్రబాబు ఏనాడూ ఆ అంశంపై ప్రత్యక్ష పోరాటానికి దిగిన సందర్భం లేదని టీడీపీ నేతలు సైతం విమర్శిస్తున్నారు. ‘‘తాను అధికారంలో ఉండగా బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని అసెంబ్లీలో తీర్మానం చేయించారు. అయితే ఈ 15 ఏళ్లలో కొన్ని వందలసార్లు ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబు ఏ ఒక్క రోజు కూడా ఆ అంశంపై కేంద్ర ప్రభుత్వ పెద్దలను అడగలేదు’’ అని వారు గుర్తుచేస్తున్నారు. తాను చక్రం తిప్పానని చెప్పుకునే ఎన్‌డీఏ హయాంలో కూడా ఈ అంశంపై దృష్టి సారించలేదని పేర్కొంటున్నారు. పార్టీలో ఒక బీసీ నాయకుడు నంబర్ టూ అంటూ అప్పట్లో ప్రచారం జరిగినప్పుడు పార్టీలో నంబర్ టూ, త్రీలు అంటూ ఎవరూ లేరంటూ హడావుడి చేసి మరీ చెప్పించిన ఘనత బాబుదని.. బీసీ నాయకుల ఎదుగుదలను ఆయన తట్టుకోలేరనటానికి ఇది నిదర్శనమని ఉదహరిస్తున్నారు. 

నాటి 100 సీట్ల మాటలు నీటిమూటలే కదా..! 
అధికారంలో ఉన్నంత కాలం ఇలాంటివేవీ చేయకుండా.. వచ్చే ఎన్నికల్లో తాను బీసీలకు 100 సీట్లిస్తానని, పది వేల కోట్లతో సబ్‌ప్లాన్ ఏర్పాటు చేస్తానని, నామినేటెడ్ పోస్టుల్లో ప్రాధాన్యం కల్పిస్తానని చంద్రబాబు గుప్పిస్తున్న హామీలపై సొంత పార్టీ నేతలు సైతం పెదవి విరుస్తున్నారు. ‘‘2009 ఫిబ్రవరిలో హైదరాబాద్‌లో జరిగిన చేతి వృత్తిదారుల సదస్సులో సీపీఎం నేత రాఘవులు, సీపీఐ నాయకుడు కె.నారాయణ, టీఆర్‌ఎస్ నేత నాయిని నర్సింహారెడ్డి సమక్షంలో బీసీలకు 100 సీట్లిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అంతకుముందు 2008లో వరంగల్‌లో జరిగిన బీసీ గర్జనలో బీసీలకు వంద సీట్లు ఇస్తామని తీర్మానం చేశారు. ఆ సమావేశంలో 93 కులాల పేర్లు చదివి మరీ తనకు తప్ప బీసీలపై ఎవరికీ పేటెంట్ లేదన్నారు. ఈ రకమైన మాటలు, హామీలతో బీసీలు కొంత సంతోషపడినా అది ఎన్నాళ్లో నిలవలేదు. ఆ ఎన్నికల్లో బీసీలను నట్టేటముంచి కేవలం 50 సీట్లతో సరిపుచ్చారు. తాను పోటీ చేసే స్థానాలన్నింటికీ ఒకేసారి లేదా రెండుసార్లలో అభ్యర్థులను ప్రకటిస్తే బీసీల లెక్క తేలుతుందనే ఉద్దేశంతో అర్థరాత్రి, అపరాత్రి, 10 మంది, 15 మందిని అభ్యర్థులుగా దఫదఫాలుగా ప్రకటించారు’’ అని బీసీ సంఘాలతో పాటు, టీడీపీ సీనియర్ నేతలు సైతం బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ‘‘అదే ఎన్నికల్లో వై.ఎస్.రాజశేఖరరెడ్డి పార్టీ అధిష్టానాన్ని ఒప్పించి ఒకే రోజు 200 మందికి పైగా అభ్యర్థుల జాబితాను ప్రకటించగా అందులో 73 మంది బీసీలకు టికెట్లిచ్చారు’’ అని అని టీడీపీ నేతలే గుర్తుచేస్తున్నారు. 

వర్గీకరణపై ఇప్పుడు పోరాడతారా? 
సరైన వ్యూహం కొరవడిన కారణంగానే చంద్రబాబు ప్రతి విషయాన్నీ రాజకీయంగా చూస్తున్నారని పలువురు టీడీపీ నేతలు పేర్కొంటున్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం చేస్తామని చంద్రబాబు చెప్పటం వల్ల ప్రయోజనం ఉండదని వారు వ్యాఖ్యానిస్తున్నారు. గతంలోనే అసెంబ్లీ ఎస్సీ వర్గీకరణపై ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించిందని.. అప్పుడు వైఎస్ రాజశేఖరరెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ కూడా దానికి మద్దతు తెలిపిందని టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. ఇటీవల ఎంఆర్‌పీఎస్ నాయకుడు మంద కృష్ణమాదిగ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని కలిసినప్పుడు ఆయన కూడా వర్గీకరణకు మద్దతు తెలిపిన విషయాన్ని వారు ప్రస్తావిస్తున్నారు. వర్గీకరణను ఏ ఒక్క రాజకీయ పార్టీ వ్యతిరేకించలేదని, టీడీపీ మాత్రమే పోరాటం చేస్తుందని చెప్పుకోవటం వల్ల ఒరిగేదేం ఉంటుందని వారు ప్రశ్నిస్తున్నారు. అయితే ఎన్‌డీఏ హయాంలో చంద్రబాబు కేంద్రంలో చక్రం తిప్పిన సమయంలో వర్గీకరణ బిల్లు ఆమోదం కోసం ఏ ఒక్క ప్రయత్నం చేయలేదన్న విమర్శలు కూడా వచ్చాయని టీడీపీ నేతలు ప్రస్తావిస్తున్నారు. అలాగే దళిత క్రిస్టియన్లకు ఎస్సీ హోదా కల్పించే అంశంపై చంద్రబాబు ఏనాడూ స్పందించలేదన్న విషయాన్ని ఆ పార్టీ దళిత నేత ఒకరు గుర్తుచేశారు. 

బీసీల విద్య కోసం బాబు ఏంచేశారు? 
సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన కులాలు పైకి రావాలంటే.. ఆ వర్గాల వారికి విద్యాపరంగా, ఆర్థికంగా, రాజకీయంగా తోడ్పాడునందించే పథకాలు ప్రవేశపెట్టి అమలు చేసినప్పుడే సాధ్యమవుతుందని.. చంద్రబాబు పరిపాలనలో అలాంటి ప్రయత్నం ఒక్కటి కూడా జరగలేదన్న విషయాన్ని టీడీపీ సీనియర్ నేతలు గుర్తుచేస్తున్నారు. ‘‘ఉదాహరణకు.. ఒక బీసీ విద్యార్థి ఆర్థిక స్తోమత లేక ఉన్నత చదువులు చదువుకోగలిగే పరిస్థితి చంద్రబాబు హయాంలో లేదు. కానీ వైఎస్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ విద్యార్థి ఉచితంగా ఉన్నత విద్యను అభ్యసించటానికి ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం ప్రవేశపెట్టారు. దానివల్ల ఈ రోజు లక్షలాది మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ఉన్నత విద్యను పూర్తి చేయగలిగారు. చంద్రబాబు తన తొమ్మిదేళ్ల పాలనలో కనీసం ఒక్క విద్యార్థికైనా ఏ చదువుకూ ఫీజు చెల్లించలేదు’’ అని వారు ప్రస్తావిస్తున్నారు. ‘‘1995-96లో తాను అధికారంలోకి వచ్చిన సంవత్సరంలో బీసీ హాస్టళ్ల నిర్వహణకు రూ. 43.54 కోట్లు కేటాయించిన చంద్రబాబు.. తాను దిగిపోయే సంవత్సరంలో ఇచ్చింది కేవలం రూ. 100 కోట్లే. అదే వైఎస్ హయాంలో తొలుత రూ. 106 కోట్లున్న బడ్జెట్ ఐదో సంవత్సరానికి రూ. 241 కోట్లకు పెంచారు.

వైఎస్ అధికారంలోనికి రాకముందు స్కాలర్‌షిప్‌లకు దరఖాస్తు చేసుకున్న 100 మంది బీసీ విద్యార్థులలో కేవలం 30 మంది వరకు మాత్ర మే మంజూరు చేసేవారు. ప్రతిభతో పాటు ముందు దరఖాస్తు చేసుకున్న వారికి ప్రాధాన్యం ప్రాతిపదికన స్కాలర్‌షిప్‌లకు కేటాయించిన బడ్జెట్ అయిపోయేంత వరకు ఇచ్చి నిలిపివేసేవారు. ప్రైవేటు కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల స్కాలర్‌షిప్‌లను నిలిపివేయాలంటూ చంద్రబాబు హయాంలోనే జీవో నం. 90 జారీ చేశారు. అదే వైఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత లక్షలాది మంది బీసీ విద్యార్థులకు శాచ్యురేషన్ పద్ధతిన స్కాలర్‌షిప్‌లు, ట్యూషన్ ఫీజు మంజూరయ్యాయి. దాదాపు 40 లక్షల మంది బడుగు, బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు ఇంజనీరింగ్, మెడిసిన్‌లాంటి వృత్తివిద్యాకోర్సులను చదువుకుని ఉన్నతస్థాయికి వెళ్లే దిశలో మరో అడుగు దూరంలో ఉన్నారు. ఇక, కళాశాల హాస్టళ్ల విషయానికొస్తే 23 జిల్లాల్లో 23 హాస్టళ్లు ఏర్పాటు చేస్తానన్న హామీని చంద్రబాబు నెరవేర్చుకోలేకపోయారు. అదే వైఎస్ హయాంలో నియోజకవర్గానికి ఒకటి బాలురకు, ఒకటి బాలికలకు చొప్పున దాదాపు 600 హాస్టళ్లను మంజూరు చేశారు. ఇప్పుడు అందులో 500కు పైగా హాస్టళ్లలో విద్యార్థులు ఉంటూ చదువుకుంటున్నారు. బాబు హయాంలో సంక్షేమ హాస్టళ్లలో పౌష్టికాహారం కల్పించటానికి నిధులు కూడా అవసరమైన మేరకు విడుదల చేయలేదన్న విషయాన్ని ప్రభుత్వ రికార్డులే చెప్తున్నాయి’’ అని వారు వివరిస్తున్నారు. 

బీసీ మహిళలకు ఆలంబన ఏదీ..? 
‘‘అలాగే.. స్వయం సహాయక సంఘాల సభ్యులు ఆర్థికంగా నిలదొక్కుకుని సమాజంలో సగౌరంగా తలెత్తుకుని జీవించే పరిస్థితులు కల్పించాలన్న ఉద్దేశంతో రాజశేఖరరెడ్డి హయాంలో పావలా వడ్డీ పథకాన్ని ప్రారంభించారు. దాదాపు కోటి 20 లక్షల మంది మహిళలకు ఇప్పటి వరకు పావలా వడ్డీ పథకం కింద సుమారు రెండు వేల కోట్ల రూపాయలు మహిళా సంఘాలకు చెల్లించారు. అందులో దాదాపు 70 లక్షల మంది బీసీ మహిళలు పావలా వడ్డీ కింద దాదాపు గడిచిన ఎనిమిదేళ్ల కాలంలో 1,400 కోట్ల రూపాయల మేరకు లబ్ధిపొందారు. ఇది కాకుండా బ్యాంకుల నుంచి మహిళా సంఘాలకు దాదాపు రూ. 40 వేల కోట్ల మేర రుణాలు ఇప్పిస్తే.. అందులో 70 శాతం నిధులు బీసీ మహిళలు తీసుకుని వ్యాపారాలు చేయడం, వ్యవసాయ అవసరాలకు వినియోగించుకుని కుటుంబాల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకోగలిగారు. వచ్చే ఎన్నికల్లో బీసీలకు ఏదో మేలు చేస్తానని చెప్తున్న చంద్రబాబు తన తొమ్మిదేళ్ల పాలనలో ఏనాడూ మహిళా సంఘాలకు పావలా వడ్డీ రుణాలు ఇవ్వాలన్న ఆలోచన కూడా చేయలేకపోయారు’’ అని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. 

బీసీల అభ్యున్నతిపై ఆలోచించిందెన్నడు..? 
‘‘ఆర్థికంగా పేదవాడికి ఉండటానికి ఇళ్లు, ఆ కుటుంబంలోని విద్యార్థి పై చదువుల కోసం ఫీజు రీయింబర్స్‌మెంట్, జబ్బు చేస్తే ఆరోగ్యశ్రీ, వృత్తుల కోసం పావలావడ్డీకే రుణాలు వంటి పథకాలపై చంద్రబాబు ఏనాడూ కనీసం ఆలోచన కూడా చేయలేదు. దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్న చేనేత వర్గాలకు రుణాలను మాఫీ చేయటం, అధికారంలోకి రాగానే విద్యుత్ బకాయిలను మాఫీ చేయటం వంటి అనేక కీలకమైన నిర్ణయాలను వైఎస్ తీసుకున్నారు.. మా నాయకుడు విద్యుత్ చార్జీలను పెంచి మరింత భారం మోపారే తప్ప వెనుకబడిన వర్గాలకు ఇది చేశారంటూ చెప్పుకోవడానికి ఒక్కటీ లేదు’’ అని సదరు నాయకుడు అసంతృప్తి వెళ్లబుచ్చారు. ‘‘వెనుకబడిన కులాలు ముఖ్యంగా బీసీ కులాల సామాజికంగా అభివృద్ధి సాధించాలన్న అంశాన్ని పరిగణనలోకి తీసుకోకుండా వారిని కేవలం కుల వృత్తి చేసుకునే వర్గాలుగా చూస్తూ చంద్రబాబు హయాంలో ఆదరణ పేరుతో ఇస్త్రీ పెట్టెలు, మోకులు, మొగతాళ్లు, సైకిళ్లు (అవి కూడా ఏమాత్రం నాణ్యత లేనివన్న విషయం అప్పట్లోనే చెప్పుకున్నారు) ఇచ్చి ఎంతో చేశానని విస్తృత ప్రచారం చేసుకున్నారు. వెనుకబడిన వర్గాలకు చెందిన ఒక కుటుంబం బాగు పడాలంటే వృత్తులను ప్రోత్సహిస్తూనే అన్ని రంగాల్లో పైకి తేవలసిన అవసర ం ఉంటుందన్నది గుర్తించింది, అందుకు తగ్గ చర్యలు తీసుకుంది వైఎస్సే’’ అని టీడీపీకి చెందిన మరో బీసీ వర్గ నాయకుడు వ్యాఖ్యానించారు. బీసీ వర్గాల్లో వృద్ధులను ఆదుకోవటానికి వైఎస్ పెన్షన్లు మంజూరు చేస్తే.. గతంలో చంద్రబాబు హయాంలో పెన్షనర్లలో ఒకరు చనిపోతే వారి స్థానంలో కొత్త వారికి పెన్షన్ ఇచ్చే విధానం అమలులో ఉండేదని వారు గుర్తుచేస్తున్నారు. 

బీసీలకు ఇళ్ల నిర్మాణంలోనూ వివక్షే..! 
‘‘వైఎస్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత బలహీన వర్గాల ఇళ్ల నిర్మాణానికి ప్రాధాన్యత ఇచ్చారు. సంతృప్త స్థాయిలో పేదలందరికీ ఇళ్లు ఇచ్చారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో.. అత్యధిక లబ్ధిదారులు బీసీలే. వైఎస్ హయాంలో మొత్తం 45 లక్షల ఇళ్లు పూర్తి కాగా.. మరో 15 లక్షల ఇళ్లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. పూర్తయిన 45 లక్షల ఇళ్లలో దాదాపు 20 లక్షల ఇళ్లు బీసీలకు కేటాయించినే. వీటికి బీసీ వర్గాల వారికి రూ. 2,640 కోట్ల మేర సబ్సిడీ రూపంలో అందించారు. నిర్మాణంలో ఉన్న ఇళ్లలోనూ 5 లక్షల ఇళ్లు బీసీలకు చెందినవే. కానీ.. చంద్రబాబు హయాంలో బలహీన వర్గాల ఇళ్ల నిర్మాణ పథకంలో బీసీ లబ్ధిదారుల సంఖ్య స్వల్పం. పార్టీ నేతల వద్ద పలుకుబడి ఉన్న కొద్ది మంది బీసీలకే నాటి టీడీపీ ప్రభుత్వం ఇళ్లు కేటాయించింది’’ అని టీడీపీ నేతలు పెదవి విరుస్తున్నారు. 

నాడు ఆరోగ్య, సంక్షేమ చర్యలేవీ?
‘‘చంద్రబాబు పాలనలో బీసీ, ఎస్సీ, ఎస్టీ కుటుంబాల్లో ఎవరు అనారోగ్యం పాలైనా.. ఎవరికి ఏ జబ్బు చేసినా.. వైద్యం కోసం ఆ ఇంట్లో పుస్తెలతాడు, పశువులు, చివరికి పూరిపాకనూ అమ్ముకునే దుస్థితి ఉండేది. పాతికా పరకా భూములను తాకట్టు పెట్టి అధిక వడ్డీలకు అప్పులు చేసి.. చివరకు దానినీ కోల్పోయిన వాళ్లే. వైఎస్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన రూపొందించిన ఆరోగ్యశ్రీ పథకం అమలులోకి వచ్చాక ఆ పరిస్థితి పూర్తిగా మారింది. ఆరోగ్యశ్రీ కార్డుతో నేరుగా పెద్దపెద్ద కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్యం నిరుపేదలకు ఉచితంగా అందుబాటులోకి వచ్చింది. ఇప్పటి వరకూ ఈ పథకం కింద 15.18 లక్షల మంది శస్త్రచికిత్సలు చేయించుకుంటే.. వీరిలో దాదాపు ఏడు లక్షల మంది పై చిలుకు బీసీ వర్గాల వారు ఉన్నారు. వారి శస్త్రచికిత్సల కోసం వైఎస్ హయాంలో రూ. 1,500 కోట్లు వ్యయం చేశారు’’ అని టీడీపీకే చెందిన మరో సీనియర్ నాయకుడు పేర్కొన్నారు. 

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!