YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Tuesday, 10 July 2012

బీసీలపై చంద్రబాబువి మాయ మాటలు: గట్టు మండిపాటు

2009 ఎన్నికలకు ముందు కూడా ఇలాగే వాగ్దానం చేశారు
ఆయన పాలనలో బీసీ కులవృత్తులు నాశనమైనా పట్టించుకోలేదు
వ్యవసాయ రంగాన్ని నాశనం చేశారు.. 
వేలాది నేతన్నలు ఆత్మహత్య చేసుకున్నది బాబు హయాంలోనే

హైదరాబాద్, న్యూస్‌లైన్ : వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు వంద సీట్లు, పది వేల కోట్ల రూపాయల ప్యాకేజీ అంటూ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మాయ మాటలు చెబుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బీసీ విభాగం కన్వీనర్ గట్టు రామచంద్రరావు విమర్శించారు. బాబు బీసీలను మళ్లీ మోసం చేయాలని చూస్తున్నారని అన్నారు. మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 2009 ఎన్నికలకు ముందు కూడా బీసీలకు బాబు ఇలాగే వాగ్దానం చేసి ఆ తరువాత విస్మరించారని ధ్వజమెత్తారు. 

తొమ్మిదేళ్ల పాలనలో బీసీ కుల వృత్తులు నాశనమైనా పట్టించుకోని చంద్రబాబు, ఇప్పుడు వారి అభ్యున్నతి కోసం పది వేల కోట్ల రూపాయలతో ప్యాకేజీ ప్రకటించడం విడ్డూరమని అన్నారు. ప్రపంచబ్యాంకు జీతగాడిగా ఉన్న బాబు వ్యవసాయ రంగాన్ని సర్వనాశనం చేశారని, తత్ఫలితంగా ఆ రంగానికి అనుబంధంగా ఉన్న బీసీలంతా చాలా దెబ్బ తిన్నారని చెప్పారు. వేలాది చేనేత కార్మికులు మనుగడ లేక ఆత్మహత్యలు చేసుకున్నది బాబు హయాంలోనేనని దుయ్యబట్టారు. ఎన్టీఆర్ టీడీపీని పెట్టినప్పుడు బీసీలు కొంతవరకు ఆకర్షితులైన మాట నిజమేనని, అయితే బాబు హయాంలోకి వచ్చేసరికి వారంతా దూరమయ్యారని తెలిపారు. బీసీలు ఆయన్ని నమ్మడంలేదని గ్రహించిన చంద్రబాబు ఇప్పుడు వారికి వంద సీట్లు, పది వేల కోట్ల ప్యాకేజీ ఇస్తానని మాయ మాటలు చెబుతున్నారని అన్నారు. ఆయన ఎంత చేసినా బీసీలు నమ్మరని, ఎందుకంటే బాబు పాలనలో అష్టకష్టాలు పడిన సంగతి ఇంకా వారు మరువలేదని గట్టు చెప్పారు. వై.ఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా బీసీల్లో అత్యంత వెనుకబడిన కులాలను గుర్తించి వారి అభివృద్ధి కోసం 9 కార్పొరేషన్లు ఏర్పాటు చేశారని, వాటికి ప్రభుత్వం వెంటనే నిధులు కేటాయించి ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

ఆగస్టు పదిలోగా బీసీ సదస్సులు: రాష్ట్రంలోని బీసీలను సంఘటితం చేసి, వారి సమస్యల పరిష్కారం కోసం పోరాడేందుకు వచ్చే నెల 10వ తేదీలోగా అన్ని జిల్లాల్లో పార్టీ బీసీ విభాగం తరపున సదస్సులు ఏర్పాటు చేయనున్నట్లు గట్టు తెలిపారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో జరిగిన జిల్లాల బీసీ ముఖ్య నేతల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఈ నెలాఖరుకు మండల, మున్సిపల్, కార్పొరేషన్ స్థాయిలో వైఎస్సార్ కాంగ్రెస్ బీసీ విభాగం కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!