YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Sunday, 1 July 2012

ఉద్యోగుల ‘హెల్త్’ పోరాటం

- అమల్లో సర్కారు తీవ్ర జాప్యం 
- 4న కార్యాచరణ ఖరారు 

హైదరాబాద్, న్యూస్‌లైన్: ఉద్యోగులు పోరుబాటకు సన్నద్ధమవుతున్నారు. నగదు ప్రమేయం లేని వైద్యం అందించేందుకు ఉద్దేశించిన హెల్త్‌కార్డుల పథకం అమల్లో అంతులేని జాప్యాన్ని నిరసిస్తూ ఉద్యమానికి సై అంటున్నారు. నెల రోజుల్లో హెల్త్‌కార్డుల పథకాన్ని అమల్లోకి తీసుకొస్తామంటూ 2011 జనవరి 23న ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఏడాదిన్నర దాటినా.. నేటికీ కనీసం అమలు మార్గదర్శకాలను కూడా సర్కారు ఖరారు చేయలేకపోయింది. దీనిపై ఉద్యోగసంఘాలు మండిపడుతున్నాయి. ఆరోగ్యశ్రీ ట్రస్టు ద్వారా ఉద్యోగులకు నగదు ప్రమేయంలేని వైద్యం అందిస్తామంటూ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను ఉద్యోగ సంఘాలు మొదట్లో తీవ్రంగా వ్యతిరేకించాయి. అనంతరం ప్రతిపాదిత పథకం అమల్లో తీవ్ర జాప్యం, మెడికల్ బిల్లుల రీయింబర్స్‌మెంట్‌లో అంతులేని నిర్లక్ష్యం ఫలితంగా... ఏదో విధంగా హెల్త్‌కార్డుల పథకం ప్రారంభమైతే చాలనే ఉద్దేశంతో ఉద్యోగ సంఘాలు సర్కారు ప్రతిపాదనకు అంగీకరించాయి. 

ఆరోగ్యశ్రీ ట్రస్టు సర్వీసు ప్రొవైడర్‌గా ఉండాలని, అమలు పర్యవేక్షణకు ఉద్యోగులకు ప్రత్యేక ట్రస్టు ఉండాలని ఉద్యోగ సంఘాలు విధించిన షరతుకు ప్రభుత్వం అంగీకరించింది. నూతన పథకం అమలు విధివిధానాలు, మార్గదర్శకాల విషయంలోనూ ఉద్యోగ సంఘాల అంగీకారం లభించిందని, కొద్ది రోజుల్లో తుది సమావేశం ఏర్పాటు చేసి.. హెల్త్‌కార్డుల పథకం అమలు ప్రారంభిస్తామని ప్రభుత్వం 6 నెలల క్రితం చెప్పింది. ఆరోగ్య ట్రస్టు ద్వారా వైద్యం అందించడానికే ఏడాదిన్నరగా ఎడతెగని కసరత్తు చేస్తున్న ప్రభుత్వం వైఖరి పట్ల ఉద్యోగులు మండిపడుతున్నారు. సుదీర్ఘ కసరత్తు చేయాల్సిన సంక్లిష్ట విషయాలు ఇందులో ఏమున్నాయని ప్రశ్నిస్తున్నారు.

42 లక్షల మంది ఎదురుచూపులు
ఉద్యోగులు, కుటుంబ, సర్వీసు పెన్షనర్లు... మొత్తం 13.78 లక్షల కుటుంబాలు(సుమారు 42 లక్షల మంది) హెల్త్‌కార్డుల కోసం ఎదురుచూస్తున్నాయి.. ఈ పథకం అమలు చేయడానికి ఏటా రూ. 350 కోట్లు అవసరమని అంచనా. అందులో రూ. 210 కోట్లు సర్కారు భరించనుంది. ఉద్యోగుల చందాల(గెజిటెడ్ అధికారులు నెలకు రూ. 120, మిగతా ఉద్యోగులు రూ. 90) ద్వారా మిగతా రూ. 140 కోట్లు సమకూర్చుకోనున్నారు. ప్రస్తుతం ఉద్యోగులు తమ వైద్యానికి సొంతంగా ఖర్చు పెట్టుకొన్న తర్వాత ప్రభుత్వం నుంచి రీయింబర్స్‌మెంట్ పొందుతున్నారు.

అయితే, వైద్యానికి చేసిన మొత్తం ఖర్చును రీయింబర్స్ చేయకుండా ప్రభుత్వం కోత విధిస్తోంది. అన్ని రకాల బిల్లులతో దరఖాస్తు చేసిన తర్వాత రీయింబర్స్‌మెంట్ రావడానికి ఆరు నెలల నుంచి సంవత్సరం పడుతోంది. హెల్త్‌కార్డుల పథకం అమల్లోకి వస్తే.. చేతి నుంచి ఖర్చు పెట్టుకోవాల్సిన బాధ ఉద్యోగులు, పెన్షనర్లకు తప్పుతుంది. ఈ పథకం అమలు వల్ల ప్రభుత్వంపై అదనపు భారం పడదు. కేవలం ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడం వల్లే నూతన పథకాన్ని అమలు చేయడంలో జాప్యం జరుగుతోందని ఉద్యోగ సంఘాలు విమర్శిస్తున్నాయి.

ఉద్యమబాటలో ఉద్యోగ సంఘాలు
హెల్త్‌కార్డుల పథకం అమల్లో సర్కారు తీవ్ర జాప్యాన్ని నిరసిస్తూ ఉద్యమించడానికి ఉద్యోగ సంఘాలు సమాయత్తమవుతున్నాయి. ఉద్యమ కార్యాచరణ ఖరారు చేయడానికి బుధవారం(4న) ఉద్యోగ సంఘాల జేఏసీ సమావేశం కానుంది. పదో పీఆర్‌సీ కోసం కూడా ఒత్తిడి తీసుకురావడానికి అనుసరించాల్సిన విధానాన్నీ ఖరారు చేయనున్నారు. కేంద్రం డీఏ మంజూరు చేసిన వెంటనే రాష్ట్రంలో కూడా మంజూరు కావడం సంప్రదాయమని, డీఏ కోసం కూడా ఎదురుచూడాల్సిన పరిస్థితి గతంలో ఎన్నడూ లేదని ఉద్యోగులు వాపోతున్నారు. జనవరి నుంచి జూన్ వరకు రావాల్సిన డీఏ మంజూరుకు ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశం ఆమోదముద్ర వేసింది. జూలై నుంచి అందాల్సిన డీఏని కేంద్రం త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. కొత్త డీఏ అయినా త్వరగా ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!