YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Sunday, 1 July 2012

బాధితులకు అండగా నిలుస్తాం

మత్స్యకారుల సమస్యలపై అసెంబ్లీలో ప్రస్తావిస్తాం : వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ
- ఉపాధి కల్పించాల్సిందిగా ప్రభుత్వానికి లేఖ 
- మత్స్యకార మహిళలకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలి 

విశాఖపట్నం, న్యూస్‌లైన్: ‘ఉపాధి కల్పించమని మత్స్యకారులు అడిగితే పోలీసుల తో దాడి చేయిస్తారా, ఇదేం పద్ధతో అర్థం కావడం లేదు. బాధితులకు మేం అండగా నిలుస్తాం, బాధితుల ఆవేదనకు కారణం తెలుసుకుని పరిష్కరించాల్సిన ప్రభుత్వం, యాజమాన్యం మత్స్యకారులపై పోలీసులతో దాడిచేయించడం తగద’ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ పేర్కొన్నారు. ‘తీరప్రాంత పరిశ్రమల కాలుష్యంతో మత్స్యసంపదకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. సముద్రం పైనే ఆధారపడి జీవిస్తున్న మత్స్యకారులకు తీరని అన్యాయం జరుగుతోంది. ఎన్‌టీపీసీ యాజమాన్యం గత 12ఏళ్లుగా ఏడాదికి కొంతమంది చొప్పునైనా ఉపాధి కల్పిస్తే నిర్వాసితులందరికీ ఉద్యోగాలు దక్కేవి. వారి ఆకలి బాధలు తప్పేవి. సంస్థకు వ్యతిరేకంగా ఉద్యమించాల్సిన అగత్యం పట్టేది కాద’ని అన్నారు.

ఎన్‌టీపీసీలో ఉపాధి కల్పన డిమాండ్‌తో మత్స్యకారులు చేపట్టిన ఆందోళనపై పోలీసులు దాడులకు పాల్పడటం, ఈ దాడుల్లో పలువురు గాయపడిన విషయం తెలిసిందే. బాధితుల్ని పరామర్శించేందుకు ఆదివారం కుమార్తె షర్మిలతో కలసి వచ్చిన విజయమ్మ తొలుత సంఘటన ప్రాంతం (సీ వాటర్ పంప్ హౌస్)ను సందర్శించారు. మత్స్యకార గ్రామమైన తిక్కవానిపాలెంలో ఏర్పాటు చేసిన సభలో ఆమె మాట్లాడారు. ఎన్‌టీపీసీ సంఘటన గురించి మీడియా ద్వారా తెలుసుకున్న జగన్‌బాబు తాను రాలేకపోయినా, మత్స్యకారులకు భరోసాగా నిలవాలని తమను ఇక్కడికి పంపించారన్నారు. ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా నర్సాపురంలో జగన్‌బాబు మాట్లాడుతూ సముద్ర కాలుష్యానికి కారణమయ్యే కొత్త పరిశ్రమల్ని వైఎస్సార్ సీపీ అధికారంలోకి వస్తే అనుమతించబోమని స్పష్టం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. 

తీర ప్రాంతంలో ఏ సంస్థ వచ్చినా స్థానిక మత్స్యకారులకు 80 శాతం ఉద్యోగావకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారని చెప్పారు. సముద్రంలో వేటకెళ్లి మరణించే మత్స్యకారులకు వారం రోజుల్లో రూ.50 వేలు, ఆరు మాసాల్లోగా మిగిలిన రూ.4.50 లక్షలు పరిహారం అందిస్తామన్న జగన్ హామీని మరోసారి వివరించారు. అమ్మ ఒడి పథకం ద్వారా పిల్లల్ని చదివించే తల్లిదండ్రుల బ్యాంకు ఖాతాలకు ఒక్కో విద్యార్థికి రూ.500 చొప్పున ఇరువురికి అందిస్తామన్న హామీని గుర్తు చేశారు. బాధితుల తరఫున ప్రభుత్వానికి లేఖ రాయనున్నట్టు విజయమ్మ ప్రకటించారు. ఈ లేఖతోనైనా ఎన్‌టీపీసీ యాజమాన్యం నిర్వాసితులకు ఉపాధి కల్పించేదిశగా దిగి వస్తుందో? లేదో? చూడాలన్నారు. ఇదే అంశంపై అసెంబ్లీ సమావేశాల్లో కూడా మాట్లాడతానని చెప్పారు. మత్స్యకార మహిళలకు ప్రత్యేక ప్యాకేజీ అందించాలన్న డిమాండ్‌ను కూడా ప్రభుత్వం ముందు పెడతామన్నారు.

మొద్దు నిద్రలో ప్రభుత్వం

మహానేత వైఎస్సార్ కుమార్తె షర్మిల మాట్లాడుతూ ఎన్‌టీపీసీ కాలుష్యంతోపాటు, పరిశ్రమ వ్యర్థాలతో మత్స్యకారులు బతుకుతెరువు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్న కాలుష్యం చాలదన్నట్టు ఎన్‌టీపీసీ అదనంగా మరో పైప్‌లైన్ ఏర్పాటు చేస్తుండటాన్ని ఆక్షేపించారు. ఎన్‌టీపీసీ యాజమాన్యం గతంలో ఇచ్చిన హామీమేరకు మత్స్యకారులకు ఉద్యోగావకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. అర్హులకు ఉపాధి దక్కేలా చూడటం ప్రభుత్వ బాధ్యతని, బాధితుల సమస్యల్ని గాలికొదిలేసి ప్రభుత్వం మొద్దు నిద్రపోతోందని నిప్పులు చెరిగారు. ఏది ఏమైనా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బాధిత ప్రజల పక్షాన పోరాడుతుందన్నారు.

జీఎంతో భేటీ

బహిరంగ సభ తర్వాత ఎన్‌టీపీసీలోని సముద్రిక అతిథి గృహంలో సంస్థ జనరల్ మేనేజర్ డి.కె.సూద్‌తో విజయమ్మ, షర్మిల భేటీ అయ్యారు. సంస్థ మనుగడ కోసం మత్స్యకారుల ప్రాణాలతో చెలగాట మాడటం తగదని, మానవతావాదంతో వ్యవహరించాలని హితవు పలికారు.దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి బతికున్నప్పు డు 150 మందికి ఉద్యోగాలిస్తామన్న హామీలో మూడో వంతు కూడా నెరవేరలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అసలు ఎన్‌టీపీసీలో ఉన్న అన్ని కేటగిరీల సిబ్బందిలో ఎంత మంది నిర్వాసితులున్నారో.. చెప్పండన్న ప్రశ్నకు అధికారుల నుంచి సరైన సమాధానమే లేకపోయింది. ఉపాధి అవకాశాలపై ఇప్పటికే విభాగాధిపతులతో చర్చించామని, దీనిపై కలెక్టర్‌తో కూడా మాట్లాడతామని జీఎం సూద్ విజయమ్మ దృష్టికి తీసుకువచ్చారు. విజయమ్మ పర్యటనలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త కొణతాల రామకృష్ణ, ఎమ్మెల్యేలు గొల్ల బాబూరావు, ధర్మాన కృష్ణదాస్, పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు కొల్లి నిర్మలాకుమారి, పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు పుత్తా ప్రతాప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!