YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Sunday, 1 July 2012

తాము కోరినట్లుగా చెప్పాలంటూ ‘సాక్షి’ ఇన్వెస్టర్లపై తీవ్ర ఒత్తిళ్లు.. అయినా ఒక్కరు కూడా సీబీఐ కోరినట్టుగా చెప్పలేదు..

* తాము కోరినట్లుగా చెప్పాలంటూ ‘సాక్షి’ ఇన్వెస్టర్లపై తీవ్ర ఒత్తిళ్లు.. అయినా ఒక్కరు కూడా సీబీఐ కోరినట్టుగా చెప్పలేదు..
*పెట్టుబడులు క్విడ్ ప్రో కో కాదని చెప్పటానికి ఇది చాలదా?
*వైఎస్ నిర్ణయాలన్నిటికీ దురుద్దేశాలు అంటగట్టే యత్నం
*ముందరి ప్రభుత్వాలు, ప్రస్తుత సర్కారు ఏం చేసినా పట్టని వైనం
*కోర్టు తీర్పులో పేర్కొనని అంశాలపైనా దర్యాప్తు సంస్థ దృష్టి
*‘సాక్షి’ ఇన్వెస్టరుకు రాష్ట్రంలో ఏ ప్రాజెక్టున్నా క్విడ్ ప్రో కోయేనట
* ఏ ప్రాజెక్టూ లేకుంటే... వారిని ‘సాక్షి’ మోసం చేసిందని వింత వాదన
* మిగతా ఇన్వెస్టర్లలానే ‘సాక్షి’లో లగడపాటి సోదరుడి పెట్టుబడి
* దాన్ని నిజమైన ఇన్వెస్ట్‌మెంట్ అంటున్న సీబీఐ; మిగతావి కాదట
* ద్వంద్వ ప్రమాణాల్లో నానాటికీ ఎదిగిపోతున్న దర్యాప్తు సంస్థ

(సాక్షి ప్రత్యేక ప్రతినిధి)
ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 10 నెలలు.
ఒకరు కాదు ఇద్దరు కాదు.. పదుల కొద్దీ ఇన్వెస్టర్లు.


ఎందరిని వేధించినా.. ఎన్నాళ్లు వేధించినా.. ఎన్నిరకాలుగా వేధించినా.. ఆఖరికి అరెస్టులకు సైతం తెగబడినా వారిలో ఎవ్వరూ సీబీఐ కోరినట్టుగా చెప్పలేదు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కంపెనీల్లో తాము లాభాల కోసమే పెట్టుబడులు పెట్టామని, ఆంధ్రప్రదేశ్‌లో సరైన తెలుగు దినపత్రిక వస్తే రాణిస్తుందని భావించబట్టే తాము ‘సాక్షి’లో పెట్టుబడి పెట్టామని స్పష్టంచేశారు. ‘సాక్షి’ పెట్టుబడులన్నీ పారదర్శకమని, అవీ ఇతర పెట్టుబడుల్లాంటివేనని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనమేమీ అక్కర్లేదు. కానీ దోషిగా ఎవరిని తేల్చాలో ముందే నిర్ణయించేసుకుని, ఈ పెట్టుబడులన్నీ అక్రమమని ముందే నిర్ధారించేసి మరీ దర్యాప్తు ఆరంభించిన సీబీఐకి మాత్రం ఇవి కనిపించటమే లేదు. 

నిజానికి పెట్టుబడి అంటే ఇన్వెస్టరు, ప్రమోటరు మధ్య ఒప్పందం. వీరిలో తమకు అన్యాయం జరిగిందనో, తాము మోసపోయామనో ఎవ్వరూ ఫిర్యాదు చేయనంతవరకూ దాన్లో ఏ దర్యాప్తు సంస్థా జోక్యం చేసుకోదు. కానీ సీబీఐ ముందే ఒక నిర్ణయానికి వచ్చేసి... దానికి అనుగుణంగా కేసును తయారుచేసుకుంటూ వెళుతోంది. ఇన్వెస్టర్లను వేధిస్తూ.. వారు వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఏ ప్రాజెక్టులు చేపట్టారో వెతికివెతికి చూసి.. ఆ ప్రాజెక్టులు కట్టబెట్టినందుకు ప్రతిఫలంగానే ‘సాక్షి’లో పెట్టుబడులు పెట్టారని వాదిస్తోంది. 

అయితే సీబీఐ ఎంత వెదికినా కొంతమంది ఈ రాష్ట్రంలో ఎలాంటి ప్రాజెక్టులూ చేపట్టినట్లు కనిపించలేదు. దీంతో వారికి మోసపూరిత నివేదికలిచ్చి.. లాభాలొస్తాయని ఆశచూపించి జగతి పబ్లికేషన్స్ ప్రతినిధులు వారితో పెట్టుబడులు పెట్టించారని, వారికి వడ్డీ కూడా దక్కలేదని, వారు మోసపోయారని వారి తరఫున సీబీఐ తెగ ఆవేదన వ్యక్తంచేసింది. అసలు వారేమైనా ఫిర్యాదు చేశారా? ఇన్వెస్టర్లను వెదికి.. వారిని వేధించి, ఏదో ఒకరకంగా తమకు కావలసినట్లు చెప్పించుకోవాలనుకోవటం అసలు ఏ రకమైన దర్యాప్తు? సీబీఐకి ఇలా చేయమని ఎవరు చెప్పారు? అసలు దీన్నొక దర్యాప్తు సంస్థ అనొచ్చా?

కోర్టు తీర్పును దాటి ఎక్స్‌ట్రాలు..
కేసులో సీబీఐ కక్ష సాధింపునకు స్పష్టమైన నిదర్శనం దాని దర్యాప్తే. కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్రావు రాసిన లేఖ.. దానికి జతగా తెలుగుదేశం నేతలు వేసిన పిటిషన్లపై తీర్పు సందర్భంగా హైకోర్టు విచారణకు ఆదేశించింది ‘క్విడ్ ప్రో కో’ అంశాన్నే. వైఎస్ ప్రభుత్వ హయాంలో లబ్ధి పొందిన పలువురు వ్యక్తులు, సంస్థలు అధిక ప్రీమియంతో జగన్‌మోహన్‌రెడ్డి సంస్థల్లో పెట్టుబడులు పెట్టారనే ఆరోపణలపై కోర్టు సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. కానీ సీబీఐ ఆ తీర్పును ఎప్పుడో దాటేసింది. రాష్ట్రంలో ఏ ప్రాజెక్టూ లేని ఇన్వెస్టర్లుంటే.. వారిని జగతి ప్రతినిధులు మోసం చేశారనటం, ఆఖరికి ‘సాక్షి’ పత్రికకు ప్రభుత్వ విభాగాల నుంచి ‘ఈనాడు’ కన్నా అధికంగా అడ్వర్జయిజ్‌మెంట్లు వచ్చాయంటూ దాన్ని కూడా విచారణలోకి తీసుకురావటం.. ఇవన్నీ కోర్టు ఏమాత్రం నిర్దేశించని అంశాలే. 

ఎందుకు వీటన్నిటినీ శోధిస్తున్నారని ఎవరైనా ప్రశ్నిస్తే సీబీఐ అధికారులు చెప్పేదొకటే! దర్యాప్తులో భాగంగా తమకు కొత్త అంశాలు తెలిసినపుడు వాటిపైనా శోధిస్తారట! మరి ఎమ్మార్ కేసులో గానీ, విశాఖలోని రాంకీ ఫార్మాసిటీ వ్యవహారంలో గానీ చంద్రబాబునాయుడి హయాంలో జరిగిన కుట్ర స్పష్టంగా కనిపిస్తున్నా సీబీఐ అటువైపు చూస్తున్న దాఖలాలే లేవు. అదెందుకంటే.. ఆ మేరకు కోర్టు నిర్దేశించలేదన్న జవాబే వస్తోంది. ఇది రెండు నాల్కల తీరు కాక మరేంటి? ఇవి ద్వంద్వ ప్రమాణాలు కాక మరేంటి? నిష్పాక్షికంగా దర్యాప్తు చేయాల్సిన అత్యున్నత దర్యాప్తు సంస్థ ఇలా వ్యవహరించటం కరెక్టేనా?

అసలు కేటాయింపుల్లో తప్పేంటి?
పలు సంస్థలు, వ్యక్తులకు లబ్ధి చేకూర్చేలా ప్రభుత్వం కొన్ని జీవోలిచ్చిందని, అందుకు ప్రతిగా జగన్ కంపెనీల్లో వారు పెట్టుబడులు పెట్టారనేది ప్రధాన ఆరోపణ. అసలీ కేటాయింపుల్లో తప్పేముంది? భూములు, గనుల కేటాయింపు.. సెజ్‌లు, ప్రాజెక్టులకు అనుమతులు.. కంపెనీలకు లెసైన్సులు, రాయితీలు, మినహాయింపులు ఇస్తే తప్పేంటి? రాజశేఖరరెడ్డి ప్రభుత్వ హయాం ఒక్క దాన్లోనే ఇలా ఇచ్చారా? అంతకు ముందరి ప్రభుత్వాలేవీ ఇవ్వలేదా? ప్రస్తుత ప్రభుత్వం ఏ భూ కేటాయింపులూ చేయటం లేదా? రాయితీలివ్వటం లేదా? ఇతర రాష్ట్రాల్లో ఇలాంటివేమీ లేవా? ఏ జీవోనైనా అంతకు ముందరి జీవోల్ని అనుసరించో, నిబంధనల్ని పాటించో జారీ చేస్తారు కదా? ఇవేమీ ఉన్నట్టుండి ఆకాశంలోంచి ఊడిపడినవి కాదు కదా! దర్యాప్తులో ఇవన్నీ చూడాలి కదా! 

వైఎస్ ప్రభుత్వ హయాంలో కంపెనీలకు నీళ్లిచ్చినందుకు కూడా క్విడ్ ప్రో కో పెట్టుబడులొచ్చాయని తాను చేస్తున్న వాదన ఎంతమాత్రం సరికాదని సీబీఐకి తెలియదా? ప్రభుత్వ కేటాయింపులు, అనుమతులు ఏమాత్రం తప్పు కాదని సీబీఐకి తెలియదనుకోగలమా? నిన్నగాక మొన్న కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం పరిశ్రమలకు పన్ను రాయితీలివ్వలేదా? గతేడాది ప్రిజమ్ సిమెంట్స్ సంస్థకు కర్నూలు జిల్లాలో 1,000 ఎకరాలు కేటాయించ లేదా? మరి ఇలాంటివన్నీ సీబీఐ ఎందుకు అధ్యయనం చేయడం లేదు? వైఎస్ ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయాన్నీ తప్పుగా చూపించాలన్న తహతహ ఎందుకు? సీబీఐ ఈ దిశగా ఎందుకు ఆలోచించటం లేదు? ఎవరు వద్దంటున్నారు? సీబీఐని నడిపిస్తున్నదెవరు?

రెండు నాల్కలకు పరాకాష్ట...
జగతి పబ్లికేషన్స్‌లో రూ.10 విలువైన షేరును రూ.360కి విక్రయించారని, ఇది అత్యధిక ప్రీమియమని... క్విడ్ ప్రో కో పెట్టుబడులు కనకే ఇన్వెస్టర్లు ఈ ధరకు కొన్నారంటున్న సీబీఐ.. కాంగ్రెస్ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సోదరుడు లగడపాటి శ్రీధర్ విషయంలో భిన్నంగా వ్యవహరించటం ఇక్కడ గమనార్హం. శ్రీధర్ కూడా అదే ధరకు జగతిలో షేర్లు కొన్నా.. ఆయనకు ప్రభుత్వం నుంచి ఎలాంటి లాభం కలగలేదని, ఆయన తన ఇన్వెస్ట్‌మెంట్లలో భాగంగానే దీన్లో పెట్టుబడి పెట్టారని సీబీఐ చెబుతోంది. ఆయనకు క్లీన్‌చిట్ ఇచ్చింది. 

మరి అదే ప్రీమియంతో షేర్లు కొన్న ఇతరులు మాత్రం క్విడ్ ప్రో కోగానే పెట్టుబడి పెట్టారనటం ఎంతవరకు సమంజసం? ఒకే ధరకు కొందరు ఇన్వెస్టర్లు షేర్లు కొన్నపుడు.. ఒకరిది సిసలైన ఇన్వెస్ట్‌మెంట్ అయినపుడు మిగతావారిది ఎందుకు కాదు? మిగిలిన ఇన్వెస్టర్లను సీబీఐ ఎందుకు అనుమానిస్తోంది? రెండవ చార్జిషీట్లో పేర్కొన్న మాధవ్ రామచంద్ర, కణ్ణన్, అరుణ్‌కుమార్ దండమూడి ప్రభృతులు ఏ ప్రభుత్వ ప్రాజెక్టూ చేపట్టకపోయినా వారిని జగతి ప్రతినిధులు మోసం చేశారంటోందే తప్ప వారిది నిజమైన ఇన్వెస్ట్‌మెంట్ అని ఎందుకు అనటం లేదు? ఎవరిని వేధించాలో, ఎవరిని వదిలెయ్యాలో సీబీఐ ముందే ఒక నిర్ణయానికి వచ్చేసిందా? దీనిని కక్ష సాధింపు అని తప్ప ఇంకేమైనా అంటారా?

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!