YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Tuesday, 9 October 2012

వాద్రా ఆస్తులు రూ.11 వేల కోట్లు?

రాబర్ట్ వాద్రా రాత్రికి రాత్రి కోట్లకు పడగలెత్తారు 
ప్రియాంకను పెళ్లాడాకే వాద్రా ఆస్తులకు రెక్కలు
తొలుత చిన్నస్థాయి ఆభరణాల ఎగుమతి వ్యాపారం 
అనంతరం రియాలిటీ సహా వివిధ రంగాల్లోకి విస్తరణ 
2జీ స్పెక్ట్రమ్ కేసులోని ‘యూనిటెక్’లోనూ వాటాలు 
సోనియా అల్లుడిపై వెబ్‌సైట్ కథనంతో సంచలనం

న్యూఢిల్లీ, న్యూస్‌లైన్: కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా ఆస్తుల విలువ ఏకంగా 2.1 బిలియన్ అమెరికన్ డాలర్లని ‘సెలబ్రిటీ నెట్‌వర్త్’ అనే వెబ్‌సైట్ అంచనా కట్టింది. ఈ మొత్తం 11 వేల కోట్ల రూపాయలకు సమానం. దేశవిదేశాల ప్రముఖుల ఆస్తుల విలువను లెక్కకట్టి వివరాలను పొందుపరిచిన ఈ వెబ్‌సైట్‌లో వాద్రాకు సంబంధించిన ‘ఆస్తుల లెక్క’ మంగళవారం వెలుగులోకి వచ్చింది. అంతేకాదు.. వాద్రా అంత భారీస్థాయిలో ఆస్తులను కూడబెట్టింది సోనియా కుమార్తె ప్రియాంకగాంధీని పెళ్లాడాకేనని కూడా ఆ వెబ్‌సైట్ పేర్కొనటం విశేషం. వాద్రాను సదరు వెబ్‌సైట్ రాత్రికి రాత్రి కోట్లకు పడగలెత్తిన ప్రముఖుడిగా అభివర్ణించింది. వెబ్‌సైట్‌లో ఆయనకు సంబంధించిన వివరాలను ‘రాబర్ట్‌వాద్రా: ఓవర్‌నైట్ మల్టీ బిలియనీర్’ అనే శీర్షిక కింద వెబ్‌సైట్‌లో పేర్కొన్న వివరాల్లో ముఖ్యాంశాలివీ... 

ప్రియాంకగాంధీని వివాహం చేసుకున్నాక వాద్రా ఆస్తుల విలువ విపరీతంగా పెరిగింది. 1997లో ఉమ్మడి స్నేహితుల నివాసంలో ప్రియాంకను వాద్రా కలిశారు. ఆ తర్వాత వారిద్దరికీ పెళ్లయింది. దీంతో వాద్రా భారతదేశంలోని అత్యంత శక్తివంతమైన కుటుంబంలో సభ్యుడయ్యారు. తాను వ్యాపారవేత్తనని, ఆభరణాల ఎగుమతులకు ఉద్దేశించిన తన చిన్న కంపెనీ ‘ఆర్టెక్స్’ పైనే దృష్టంతా కేంద్రీకరిస్తానని ఆయన చెప్తారు. అయితే, అక్షరాలా రాత్రికి రాత్రే బిలియన్లు కూడబెట్టటంతో ఆయనీ ఆస్తులను ఎలా ఆర్జించారనే దానిపై ఊహాగానాల జోరు పెరుగుతోంది. 

చిన్నస్థాయి ఆభరణాల ఎగుమతిదారుగా ఉన్న ఆయన 2008లో రియల్ ఎస్టేట్ రంగంలో అడుగుపెట్టారు. భారతదేశంలోని అతిపెద్ద ప్రాపర్టీ సంస్థ ‘డీఎల్‌ఎఫ్ లిమిటెడ్’తో భాగస్వామ్యం పెట్టుకుని ఆయన ఈ రంగంలోకి దిగారు. అనంతరకాలంలో ఆయన.. హర్యానా, రాజస్థాన్‌లో భూముల కొనుగోలు, అలాగే ఢిల్లీలోని ఓ ప్రముఖ హోటల్ కంపెనీలో 50 శాతం వాటా సొంతం చేసుకోవటం ద్వారా ఇతర వ్యాపార సంస్థలకు పాకారు. ఆయన ప్రస్తుతం చార్టర్డ్ విమాన పరిశ్రమలో వాటా కోసం ప్రయత్నిస్తున్నారు. 

వాద్రా అనేక వ్యాపార సంస్థల్లో వాటాలను తీసుకున్నట్టు కనిపిస్తోంది. తన తల్లి మౌరీన్ భాగస్వామిగా ఉన్న ‘స్కై లైట్ హాస్పిటాలిటీ ప్రయివేట్ లిమిటెడ్’ సంస్థకు వాద్రా యజమానిగా ఉన్నారు. అంతేకాదు.. 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణంలో కేంద్రబిందువుగా ఉన్న యూనిటెక్‌లో ఆయనకు 20 శాతం వాటా ఉంది. ఆ కుంభకోణంలో రాబర్ట్ భాగస్తుడైనందున, దానిపై దర్యాప్తు ఎప్పటికీ కచ్చితమైన ముగింపుకు రాదని భారత ప్రజానీకం ఆందోళన చెందుతున్నారు. 

ఆస్తులపై అనేక కథనాలు..

వెబ్‌సైట్ వెల్లడించిన వివరాలతో మంగళవారం వార్తా పోర్టళ్లలో పెద్ద ఎత్తున కథనాలు వెల్లువెత్తాయి. దేశంలోకెల్లా అతిపెద్ద పార్టీల్లో ఒకటైన కాంగ్రెస్‌కు సారథ్యం వహించటమే కాకుండా యూపీఏ కూటమికి చైర్‌పర్సన్‌గా కూడా ఉన్న తన అత్తగారు సోనియాగాంధీ రాజకీయ పరపతిని వాద్రా ఉపయోగించుకున్నారనే దాంట్లో సందేహాలకు తావులేదని ఆ కథనాల్లో విశ్లేషకులు పేర్కొనటం గమనార్హం. 

source:Sakshi

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!