YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Tuesday, 9 October 2012

ఆధారాలివిగో! డీఎల్‌ఎఫ్‌తో హర్యానా సర్కారు కుమ్మక్కు: కేజ్రీవాల్

*డీఎల్‌ఎఫ్ సెజ్‌లో వాద్రాకు 50 శాతం వాటా ఉండేది
*పలు పత్రాలను బయటపెట్టిన కేజ్రీవాల్ 
*నిబంధనలు కాలరాసి భూముల సంతర్పణ 
*ఆస్పత్రి స్థలం డీఎల్‌ఎఫ్ సెజ్‌కు సమర్పణ 
*ఈ విషయాన్ని హైకోర్టూ తప్పుపట్టింది 
*గుర్గావ్‌లో మరో 350 ఎకరాలు ధారాదత్తం 
*అందులోనూ అటవీ భూములే అత్యధికం 
*డీఎల్‌ఎఫ్ భూ సేకరణకు సర్కారు సాయం 
*సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తులతో స్వతంత్ర దర్యాప్తు చేయించాలి 
*డీఎల్‌ఎఫ్‌కు పదేళ్లలో భూ కేటాయింపులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్

‘‘గుర్గావ్‌లోని 30 ఎకరాల్లో ఆసుపత్రి నిర్మించాలి. కానీ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆసుపత్రి నిర్మించకుండా 2007 మార్చి 9న సెజ్‌కు (ప్రత్యేక ఆర్థిక మండలికి) అనుమతి ఇచ్చింది. భూమిని కొల్లగొట్టేందుకే హర్యానా ప్రభుత్వం, డీఎల్‌ఎఫ్‌లు కుమ్మక్కయ్యాయని.. కేటాయింపులు, అనుమతుల తీరును చూస్తే తేలుతోందని హైకోర్టూ తప్పుపట్టింది.’’ 

‘‘సెజ్‌కు అనుమతి ఇవ్వటానికి ఒక నెల ముందు 2007 ఫిబ్రవరి 2న డీఎల్‌ఎఫ్ సంస్థ డీఎల్‌ఎఫ్ సెజ్ హోల్డింగ్ ప్రైవేటు కంపెనీ లిమిటెడ్‌ను ఏర్పాటు చేసింది. ఒక ఏడాది తర్వాత ఆ కంపెనీలో రాబర్ట్ వాద్రా 50 శాతం షేర్లు తీసుకున్నారు. ఏడాది తర్వాత ఆ షేర్లను తిరిగి అదే కంపెనీకి అమ్మేశారు.’’ 

‘‘గోల్ఫ్ కోర్టు ప్రాజెక్టు నిర్మాణానికి హర్యానా అంతర్జాతీయ స్థాయిలో బిడ్‌లను ఆహ్వానించింది. డీఎల్‌ఎఫ్ సహా మూడు సంస్థలు బిడ్లు వేశాయి. గోల్ఫ్ కోర్టు నిర్మాణంలో అనుభవంలేదంటూ మిగతా రెండు కంపెనీల బిడ్లను తెరవకుండానే తిరస్కరించి.. డీఎల్‌ఎఫ్‌కు ప్రాజెక్టును కట్టబెట్టారు.’’ 

‘‘డీఎల్‌ఎఫ్‌కు కేటాయించిన 350 ఎకరాల భూమిలో 75.98 ఎకరాల భూమి హుడా (హర్యానా అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ) స్వాధీనంలోనిది. 275 ఎకరాల భూమి హెచ్‌ఎస్‌ఐఐడీసీకి చెందినది. వీటిలో హుడా నివాస ప్లాట్లకు, హెచ్‌ఐఐడీసీ పరిశ్రమలకు ఉపయోగించకుండా.. అక్రమంగా డీఎల్‌ఎఫ్‌కు బదిలీ చేశారు.’’ 

న్యూఢిల్లీ, న్యూస్‌లైన్: కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా, రియల్ ఎస్టేట్ దిగ్గజం డీఎల్‌ఎఫ్, హర్యానా ప్రభుత్వం మధ్య కుమ్మక్కు లావాదేవీలకు సంబంధించి మరిన్ని సాక్ష్యాలు బయటపడ్డాయని అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. వాద్రా - డీఎల్‌ఎఫ్ వ్యాపార లావాదేవీలపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి స్వతంత్రంగా దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. అలాగే.. హర్యానా ప్రభుత్వం గత పదేళ్లలో డీఎల్‌ఎఫ్‌కు కేటాయించిన భూములపై శ్వేతపత్రం విడుదల చేయాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. కరెంటు బిల్లు కట్టని కార్మికునిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసే ప్రభుత్వం.. వాద్రాపై ఎఫ్‌ఐఆర్ ఎందుకు నమోదు చేయించటంలేదని ప్రశ్నించారు. ఆయనపై తక్షణమే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలన్నారు. కేజ్రీవాల్ మంగళవారం ఢిల్లీలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి.. రాబర్ట్‌వాద్రా ఆస్తుల వ్యవహారంలో మరి కొన్ని అంశాలను వెల్లడించారు. డీఎల్‌ఎఫ్‌కు భూముల కేటాయింపు విషయంలో ఆ సంస్థతో హర్యానా ప్రభుత్వం కుమ్మక్కయినట్లు స్పష్టమవుతోందంటూ పంజాబ్, హర్యానా హైకోర్టు ఒక కేసులో చేసిన వ్యాఖ్యలను ఉటంకించారు. 

డీఎల్‌ఎఫ్‌తో సర్కారు కుమ్మక్కును కోర్టే తేల్చింది... 

‘‘గుర్గావ్‌లోని 30 ఎకరాల్లో ఆసుపత్రి నిర్మించాలి. కానీ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆసుపత్రి నిర్మించకుండా 2007 మార్చి 9న సెజ్‌కు (ప్రత్యేక ఆర్థిక మండలికి) అనుమతి ఇచ్చింది. బాధితులు కోర్టుకు వెళ్లటంతో హర్యానా, పంజాబ్ హైకోర్టు ఎస్‌ఈజడ్‌లకు ఇచ్చిన అనుమతిని తిరస్కరించింది. ఆసుపత్రి పేరుతో రైతుల నుంచి సేకరించిన భూములను సెజ్‌లకు ఎలా ఇస్తారంటూ హర్యానా ప్రభుత్వంపై కోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. భూమిని కొల్లగొట్టేందుకే హర్యానా ప్రభుత్వం, డీఎల్‌ఎఫ్‌లు కుమ్మక్కయ్యాయని.. కేటాయింపులు, అనుమతుల తీరును చూస్తే తేలుతోందని తప్పుపట్టింది’’ అని వివరించారు. దీనికి సంబంధించి హైకోర్టు చేసిన వ్యాఖ్యల పత్రాలను మీడియాకు అందించారు. అలాగే.. ‘‘హర్యానా ప్రభుత్వం సెజ్‌కు అనుమతి ఇవ్వటానికి ఒక నెల ముందు 2007 ఫిబ్రవరి 2న డీఎల్‌ఎఫ్ సంస్థ డీఎల్‌ఎఫ్ సెజ్ హోల్డింగ్ ప్రైవేటు కంపెనీ లిమిటెడ్‌ను ఏర్పాటు చేసింది. ఒక ఏడాది తర్వాత ఆ కంపెనీలో రాబర్ట్ వాద్రా 50 శాతం షేర్లు తీసుకున్నారు. ఏడాది తర్వాత ఆ షేర్లను తిరిగి అదే కంపెనీకి అమ్మేశారు’’ అని కేజ్రీవాల్ వెల్లడించారు. ఆ షేర్లను ఎంతకు అమ్మారో చెప్పాలని, డీఎల్‌ఎఫ్‌కు - హర్యానా ప్రభుత్వానికి ఉన్న సంబంధమేమిటో చెప్పాలని డిమాండ్ చేశారు.

బిడ్ల స్థాయి నుంచీ అక్రమాలు... 

అదేవిధంగా.. హర్యానా ప్రభుత్వం డీఎల్‌ఎఫ్‌కు చేసిన మరికొన్ని మేళ్ల గురించి కూడా కేజ్రీవాల్ వివరించారు. గుర్గావ్‌లో రూ. 1,700 కోట్ల విలువైన 350 ఎకరాల భూమిని హర్యానా సర్కారు డీఎల్‌ఎఫ్‌కు ఇచ్చిందన్నారు. ఎకరాకు రూ. 20 లక్షల చొప్పున రైతులకు చెల్లించిన ప్రభుత్వం, అదే ఒక ఎకరాను డీఎల్‌ఎఫ్‌కు రూ. 5 కోట్లకు అమ్మిందన్నారు. రైతుకు రూ. 5 కోట్లు ఎందుకు చెల్లించలేదని ప్రశ్నించారు. అలాగే.. గోల్ఫ్ కోర్టు ప్రాజెక్టు నిర్మాణానికి హర్యానా అంతర్జాతీయ స్థాయిలో బిడ్‌లను ఆహ్వానించగా.. డీఎల్‌ఎఫ్ సహా మూడు సంస్థలు బిడ్లు వేశాయని కేజ్రీవాల్ తెలిపారు. అయితే.. బిడ్లను తెరిచే ముందుగా చట్టవిరుద్ధంగా కొత్త నిబంధన ప్రవేశపెట్టారని.. గోల్ఫ్ కోర్టు నిర్మాణంలో అనుభవంలేదంటూ మిగతా రెండు కంపెనీల బిడ్లను తెరవకుండానే తిరస్కరించి.. డీఎల్‌ఎఫ్‌కు ప్రాజెక్టును కట్టబెట్టారని ఆరోపించారు. 

ప్రజావసరాలకు భూమి ధారాదత్తం... 

అలాగే డీఎల్‌ఎఫ్‌కు కేటాయించిన 350 ఎకరాల భూమిలో 75.98 ఎకరాల భూమి హుడా(హర్యానా అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ) స్వాధీనంలోనిదని చెప్పారు. మిగతా 275 ఎకరాల భూమి హెచ్‌ఎస్‌ఐఐడీసీకి చెందినదని తెలిపారు. హెచ్‌ఎస్‌ఐఐడీసీ పరిధిలోని భూములను పరిశ్రమలను ప్రోత్సహించే లక్ష్యంతో పరిశ్రమలకు కేటాయించాలని.. హుడా అధీనంలోని భూములను నివాస అవసరాలకు ఉపయోగించాలని ఆయన పేర్కొన్నారు. అయితే.. అవి ఆ విధులు నిర్వర్తించకుండా భూమిని డీఎల్‌ఎఫ్‌కు బదిలీ చేసేశాయన్నారు. ‘‘హుడా కొన్నేళ్ల కిందట ఈ భూమిని ‘ప్రజా అవసరాల’ కోసం అంటూ గుర్గావ్ రైతుల నుంచి సేకరించింది. ఈ భూమిని సామాన్య ప్రజల కోసం నివాస, వ్యాపార ప్లాట్లుగా అభివృద్ధి చేయాల్సి ఉంది. కనీసం భూనిర్వాసితులకు కూడా ప్లాట్లు ఇవ్వలేదు. ఈ భూమంతటినీ డీఎల్‌ఎఫ్‌కు ప్రయివేటు లాభానికి బదిలీ చేశారు’’ అని తెలిపారు. 

అటవీ భూములూ అప్పగించేశారు... 

‘‘మరో విశేషమేమిటంటే.. హెచ్‌ఎస్‌ఐఐడీసీ అధీనంలో ఉన్న 275 ఎకరాల్లో 91.97 ఎకరాల భూమి పంజాబ్ భూ పరిరక్షణ చట్టం (పీఎల్‌పీఏ) పరిధిలోకి వచ్చే అటవీ ప్రాంతం. పీఎల్‌పీఏ పరిధిలోని భూములను అటవీ ప్రాంతాలుగానే పరిగణించాలని, అటవీయేతర అవసరాలకు దానిని ఉపయోగించకూడదని సుప్రీంకోర్టు ఆదేశించింది. అలాగో మరో 161.03 ఎకరాల భూమి ఆరావళి ప్లాంటేషన్ కింద ఉంది. దీనిని కూడా ఇతర అవసరాలకు ఉపయోగించకూడదు. కానీ.. ఈ భూమిని డీఎల్‌ఎఫ్‌కు కేటాయించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విభాగాలన్నింటి నుంచీ అనుమతులు తెచ్చే బాధ్యతను హర్యానా సర్కారు తన భుజాన వేసుకుంది. అయితే.. ఎలాంటి అనుమతులూ తీసుకోకుండానే ఈ భూమిని డీఎల్‌ఎఫ్‌కు బదలాయించేశారు’’ అని కేజ్రీవాల్ వివరించారు. 

రైతుల భూములను కొల్లగొట్టేందుకు.. సర్కారు సాయం!

అలాగే.. మనేసర్‌లో భూసేకరణ విషయంలో కూడా హర్యానా ప్రభుత్వం డీఎల్‌ఎఫ్‌కు అనుకూలంగా వ్యవహరించిందని.. రైతులను వంచించిందని కేజ్రీవాల్ ఆరోపించారు. ‘‘మనేసర్‌లో భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేశారు. ప్రభుత్వం ఎకరాకు రూ. 12 లక్షలు ఇస్తానంది. అదే సమయంలో డీఎల్‌ఎఫ్‌కు బినాబీ కంపెనీలుగా భావిస్తున్న కొన్ని చిన్న కంపెనీలు రంగంలోకి దిగాయి. ఎకరాకు రూ. 20 లక్షలు ఇస్తామని చెప్పాయి. 

వాస్తవానికి ఈ రెండు ధరలూ అప్పటి మార్కెట్ ధరలకన్నా చాలా తక్కువ. చాలా మంది రైతులు మోసపోయి.. తమ భూములను ప్రయివేటు కంపెనీలకు అమ్మేశారు. కొంతమంది రైతులు మిగిలిపోతే.. ప్రభుత్వం సెక్షన్ 9 నోటీస్ జారీ చేసింది.. అది భూ సేకరణకు సంబంధించిన తుది నోటీసు. దీంతో మిగిలిపోయిన రైతులు కూడా తమ భూములను అమ్మేసుకున్నారు. ఈ భూమి మొత్తం కారుచౌక ధరలకే ఈ కంపెనీల స్వాధీనంలోకి వచ్చిన తర్వాత.. ప్రభుత్వం అవార్డుకు ఇక కేవలం రెండు రోజుల గడువు మాత్రమే ఉందనగా.. భూసేకరణ ప్రక్రియను రద్దుచేసింది. ఆ తర్వాత ఈ భూమి అభివృద్ధి చేసుకోవటానికి డీఎల్‌ఎఫ్‌కు లెసైన్సులు జారీచేసింది’’ అని ఆయన వివరించారు. అదేవిధంగా గుర్గావ్ మనేసర్ అర్బన్ కాంప్లెక్స్ ప్రణాళికలోనూ డీఎల్‌ఎఫ్ ప్రాజెక్టుకు అనుకూలంగా మార్పులు చేసిందని చెప్పారు. ఆయా అంశాలకు సంబంధించిన నోటిఫికేషన్లు, ఇతర పత్రాల కాపీలను మీడియాకు అందజేశారు. 

డీఎల్‌ఎఫ్ స్పందన అబద్ధాలపుట్ట... 

రాబర్ట్ వాద్రాకు తాము వడ్డీ లేకుండా రుణం ఇవ్వలేదని డీఎల్‌ఎఫ్ చెప్తున్న మాటలు అబద్ధాలని కేజ్రీవాల్ ధ్వజమెత్తారు. వాద్రా గ్రూపు సంస్థల బ్యాలన్స్ షీట్లలో డీఎల్‌ఎఫ్ నుంచి రుణం తీసుకున్నట్లు చూపారని ఆయన స్పష్టంచేశారు. వాద్రా సంస్థల నుంచి భూమి కొనుగోళ్ల కోసం తాము అడ్వాన్సులు ఇచ్చామన్న డీఎల్‌ఎఫ్ వాదన కూడా అసత్యమేనన్నారు. భూముల కొనుగోళ్లకు కోట్లాది రూపాయలు చెల్లించిన తర్వాత కూడా రెండు, మూడేళ్ల వరకూ ఆ భూములను స్వాధీనం చేసుకోకపోవటమేమిటని ప్రశ్నించారు. తాము కొన్నామన్న భూములను కూడా వాద్రా సంస్థల బ్యాలన్స్ షీట్లలో సంస్థల ఆస్తులుగానే దర్శనమిస్తున్నాయని చెప్పారు. ‘‘భూమి విలువలో 90 శాతానికి పైగా అడ్వాన్సు చెల్లించి కూడా రెండేళ్లుగా భూమిని స్వాధీనం చేసుకోకుండా, చెల్లించిన అడ్వాన్సుకు వడ్డీ కూడీ తీసుకోకుండా ఉంటారా? ఇది వ్యాపార లావాదేవీల్లో సాధ్యమేనా? డీఎల్‌ఎఫ్ సైతం బ్యాంకుల నుంచి భారీ వడ్డీకే రుణం తీసుకుంటుంది కదా?’’ అని ఆయన నిలదీశారు. వాద్రా లావాదేవీలపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులతో స్వతంత్ర దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. 

ఎందుకు వెనుకేసుకు వస్తున్నారు..?

వాద్రా ప్రయివేటు వ్యక్తి అయితే.. కాంగ్రెస్ పార్టీ, కేంద్ర ప్రభుత్వం ఆయనను ఎందుకు వెనుకేసుకువస్తున్నాయని కేజ్రీవాల్ ప్రశ్నించారు. కాంగ్రెస్‌కు - ప్రభుత్వానికి - వాద్రాకు మధ్య ఉన్న సంబంధం ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. డీఎల్‌ఎఫ్‌తో వాద్రా లావాదేవీలు వ్యక్తిగతం అయితే ఆర్ధికమంత్రి చిదంబంరం, న్యాయశాఖ మంత్రి సల్మాన్‌ఖుర్షీద్, వాణిజ్యశాఖ మంత్రి ఆనంద్‌శర్మలు ఎందుకు కాపాడుతున్నారన్నారు. వాద్రా ఆస్తులపై విచారణ చేయాల్సిన అవసరం లేదని ఆర్ధిక మంత్రి చిదంబరం పేర్కొనడాన్ని అరవింద్ దుయ్యబట్టారు. ‘‘ఆర్థికమంత్రి ఐటీ అధికారా..? ఆస్తుల పత్రాలను స్క్రూటినీ చేస్తారా..? ఐటీ విషయంలో ఆర్థికమంత్రికి ఎలాంటి అధికారం లేదు. కానీ.. వాద్రాపై ఎవరు కూడా చర్యలు తీసుకోవద్దనే విధంగా ఆయన సందేశం పంపుతున్నారు’’ అని ధ్వజమెత్తారు. ఆదాయ పన్ను చట్టం కింద వాద్రా లావాదేవీలను క్షుణ్నంగా పరిశీలించాల్సి ఉందన్నారు. కానీ.. ఆ ధైర్యం ఏ అధికారీ చేయలేరు కాబట్టి.. దీనిపై స్వతంత్ర దర్యాప్తునకు డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. ఈ నెల 16న మరో ప్రముఖుడి అవినీతిని బయటపెడతామని కేజ్రీవాల్ చెప్పారు. 

గుట్టురట్టు చేయటమే మా పని... 

వాద్రా ఆస్తుల వ్యవహారంలో కోర్టుకు ఎందుకు వెళ్లడం లేదని విలేకరులు ప్రశ్నించగా.. అన్నింటికీ కోర్టులో సమాధానం దొరకదని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. ‘‘ఇది న్యాయపోరాటం కాదు. వీధి పోరాటం. ఒకరిద్దరిని జైలుకు పంపించడం కోసం చేసే పోరాటం కాదు. వ్యవస్థ మార్పు కోసమే ఈ పోరాటం. దేశ ప్రజల ముందు అవినీతి పరుల గుట్టురట్టు చేయటమే మా పని’’ అని చెప్పారు. ‘హిమాచల్‌ప్రదేశ్‌లో ప్రియాంకగాంధీ ఆస్తులపై కూడా విచారణకు డిమాండ్ చేస్తున్నారా?’ అన్న ప్రశ్నకు.. ‘‘హిమాచల్‌లో ప్రియాంకకు కోట్లలో ఆస్తులు ఉన్నాయని ఆ రాష్ట్ర మాజీ సీఎం శాంతకుమార్ నుంచి మాకు లేఖ అందింది. 

ఆ రాష్ట్రంలో బయటి వ్యక్తులు భూములు కొనుగోలు చేయటానికి అనుమతులు ఉండవు. ఒకవేళ ప్రియాంక భూములు కొనివుంటే.. అనుమతి ఎప్పుడు ఇచ్చారు, ఏ ప్రభుత్వం ఇచ్చిందో తెలియచేయాలని శాంతకుమార్‌కు లేఖ రాస్తాం’’ అని ఆయన తెలిపారు. డీఎల్‌ఎఫ్ నుంచి రాబర్ట్ వాద్రా దాదాపు రూ. 300 కోట్లు లబ్ధి పొందారని ప్రముఖ న్యాయవాది శాంతిభూషణ్ పేర్కొన్నారు. ప్రయివేటు వ్యక్తుల మధ్య ఆర్థిక లావాదేవీలతో దేశానికి నష్టం జరిగితే అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 9 కింద శిక్ష పడుతుందని చెప్పారు. 

source:Sakshi

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!