ప్రజా సమస్యలపై వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తరఫున సోదరి షర్మిల పాదయాత్ర చేపడతారని ప్రకటించగానే టీడీపీ అధినేత ఎన్.చంద్రబాబు నాయుడు బెంబేలెత్తి, భయాందోళనలకు గురవుతున్నారని, అందుకే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మపై అసంబద్ధమైన విమర్శలు చేస్తున్నారని ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి విమర్శించారు. ఆయన శనివారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తన పాదయాత్ర చూసి బెంబేలెత్తి విజయమ్మ తనపై విమర్శలు చేస్తున్నారని బాబు చెప్పుకోవడం హాస్యాస్పదం అని ఆయన అన్నారు. ‘‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అపారమైన ప్రజాభిమానం ఉంది. మొన్నటి ఉప ఎన్నికల్లో అది రుజువైంది. 2009 నుంచీ ఇప్పటి వరకూ జరిగిన 45 అసెంబ్లీ, రెండు లోక్‌సభ ఉప ఎన్నికల్లో టీడీపీ చిత్తుగా ఓడి పోయింది. రెండు లోక్‌సభ స్థానాల్లో, మరో 24 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆ పార్టీ అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయారు. అలాంటి పటిష్టమైన స్థితిలో మేమున్నపుడు బాబు యాత్రను చూసి వైఎస్సార్ కాంగ్రెస్ ఎందుకు బెంబేలెత్తుతుంది, ఇది నమ్మదగిందేనా!’’ అని మేకపాటి ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
బాబు వాదన విచిత్రంగా ఉంది..
తాను అవిశ్వాసం పెడితే జగన్ కేసుల విషయంలో ఢిల్లీతో బేరసారాలాడుకోవచ్చని వైఎస్సార్ కాంగ్రెస్ డిమాండ్ చేస్తోందని బాబు చెప్పడం విచిత్రంగా ఉందని మేకపాటి అన్నారు. ‘‘నిజంగా ఢిల్లీతో బేరసారాలాడుకునే వారైతే జగన్ నాలుగున్నర నెలలుగా జైల్లో ఉండే పరిస్థితి వచ్చి ఉండేదా? అసలు ఆయనపై ఈ ఎంక్వయిరీ ఎందుకు వచ్చి ఉండేది? సీబీఐకి హైకోర్టు చెప్పకపోయినా ఎఫ్‌ఐఆర్‌లో వైఎస్సార్ పేరు పెట్టి, జగన్‌ను తొలి ముద్దాయిగా చేర్చే పరిస్థితి ఉండేదా? ఒకేసారి 70 చోట్ల సీబీఐ 28 బృందాలతో దాడులు జరిపేదా? నిజంగా బేరసారాలాడితే జగన్ ఇన్ని ఇబ్బందులు పడేవారా?’’ అని మేకపాటి ప్రశ్నించారు.
అవిశ్వాసమంటే బాబు భయపడుతున్నారు..
‘‘సాధారణంగా ప్రభుత్వం విఫలమైతే ప్రజలు ప్రతిపక్షంవైపు చూస్తారు, వాళ్లు ఈ ప్రభుత్వం ఉండొద్దని కోరుకుంటున్నారు. పడిపోవాలని భావిస్తున్నారు. అలాంటపుడు ప్రతిపక్ష నాయకుడిగా అవిశ్వాసం పెట్టాల్సింది పోయి ఆ మాటంటేనే బాబు భయపడుతున్నార’’ని మేకపాటి అన్నారు. ‘‘ఎపుడు ఏ ఎన్నికలు వచ్చినా వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థులు గొప్ప మెజారిటీతో గెలుపొందుతారు. జగన్ ముఖ్యమంత్రి అవుతారు. అందుకే చంద్రబాబు అవిశ్వాసానికి వెనుకాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్‌నూ, విజయమ్మనూ, జగన్‌నూ విమర్శిస్తూ కాలం వెళ్లబుచ్చుతున్నారు’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మీ రాజ్యం తెస్తానని చెప్పగలరా బాబూ..?
‘‘మేం కచ్చితంగా రాజన్న రాజ్యాన్ని తెస్తాం.. ప్రజలకు సంక్షేమాన్ని అందిస్తాం.. అని ఘంటాపథంగా చెబుతున్నాం. మరి మీరు తిరిగి చంద్రన్న పాలన(చంద్రబాబు పరిపాలన)ను తేగలనని చెప్పగలరా చంద్రబాబూ?’’ అని మేకపాటి నిలదీశారు. షర్మిల వైఎస్ కుమార్తెగా, జగన్‌కు సోదరిగా పాదయాత్ర చేస్తారని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ ఏ హోదాతో టీడీపీకి ఎన్నికల్లో ప్రచారం చేశారో షర్మిల యాత్రను విమర్శించే వారు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. షర్మిలపాదయాత్ర చేస్తున్న ఓ మహిళగా చరిత్రలోకి ఎక్కుతారని, జగన్ జైలు నుంచి వచ్చాక ఆయన కొనసాగిస్తారని అన్నారు.
No comments:
Post a Comment