YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Tuesday, 9 October 2012

చిల్లరకొట్టు చిట్టెయ్య నోట మట్టి!

‘‘చిల్లర వర్తక రంగంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐ) అనుమతించాలని బహుళజాతి వర్తక సంస్థలు భారత ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయి. వాటిని అనుమతిస్తే, అది జాతి వ్యతిరేక నిర్ణయం కాగలదు. ప్రభుత్వ అనుమతిని సాధించడంలో అవి విజయం సాధిస్తాయేమోనని భయమేస్తోంది’’ అం టూ కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు ప్రియరంజన్‌దాస్ మున్షీ 2002లో వాజ్‌పేయి నాయకత్వలోని ఎన్డీయే ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వెల్లడించిన భయాలు, నేడు సోనియా ఏలుబడిలోని యూపీఏ హయాంలో సాకారం కావడం గమనార్హం!

ఎఫ్‌డీఐల అనుమతికి సంబంధించి దేశవ్యాప్తంగా పార్టీలకు అతీతంగా వ్యతిరేకత వెల్లువెత్తుతున్నా మన్మోహన్ సర్కార్‌కు చీమకుట్టినట్టయినా లేదు. గత చరిత్రను విస్మరిస్తూ, భవిష్యత్తు గురించి పట్టించుకోని వారికి చరిత్రలో స్థానం ఉండదు. చిల్లర వ్యాపార రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల మంచి చెడులను పార్టీ స్వార్థరాజకీయాల దృష్టితో కాకుండా, వాస్తవ దృక్పథంతో ఆలోచించి ఆచితూచి అడుగువేయడం విజ్ఞత అనిపించుకుంటుంది.

పారిశ్రామిక విప్లవం ఆరంభమైన 16-17 శతాబ్దాల నాటి స్థితులే స్వల్ప తేడాలతో నేడు పాశ్చాత్యదేశాల్లో నెలకొని ఉన్నాయి. పారిశ్రామిక ప్రగతిని పరుగులు పెట్టించడానికి తగిన పెట్టుబడులు అప్పట్లో వారి వద్ద అంతగా లేవు. ఆ పరిస్థితుల్లో వారికి భారతదేశం బంగారుగుడ్లు పెట్టే బాతు చందంగా కనిపించి వలసబాటపట్టారు. మన దేశానికి పాశ్చాత్యుల వలస మొదలైన నాటి రాజ కీయ పరిస్థితులు కూడా గమనించదగినవి. అప్పటికి భారతదేశం చిన్న చిన్న రాజ్యాలుగా విడిపోవడమేకాక, అత్యధిక భూభాగం ఢిల్లీ కేంద్రంగా దేశాన్ని పాలిస్తున్న మొగలాయిల చేతుల్లో ఉంది. నేడు ఢిల్లీ అధికార పీఠంపై ప్రధానిగా కీలుబొమ్మను కూర్చోబెట్టి, మరొకరు పరోక్ష అధికారం చెలాయిస్తున్నారు. నేటి ఆర్థిక పరిస్థితులు కూడా ఇంచుమించు గతాన్ని గుర్తుచేసేవిగానే ఉన్నాయి. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి పాశ్చాత్య దేశాలు కుదేలవుతున్నాయి. ప్రపంచాన్ని పట్టి కుదిపిన ఆర్థిక సంక్షోభాన్ని మన దేశం తట్టుకుని నిలబడటం, సంపన్న దేశాలకు కంటగింపుగా మారింది. అందుకే, వాటి కన్ను మన రిటైల్ రంగంపై పడింది.

ప్రస్తుతం మన దేశం మొత్తంమీద రిటైల్ రంగంలో జరుగుతున్న వ్యాపా రం రూ.30 లక్షల కోట్లకు పైగా ఉంది. రానున్న పదేళ్లలో ఇది రూ.70 లక్షల కోట్లకు చేరుకోవచ్చని వాణిజ్య వర్గాల అంచనా. సంస్కరణల ముసుగులో భారత ప్రజల కొనుగోలుశక్తిని కొల్లగొట్టి, లాభాలు పోగేసుకోవాలనే ఎత్తుగడలకు బహుళజాతిసంస్థలు పాల్పడుతున్నాయి. రిటైల్ రంగంలోకి విదేశీ పెట్టుబడులను అనుమతించి సంస్కరణలను వేగవంతం చేయాలని ఇటీవల ఒబామా ఇచ్చిన ఉచిత సలహా ఆంతర్యం కూడా ఇదే.

రిటైల్ రంగంలోకి విదేశీ పెట్టుబడులను అనుమతించడంవల్ల భారతదేశానికి బోలెడన్ని ప్రయోజనాలున్నాయని బహుళజాతి కంపెనీలు వల్లిస్తున్న కల్లబొల్లి కబుర్లనే, మన ప్రధాని మన్మోమోహన్ చిలక పలుకుల్లా వల్లించడం విడ్డూరం. వ్యవసాయ ఉత్పత్తులకు లాభసాటి ధర లభిస్తుందనీ, ప్రభుత్వ సాయం కోసం రైతు చేయి చాపాల్సిన అగత్యం ఉండదనీ, ప్రభుత్వం కూడా వ్యవసాయ సబ్సిడీల కోసం నిధులు కేటాయించాల్సిన అవసరం ఉండదనీ బుకాయిస్తున్నారు. అదే నిజమైతే, పెద్ద పెద్ద కంపెనీలు రిటైల్ రంగంలో రాజ్యమేలుతున్న అమెరికాలో లాభసాటి ధరలతో రైతులు హాయిగా ఉండి, ప్రభుత్వానికి వ్యవసాయ సబ్సిడీల భారం తగ్గిపోవాలి. కానీ, 2008 వ్యవసాయ బిల్లులో అమెరికా ప్రభుత్వం ఐదేళ్ల వరకు సేద్యానికి 30,700 కోట్ల డాలర్ల సాయం ప్రకటించింది. ఈ విషయం మన ప్రధానికి తెలియదనుకోవాలా! మధ్యవర్తులు లేనందువల్ల వినియోగదారులకు చౌకగా సరుకులు లభిస్తాయనీ, యువతకు ఉద్యోగాలు పుష్కలంగా దొరుకుతాయని మభ్యపెడుతున్నారు. సరుకు వినియోగదారుడికి చేర్చడానికి ఇప్పటి వరకు స్థానిక వ్యాపారి, నగరాల్లోని టోకు వ్యాపారి, ఆ తరువాత చిల్లర వ్యాపారి, తోపుడుబండ్ల వాళ్లు ఇలా పలువురు మన దేశీయులే మధ్యవర్తులుగా వ్యవహరిస్తూ ఉపాధి పొందుతున్నారు. ఈ చిన్న వ్యాపారుల ఉపాధి నమూనాకు మన చిల్లర దుకాణాలు, సంతలు మంచి ఉదాహరణ. హైదరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా వేలాది సంతలు నేటికీ కొనసాగుతున్నాయన్నది వాస్తవం. అవి మన సంస్కృతిలో విడదీయరాని భాగం అన్నది మరువలేనిది.

హైదరాబాద్ మల్కాజ్‌గిరి ప్రాంతంలో జరిగే వారాంతపు సంత మంచి ఉదాహరణ. తెలతెలవారుతుండగానే కూరగాయల మూటలతో ట్రక్కులు, ట్రాలీలు సంతకు చేరుకుంటాయి. దాదాపు కిలోమీటరున్నర మేర దుకాణాలు వెలుస్తాయి. జనం కిటకిటలాడతారు. చీకటి పడుతుండగానే లైట్లను కిరాయికి ఇచ్చే వారు వచ్చి దుకాణాల్లో వాటిని అమరుస్తారు. ప్రతి దుకాణంలోనూ నక్షత్రం దిగివచ్చిందా అన్నట్లు వెలుగులు నిండుకుంటాయి. రాత్రి తొమ్మిదిన్నర అయ్యేసరికి ఈ తాత్కాలిక దుకాణాలన్నీ మూతపడతాయి. మరుసటి రోజు తెల్లారేసరికి... అసలక్కడ వ్యాపారం జరిగిందా అనిపిస్తుంది! ఆధునికత దిశగా శరవేగంగా పరుగులు పెడుతున్న హైదరాబాద్ మహానగరంలో ఇలాంటి వారాంతపు సంతలు లెక్కకు మిక్కిలి. వేలాది మంది వ్యాపారులు ఈ సంతల్లో తమ సరుకుల్ని అమ్ముకుంటారు. నెలకు 15 కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుందని అంచనా. ఇలాంటి మార్కెట్లను ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. వాటి నిర్వహణ, అభివృద్ధికి ఎలాంటి పథకాలనూ రూపొందించడంలేదు. అయినా విశేష జనాదరణతో అవి నేటికీ కళకళలాడుతూనే ఉన్నాయి. ప్రభుత్వ సాయంలేకుండా కొనసాగుతున్న ఇలాంటి సంతలను కబళించే రక్కసి మూకల్లాగా బహుళజాతి సంస్థలు ప్రవేశించనున్నాయి.

కూరగాయలు అమ్మే వారాంతపు సంతలేకాక, రిటైల్ రంగలో అనేక రకాల వ్యాపారాలు స్థానిక ప్రజలకు ఉపాధి కల్పిస్తున్నాయి. మసాలా దినుసుల నుంచి మందులు, బ్రెడ్డు, బట్టలు, ఎలక్ట్రానిక్ చిప్స్, ఎలక్ట్రికల్స్ వంటి అనేక రకాల సరుకులు ఇక్కడ సరసంగా దొరుకుతాయి. చిన్నచిన్న గల్లీల్లో ఉండే చిల్లర దుకాణాల నుంచి తోపుడుబండ్లు దాకా చూస్తే సుమారు కోటి 20 లక్షల దుకాణాలతో, కోట్లాది మంది ఈ రంగంలో ఉపాధి పొందుతున్నారు. దీనికి అనుబంధంగా లెక్కలు రాసే అటెండర్లు వంటి ఇతరత్రా సేవలు సమకూర్చే స్వల్పకాలిక ఉద్యోగులు, రవాణా వాహనాల యజమానులు, కార్మికులు, హమాలీలు, తినుబండారాలు అమ్మి పొట్టపోసుకునే వారు... ఇలా కోట్లాది మంది చిల్లర వ్యాపారరంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. మన జాతీయ స్థూల ఉత్పత్తి (జీడీపీ)లో ఈ రంగం వాటా సుమారు 16.5 శాతం ఉందంటేనే దీని ప్రాధాన్యం అర్థమవుతుంది. వివిధ దుకాణాల్లో నాణ్యత గల సరుకులు లభ్యమవుతాయి. నాణ్యతను బట్టి, ధరను బట్టి నచ్చిన సరుకు ఎంచుకునే స్వేచ్ఛ, బేరమాడి కొనుక్కునే అవకాశం వినియోగదారుడికి ఉంది. కానీ, విదేశీ బడా వ్యాపార సంస్థలలో ఈ అవకాశం ఉం డదు.

బ్రాండ్ల పేరుతో రిటైల్ ధరలను భారీగా పెంచి వినియోగదారుల జేబులు ఖాళీ చేస్తారు. మధ్యవర్తులందరి పొట్టకొట్టి వాల్‌మార్ట్ లాంటి కంపెనీలు మాత్రమే మిగులుతాయి. మధ్యవర్తివ్యవస్థ పూర్తిగా అంతరించిన తరువాత బహుళజాతి కంపెనీలు మాత్రమే ఏకైక మధ్యవర్తిగా నిలుస్తాయి. స్వల్ప లాభాలతో చౌకధరలకు సరుకులు సరఫరా చేయడానికి అవి స్వచ్ఛంద సేవాసంస్థలూ కాదు, ధార్మిక సంస్థలు అంతకన్నాకాదు. అవి భారీ లాభాలకు అలవాటుపడ్డ వ్యాపార సంస్థలు. గతంలో వ్యాపారం పేరుతో తెల్లదొరల ఈస్టిండియా కంపెనీ సాగించిన నిర్వాకాన్ని ఒకసారి గుర్తుచేసుకోవడం మంచిది. తమకు ఎదురులేదనిపించిన వెంటనే బహుళజాతి కంపెనీల అసలు రంగు బయటపడుతుంది. శీతల పానీయాల రంగంలో దీన్ని మనం స్పష్టంగా చూస్తున్నాం. లక్షలాది ఉద్యోగాలిస్తామనే మాయమాటలు చెప్పి మన దేశంలోకి ప్రవేశించిన కోకాకోలా, పెప్సీకోలా 80 శాతం ఆక్రమిస్తే, చిన్నాచితకా కంపెనీలు మూతపడిపోగా చెరకు రసాలు, షర్బత్‌లు, లస్సీలు, నిమ్మకాయ సోడాల వంటివి 20 శాతానికి పడిపోయి నానాతిప్పలు పడుతున్నాయి. ఆరోగ్యానికి హానికరమైన రసాయనాలున్నాయని పలుపరిశోధనలు తేల్చిచెప్పినా ‘కోలా’లు మాత్రం కోట్లకు పడగెత్తుతున్న వైనం అందరికీ తెలిసిందే.

వాల్‌మార్ట్, టెస్కో తదితర సంస్థలు రిటైల్ రంగంలో పట్టుసాధించాక స్థానిక ప్రత్యర్థుల్ని మట్టి కరిపించిన అనుభవాలను పలు దేశాల్లో చూస్తున్నాం. బహుళజాతి సంస్థల ప్రవేశంతో జపాన్, మెక్సికో, డెన్మార్క్ లాంటి దేశాల్లో చిల్ల ర వ్యాపార సంస్థలు అంతరించిపోయాయి. పోటీలేకపోతే ధరల నిర్ణయం ఎక్కడైనా అమ్మేవాళ్ల ఇష్టారాజ్యమవుతుంది. సరుకు ఎంపిక చేసుకునే సదుపాయం, బేరమాడే స్వేచ్ఛ కోల్పోయి వినియోగదారుడు విలవిల్లాడక తప్పదు. చిల్లర వ్యాపారంలో ఒక్కసారి విదేశీ ప్రత్యక్షపెట్టుబడులను అనుమతిస్తే, ప్రస్తుత ప్రభుత్వవ్యవస్థలో బహుళజాతి కంపెనీలు గుత్తాధిపత్యం సాధించడం పెద్ద కష్టమేమీ కాదు. ఆ రంగం మీద ఆధారపడి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతున్న కోట్లాది మంది భారతీయులు ఉపాధి కోల్పోయి నిరుద్యోగులుగా మారిపోతారు. నైపుణ్యం ఉన్న కొందరిని మాత్రమే ఉద్యోగాల్లో చేర్చుకుంటారు. ఇదే వారు చూపుతున్న ఉద్యోగావకాశాల పెంపు! స్వయం ఉపాధితో స్వేచ్ఛగా బతుకుతున్న భారతీయుల ఉపాధిని ఊడబెరికి బానిసబతుకుల్లాంటి ఉద్యోగాలు కల్పించడమే బహుళజాతి కంపెనీల రాకతో మన దేశానికి ఒనగూరే ప్రయోజనం!

బహుళజాతి కంపెనీలతో రైతులకు మేలుజరుగుతుందని, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అంటున్న ప్రధాని అమెరికాలో ముఖ్యంగా మన్‌హట్టన్, కాలిఫోర్నియాలో వాల్‌మార్ట్‌ను అనుమతించవద్దని అక్కడి రైతులు, చిరువ్యాపారులు ఎందుకు ఆందోళన చేస్తున్నారో వివరించాలి. మన పారిశ్రామిక, సేవారంగాల నైపుణ్యాన్ని పెంచి ప్రపంచ మార్కెట్లో దీటుగా నిలదొక్కుకోవడానికి దోహదపడే విధాన నిర్ణయాలే సంస్కరణలు కావాలి గాని, దేశ ప్రజల ఉపాధి అవకాశాలను ఊడబెరికి, స్వయం ఉపాధిని కూల దోసి, బహుళజాతి కంపెనీల నౌకర్లుగా, బానిసలుగా మార్చేవి సంస్కరణలు కాజాలవు. అలాంటి సంస్కరణలు మనకు వద్దే వద్దు!

source:sakshi 

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!