జర్నలిజంలో రాగద్వేషాలకు అతీతంగా వార్తలు రాయాలన్నది ప్రాధమిక సూత్రం.ఆ పరిస్థితి మన రాష్ట్రంలో ఎప్పుడో దాటిపోయాం. ఎవరికి కావలిసిన చందంగా రాజకీయ అవసరాలకు అనుగుణంగా వార్తలు రాసే పరిస్థితి వచ్చింది. కాని వాటిని మించి పత్రికలు తమ విశ్వసనీయతను కూడా దెబ్బతీసుకునే విదంగా కూడా వార్తలు రాస్తుండడం ఓ విషాదం. తన ప్రత్యర్ధి పై కోపమో, ద్వేషమో ఉండవచ్చు. కాని అందుకోసం తమ సొంత ప్రతిష్టను పణంగా పెట్టుకోకూడదు. ఈరోజు ఒక ప్రముఖ పత్రికలో రెండువేల కోట్ల ఆస్తుల జప్తు అన్న వార్తను చదివితే ఈ పరిస్థితి కళ్లకు కనిపించినట్లుగా ఉంటుంది.ఒకదానికి, ఒకదానికి పొంతన లేకుండా వార్త రాసినట్లు అనిపిస్తుంది. ముందు అదేదో జగన్ ఆస్తి జప్తేమో అనిపిస్తుంది. తీరా చూస్తే వాన్ పిక్ ప్రాజెక్టు ఆస్తిని ఇడి జప్తు చేయవచ్చన్నది కధన సారాంశం.ఇందులో చిత్రమైన వాదనలు కనిపిస్తాయి.మరి సిబిఐ అధికారులు చెప్పారో,లేక ఇడి అధికారులు చెప్పారో, లేక సొంతంగా ఊహించి రాశారో తెలియదు కాని వార్త చదివితే నవ్వు వచ్చేలా ఉంది.ఒక పక్క వాన్ పిక్ సేకరించిన భూముల విలువ 1426 కోట్లు అని చెబుతారు.అంటే ఇంత ఖర్చు పెట్టి వాన్ పిక్ అదినేత నిమ్మగడ్డ ప్రసాద్ భూమి ని కొన్నారన్న మాట. ఇదంతా ప్రభుత్వానికి నష్టం అని వీరు చెబుతారు. ప్రసాద్ డబ్బుతో ప్రైవేటు భూములు కొంటే ప్రభుత్వానికి నష్టం వచ్చిందని సిబిఐ వాదించడం ఏమిటో, దానిని కొన్ని పత్రికలు గుడ్డి గా రాయడమేమిటో తెలియదు.అన్నిటికి మించి వాన్ పిక్ సేకరించిన భూమి విలువే 1426 కోట్లు అయితే మరి రెండువేల కోట్ల ఆస్తిని ఎలా స్వాధీనం చేసుకుంటారో తెలియదు .అయితే ఇదే వార్తలో జగన్ కంపెనీలలో పెట్టుబడులు ఐదు వందల కోట్లకు సమానంగా ఆస్తిని జప్తు చేయవచ్చని రాశారు.అసలు వాన్ పిక్ సేకరించిన భూమి ఎంత? ఇందులో ప్రభుత్వం ఏమైనా ఖర్చు చేసిందా?మొత్తం నిమ్మగడ్డ ప్రసాద్ లేదా ఆయన కు చెందిన కంపెనీలు చెల్లించాయా? ప్రపంచంలో ఎక్కడైనా ప్రైవేటు భూమిని మరో ప్రైవేటు సంస్థ కొనుగోలు చేస్తే ప్రభుత్వానిక నష్టం వచ్చిందని ఎంత తెలివిమంతుడైనా చెబుతారా? అసలు ఈ మొత్తం వ్యవహారం రాజకీయంగా మారి, రాష్ట్ర పారిశ్రామిక ప్రగతికి శాపంగా మారిందని పలువురు బాధపడుతుంటే, పత్రికలు కూడా దున్నపోతు ఈనిందంటే దూడను కట్టేయమన్న చందంగా వార్తలు రాస్తే మనం ఇదంతా రాష్ట్రం ఖర్మ అనుకోవడం తప్ప ఏమి చేయగలుగుతాం.నిజంగానే వాన్ పిక్ ప్రాజెక్టు రాష్ట్రానికి మంచిది కాదనుకుంటే మొత్తం ప్రాజెక్టును రద్దుచేసి భూమి అంతా స్వాధీనం చేసుకోవచ్చు. మరి ప్రభుత్వం ఇంతవరకు ఆ పని ఎందుకు చేయదు.సిబిఐ మానాన సిబిఐ,ప్రభుత్వం మానాన ప్రభుత్వం వ్యవహరిస్తూ రాష్ట్రానికి తీవ్ర నష్టం చేస్తున్నాయి.
source: kommineni.info
source: kommineni.info
No comments:
Post a Comment