YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Tuesday, 9 October 2012

మాయావతి పై దర్యాప్తు కొనసాగించవచ్చని సుప్రీం చెప్పడం యాదృచ్చికమా?

ఆస్తుల కేసు కొట్టివేతపై యూపీ వాసి రివ్యూపిటిషన్ 
దర్యాప్తు చేసే అధికారం సీబీఐకి లేదని తాము అనలేదన్న కోర్టు 
ఆస్తులపై దర్యాప్తుకు నిర్దిష్టమైన నిర్దేశమేదీ లేదని మాత్రమే చెప్పాం 
కేంద్ర ప్రభుత్వం, సీబీఐ, మాయావతిలకు నోటీసులు 

న్యూఢిల్లీ, సాక్షి లీగల్ కరస్పాండెంట్: యూపీఏ సర్కారుకు వెలుపలి నుంచి మద్దతిస్తున్న బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్‌పీ) అధినేత్రి, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతికి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. కేంద్ర సర్కారుకు మద్దతును కొనసాగించే అంశంపై బుధవారం బీఎస్‌పీ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్న నేపథ్యంలో.. ఆమెపై ఆదాయానికి మించి ఆస్తుల కేసును దర్యాప్తు చేసే అధికారం సీబీఐకి ఉందని సుప్రీంకోర్టు మంగళవారం స్పష్టంచేసింది. గతంలో సీబీఐ నమోదు చేసిన ఈ కేసును కొట్టివేసిన సుప్రీంకోర్టు.. సీబీఐ ఈ కేసును దర్యాప్తు చేయకుండా తాము నిషేధించలేదని తాజాగా తేల్చిచెప్పింది. ఈమేరకు కేంద్ర ప్రభుత్వానికి, సీబీఐకి, మాయావతికి నోటీసులు జారీ చేసింది. వారి వివరణ తెలియజేయాలని నిర్దేశించింది. 

సీబీఐ తనపై ఆదాయానికి మించి ఆస్తుల కేసును నమోదు చేసి దర్యాప్తు చేయటాన్ని మాయావతి సుప్రీంకోర్టులో సవాల్ చేయగా.. జూలై 6న సుప్రీంకోర్టు ఆ కేసును కొట్టివేసింది (రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో మమత సొంత అభ్యర్థిని తెరపైకి తెచ్చిన సమయంలో ఈ తీర్పు వెలువడడం.. అప్పుడు మాయావతి మద్దతు యూపీఏకు కావాల్సి ఉండడం గమనార్హం. ఇప్పుడు మరోసారి యూపీఏ తన మనుగడకు బీఎస్పీని నమ్ముకున్న పరిస్థితుల్లో .. కేంద్ర సర్కారుకు మద్దతుపై సమీక్షిస్తామని మాయావతి ప్రకటించగానే ఆమెపై దర్యాప్తు కొనసాగించవచ్చని సుప్రీం చెప్పడం యాదృచ్చికమా? లేక ఇంకేమైనా ఉందా అని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు). 

తాము.. గతంలో జారీ చేసిన ఆదేశాలు తాజ్ కారిడార్ కేసులో అక్రమాలకు మాత్రమే పరిమితమని, ఆ ఆదేశాలను సక్రమంగా అర్థం చేసుకోకుండా మాయావతిపై ఆదాయానికి మించి ఆస్తుల కేసు నమోదు చేయటం సరికాదని ఆ నాటి ఉత్తర్వుల్లో పేర్కొంది. 

ఈ ఉత్తర్వులను సమీక్షించాలని కోరుతూ ఉత్తరప్రదేశ్‌కు చెందిన కమలేష్‌వర్మ అనే వ్యక్తి తాజాగా సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌ను.. జస్టిస్ పి.సదాశివం, జస్టిస్ దీపక్‌మిశ్రాలతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారించింది. కమలేష్‌వర్మ తరఫున సీనియర్ న్యాయవాది శాంతిభూషణ్ వాదనలు వినిపించారు. మాయావతిపై ఆదాయానికి మించి ఆస్తుల కేసును కేవలం సాంకేతిక కారణాల ప్రాతిపదికగానే కొట్టివేశారని.. ఆమెకు వ్యతిరేకంగా సీబీఐ సమీకరించిన సాక్ష్యాలను పరిగణనలోకి తీసుకోలేదని ఆయన పేర్కొన్నారు. తాజ్ కారిడార్ అక్రమాలపై దర్యాప్తు సందర్భంగా మాయావతికి ఆదాయానికి మించి భారీగా ఆస్తులు ఉన్నట్లు వెలుగులోకి వచ్చిందని, దీనిపై వేరుగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిందనితెలిపారు. ఈ కేసు దర్యాప్తునకు సంబంధించి పలు స్థాయీ నివేదికలను కూడా సీబీఐ సుప్రీంకోర్టుకు సమర్పించిందని చెప్పారు. సుప్రీంకోర్టు 2004 జూలై 19న కేసు దర్యాప్తును పూర్తి చేయటానికి మూడు నెలలు గడువు ఇచ్చిందన్నారు. తాజ్ కారిడార్ ప్రాజెక్టుకు, ఆస్తుల కేసుకు సంబంధించి కనుగొన్న వాస్తవాలకు సంబంధం లేనందున.. తాజ్ కారిడార్ కేసు నుంచి ఆస్తుల కేసును సుప్రీంకోర్టు వేరు చేసిందన్నారు. ఆస్తుల కేసు దర్యాప్తును కొనసాగించే స్వేచ్ఛను సీబీఐకి మంజూరు చేసిందని తెలిపారు. ఇందుకు సంబంధించి సుప్రీం ఇచ్చిన ఉత్తర్వులను ఆయన చదివి వినిపించారు. 

ఈ సందర్భంలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. ‘ఈ కోర్టు ఆమెను (మాయావతిని) రక్షిస్తోందని మీరు అనుకుంటున్నారా? ఆమె ఆదాయానికి మించిన ఆస్తులపై దర్యాప్తు చేయాలని నిర్దిష్టమైన నిర్దేశం లేదని మాత్రమే (జూలై 6 ఉత్తర్వుల్లో) మేం చెప్పాం. ఒకవేళ సాక్ష్యాలు ఉన్నట్లయితే.. సీబీఐ తాజాగా చర్యలు చేపట్టకుండా ఇది నిరోధించదు. సీబీఐ దర్యాప్తు చేపట్టకుండా ఏదైనా అవరోధం ఉందా?’ అని ప్రశ్నించింది. దీనికి శాంతిభూషణ్ బదులిస్తూ.. ‘నిర్దిష్టమైన ఉత్తర్వు ఉన్నప్పుడు.. దర్యాప్తును కొనసాగించేందుకు అనుమతించాలి’ అని పేర్కొన్నారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ.. ‘‘ఆమెపై తాజా దర్యాప్తు చేపట్టేందుకు వారు (సీబీఐ) విచారణకు అనుమతి పొందిన తర్వాత కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించవచ్చు’’ అని చెప్పింది. అయితే.. మాయావతిపై దర్యాప్తు చేపట్టడానికి సంబంధించి సుప్రీం ఇచ్చిన ఆదేశాలను శాంతిభూషణ్ ప్రస్తావించగా.. ఈ కోణం పై వివరణ కోరతామని కోర్టు తెలిపింది. ఆ దిశగా కేంద్రానికి, సీబీఐకి, మాయావతికి నోటీసులు జారీచేసింది.

source:sakshi

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!