హైదరాబాద్, న్యూస్‌లైన్:
ప్రజల జీవితాలతో ఆటలాడుతున్న అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వంపై అసెంబ్లీలో ఎందుకు అవిశ్వాసం పెట్టడంలేదో ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు వెల్లడించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ నిలదీశారు. ప్రజల పాలిట గుదిబండలా తయారైన ప్రభుత్వాన్ని సాగనంపేందుకు అవిశ్వాసం పెట్టమంటే టీడీపీ నేతలు ఎందుకంత ఉలికిపాటుకు గురవుతున్నారని ఆమె ప్రశ్నించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడేందుకు ఢిల్లీ పెద్దలతో చంద్రబాబు కుదుర్చుకున్న ఒప్పందాన్ని బయటపెట్టాలని పద్మ డిమాండ్ చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
వాస్తవాల్ని దాచిపెట్టి పాదయాత్ర పేరు తో చంద్రబాబు ప్రజల్ని మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. ‘‘చంద్రబాబు ‘వస్తున్నా మీ కోసం’ అంటూ రోడ్లవెంబడి తిరుగుతూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దద్దమ్మ, చేతకానిది అంటూ శాపనార్థాలు పెడుతూ విమర్శలు చేస్తారు. కానీ తన చేతిలో ఉన్న అవిశ్వాస అస్త్రాన్ని మాత్రం ప్రయోగించరు. ఒక చేత్తో ప్రభుత్వాన్ని కాపాడుకుంటూ, మరోపక్క విమర్శలు చేస్తూ ద్వంద్వ విధానాలు అవలంబిస్తున్నారు’’ అని విమర్శించారు.
నిజ స్వరూపం బయటపడుతోంది..
అసమర్థ ప్రభుత్వాన్ని పారదోలేందుకు అవిశ్వాసం పెట్టాలని తాము డిమాండ్ చేస్తే ప్రతిపక్ష స్థానంలో ఉన్న టీడీపీ వ్యవహరిస్తున్న తీరుతో ఆ పార్టీ అసలు రంగు బయటపడుతోందని పద్మ పేర్కొన్నారు. తాము ఇన్నాళ్లూ చెబుతున్న వాటికి టీడీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు మరింత బలం చేకూరుస్తున్నాయన్నారు. ‘‘జగన్ బెయిల్ కోసం అవిశ్వాసం పేరుతో వైఎస్సార్ కాంగ్రెస్ బ్లాక్ మెయిల్ చేస్తోందంటూ టీడీపీ నేతలు అంటున్నారు. జగన్ బెయిల్‌కు అవిశ్వాసానికి లింకేంటి? అంటే ఇన్నాళ్లు అవిశ్వాసం చుట్టూనే జగన్ కేసులు, బెయిల్ ముడిపడి ఉన్నాయా? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో బేరసారాలాడటానికే చంద్రబాబు అవిశ్వాసం పెట్టడంలేదా?’’ అని సూటిగా ప్రశ్నించారు. జగన్ బెయిల్‌కు సంబంధించి కాంగ్రెస్, టీడీపీ ఎంత పెద్ద స్థాయిలో కుట్ర పన్నుతున్నామో వారి మాటల్లోనే బయటపడిందన్నారు.
జగన్ బయటకు రాకుండా ఉండాలనే సింగిల్ ఎజెండాతో రెండూ పార్టీలు పనిచేస్తున్నాయన్నారు. అవిశ్వాసం పెడితే ప్రభుత్వం ఏమవుతుందోననే ఆలోచనతో చంద్రబాబుకు వణుకు పుడుతోందని, అందుకే అవిశ్వాసం పెట్టనుగాక పెట్టనంటూ భీష్మించుకు కూర్చున్నారని ధ్వజమెత్తారు. ‘‘ఆరుగురు రాష్ట్ర మంత్రులపై అవినీతి ఆరోపణలతో చార్జీషీట్లు కూడా దాఖలయ్యాయి. ఒక మంత్రి స్వయంగా బెయిల్ పొందినా కనీసం నిలదీయలేని స్థితిలో చంద్రబాబు ఉన్నారు. చేయాల్సిన పనులు చేయకపోగా తగుదునమ్మా అంటూ చంద్రబాబు వీధుల వెంబడి తిరుగుతూ లెక్చర్లు ఇస్తున్నారు’’ అని ఎద్దేవా చేశారు.
తొమ్మిదేళ్ల పాలన తెస్తానని చెప్పొచ్చుగా..
చంద్రబాబుకు చేతనైతే తన తొమ్మిదేళ్ల పాలనను తిరిగి అందిస్తానని ప్రజలకు చెప్పగలరా? అని పద్మ సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబు తొమ్మిదేళ్ల హయాంలో ప్రజలు అనుభవించిన కష్టాలు వారికిప్పటికీ గుర్తున్నాయని చెప్పారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే మహానేత వైఎస్‌ఆర్ సువర్ణ యుగాన్ని, సంక్షేమ రంగాన్ని అందిస్తామని ప్రజలకు సగర్వంగా చెప్పగలమన్నారు. కానీ చంద్రబాబు తమ మాదిరిగా చెప్పలేరని, అలా చేస్తే ప్రజలు ఆయన నుంచి వంద మీటర్ల దూరం పరుగెడతారని పద్మ ఎద్దేవా చేశారు.
No comments:
Post a Comment