YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Tuesday, 9 October 2012

త్వరలోనే బాబుపై సీబీఐ దర్యాప్తు!

ఐఎంజీ కేసులో కోర్టు ఆదేశాల మేరకే దర్యాప్తు జరగబోతోంది
ఎకరా రూ. కోటి విలువైన 450 ఎకరాల భూముల్ని ఎకరా 
రూ. 50 వేలకే ఐఎంజీ సంస్థకు కట్టబెట్టిన ఘనుడు బాబు
రాష్ట్రాన్ని ఏలినవారిలో ఆయనంత అవినీతిపరుడు మరొకరు లేరు
టీడీపీ బీసీ డిక్లరేషన్ అంతా బోగస్

ఒంగోలు, న్యూస్‌లైన్ ప్రతినిధి: తాను సీఎంగా ఉన్నపుడు ఐఎంజీ భారత అనే సంస్థకు రూ.కోట్ల విలువైన భూముల్ని అతి తక్కువ ధరకే ధారాదత్తం చేసిన కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై త్వరలోనే సీబీఐ దర్యాప్తు ప్రారంభం కానుందని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. ‘‘కాంగ్రెస్ పాలనలో అంతా అవినీతి జరిగిందని, దోచుకు తింటున్నారని ఇవాళ చంద్రబాబు నాయుడు చెబుతున్నారు. తాను సీఎంగా ఉన్న తొమ్మిదేళ్ల కాలంలో ఏదో గొప్పలు చేశానని చెప్పుకొంటూ పాదయాత్ర చేస్తున్నారు.

నిజానికి ఈ రాష్ట్రాన్ని ఏలిన ముఖ్యమంత్రుల్లో చంద్రబాబు నాయుడంత అవినీతిపరుడు వేరొకరు లేరు. ఎకరా రూ. కోటి విలువ చేసే 450 ఎకరాల భూముల్ని.. ఎకరా రూ. 50 వేల ధరకే ఐఎంజీ భారత సంస్థకు కట్టబెట్టారాయన. దీనిపై త్వరలోనే కోర్టు ఆదేశాల మేరకు సీబీఐ ఎంక్వైరీ జరగబోతోంది’’ అని సీఎం కిరణ్ స్పష్టం చేశారు. ఇందిరమ్మ బాటలో భాగంగా ప్రకాశం జిల్లాలోని చీరాల, పర్చూరు, అద్దంకి నియోజకవర్గాల్లో సీఎం మంగళవారం పర్యటించారు. రాత్రి అద్దంకిలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై నమోదైన కేసుతో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధమూ లేద న్నారు. కాంగ్రెస్‌పై వైఎస్‌ఆర్ సీపీ ఆరోపణలు సరైనవి కావన్నారు. గత ఐదేళ్లలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఎక్కువ నిధులు కేటాయించిందని, తాను ఈ ఒక్క సంవత్సరంలోనే ఐదేళ్లలో ఇచ్చినన్ని నిధులు కేటాయించానని చెప్పారు.

బాబు పాలనే రుజువు..

చీరాలలో సీఎం మాట్లాడుతూ... చంద్రబాబు ఇప్పుడు ప్రకటించి బీసీ డిక్లరేషన్ బోగస్ అని ఆయన తొమ్మిదేళ్ల పాలనే రుజువు చేసిందన్నారు. బాబు 2004 వరకు సీఎంగా ఉండి బీసీలకు కేటాయించింది రూ.933 కోట్లేనని చెప్పారు. కాంగ్రెస్ హయాంలో 2004 నుంచి 2009 వరకు కేటాయించిన నిధులు రూ.2,166 కోట్లని, అదే 2011లో కేటాయించిన నిధులు రూ.3,017 కోట్లని చెప్పారు. దీన్ని బట్టి బాబు ప్రకటించిన బీసీల డిక్లరేషన్ అవాస్తవమని స్పష్టమవుతోందన్నారు. బీసీలపై తమ ప్రభుత్వానికి ఉన్న ప్రేమ టీడీపీకి లేదన్నారు.

తీరంలో పరిశ్రమలొస్తే మత్స్యకారుల వృత్తికి విఘాతం

చీరాల ఓడరేవులో సాగర మీనోత్సవాన్ని (చేపలను సముద్రంలో వదిలే కార్యక్రమాన్ని) సీఎం ప్రారంభించారు. సముద్ర తీరంలో ఆయిల్ రీఫైనరీలు, ఇతర పరిశ్రమలు మత్స్యకారుల వృత్తిని దెబ్బతీస్తాయని చెప్పారు. మత్స్యకారుల జీవన విధానానికి ఇబ్బంది లేని పరిశ్రమలు రావాలన్నారు. మత్స్యకారులకు షిప్పింగ్ యార్డు ఏర్పాటు చేయాలని కోరగా సర్వేకు రాస్తామని హామీ ఇచ్చారు. వైఎస్ హయాంలో మృతిచెందిన మత్స్యకారుల కుటుంబాలకు రూ. 1.50 లక్షలు ఇస్తామన్న హామీని అమలు చేయాల్సిందిగా మత్స్యకారులు కోరారు. అయితే కిరణ్ ఆ విషయాన్ని ప్రస్తావించకుండా చేపలు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి పట్టుకునే విధంగా నూతన టెక్నాలజీ మత్స్యకారులకు నేర్పుతామని ప్రకటించారు.చేనేత కార్మికుల ముఖాముఖి సందర్భంగా చేనేత కార్మికులకు బ్యాంకు ఏర్పాటు చేయాలన్న విజ్ఞప్తికి సీఎం స్పందించలేదు.

ఉప్పు రైతులకు విద్యుత్ చార్జీలు పెంచారు...

ఉప్పును సాగుచేసే రైతులకు వైఎస్‌ఆర్ ముఖ్యమంత్రిగా ఉండగా విద్యుత్ చార్జీని యూనిట్‌కు రూ. 4.10 నుంచి రూ. 1.00కు తగ్గించారని, మీ ప్రభుత్వం వచ్చిన తరువాత దీనిని రూ. 2.10కు పెంచారని చినగంజాం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నూనె వెంకటేశ్వర్లు సీఎం దృష్టికి తీసుకు వచ్చారు. పర్చూరులో జరిగిన రైతులతో ముఖాముఖిలో ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఉప్పుపై సేవా రుసుం ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. కృష్ణా పశ్చిమ డెల్టా కాలువల ఆధునికీకరణలో అవినీతి చోటు చేసుకుందని మార్టూరు మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ జాష్టి వెంకటనారాయణ బాబు సీఎం దృష్టికి తీసుకువచ్చారు. రైతులు చెప్పిన విషయాలు విన్న సీఎం ఒక్కదానికీ సమాధానం ఇవ్వలేదు. పత్తి పంట వేస్తే ఎక్కువ ఆదాయం వస్తుందని రైతులు వేస్తున్నారని సీఎం పేర్కొనగా ముఖాముఖిలో చివరన ఉన్న రైతులు వరి పంటకు నీళ్ళు సరిపోవని పత్తి వేసినట్లు పేర్కొన్నారు. సీఎం పర్యటనలో కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి, మంత్రులు శైలజానాధ్, మహీధర్‌రెడ్డి, జిల్లాలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!