కేంద్రంలోని యుపిఎ ప్రభుత్వానికి ఓటమి ఘంటికలు మోగుతున్నాయా? ఉత్తరాఖండ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలలో జరిగిన రెండు ఉప ఎన్నికలలో కాంగ్రెస్ కు ఎదురైన పరాభవం అలాంటి సంకేతాలనే ఇస్తోంది. ఉత్తరాఖండ్ లో ముఖ్యమంత్రి విజయ బహుగుణ ఖాళీ చేసిన లోక్ సభ స్థానం తెహ్రి కి జరిగిన ఉప ఎన్నికలో బిజెపి సంచలన విజయం నమోదు చేసుకొంది. ఇరవైరెండువేల ఆధిక్యతతో బిజెపి గెలిచింది. ఇక పశ్చిమబెంగాల్ లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రాతినిధ్యం వహించిన జంగీపూర్ స్థానంలో కాంగ్రస్ అభ్యర్ధిగా పోటీచేసిన ఆయన కుమారుడు అభిజిత్ కనాకష్టంగా గెలిచారు.గతంలో ప్రణబ్ లక్షా ఇరవైఎనిమిదివేల మెజార్టీతో గెలిస్తే ఆయన కుమారుడు కేవలం మూడువేల లోపు మెజార్టీతో గండం నుంచి బయటపడ్డారు. కేంద్రంలో సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వద్రాపై అవినీతి పోరాట యోధుడు అరవింద్ కేజ్రీవాల్ ఆరోపణలు సంధించడం, పల్మాన్ కుర్షీద్ వంటి మంత్రులపై పెద్ద ఎత్తున ఆరోపణలు రావడం, చిల్లర వర్తకంలో విదేశీ పెట్టుబడులకు కేంద్రం అనుమతి ఇవ్వడం వంటివి ప్రభావితం చేశాయన్న అభిప్రాయం ఉంది. కాగా గతంలో 1993 లో మన రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కరరెడ్డి ప్రాతినిధ్యం వహించిన కర్నూలు లోక్ సభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో ఆయన కుమారుడు సూర్య ప్రకాష్ రెడ్డి చాలా కష్టపడితే పాతికవేల మెజార్టీతో గెలిచారు. అప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వం సంకటంలో పడిందని అంతా అనుకున్నారు. అలాగే 1994లో కాంగ్రెస్ పార్టీ ఎన్.టి.ఆర్.నాయకత్వంలోని టిడిపి ప్రభంజనం ముందు తుడుచుకుని పోయింది.అలాగే ఇప్పుడు ఈ ఉప ఎన్నికల ఫలితాలు ఉత్తరాదిలో కాంగ్రెస్ పరాజయానికి సిద్దమవుతోందన్న అభిప్రాయం కలుగుతోందని నిపుణులు చెబుతున్నారు.కేంద్రంలో కూడా కాంగ్రెస్ గెలుప్తుందన్న నమ్మకం లేదని కాంగ్రెస్ ఎమ్.పి ఒకరు వ్యాఖ్యానించారు.
source:kommineni
source:kommineni
No comments:
Post a Comment