YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Tuesday, 9 October 2012

మా జెండా అంటేనే వారికి భయం

- మా జెండా అంటేనే వారికి భయం
- టీడీపీపై మండిపడ్డ అంబటి

హైదరాబాద్, న్యూస్‌లైన్ : ప్రజాదరణ లేక గందరగోళంలో ఉన్న టీడీపీ నేతలు దిక్కు తోచని స్థితిలో వైఎస్సార్ కాంగ్రెస్, కాంగ్రెస్‌తో విలీనం అయిపోతోందంటూ దిగజారుడు విమర్శలు చేస్తున్నారని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. ఆయన మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రజాదరణలో మూడో స్థానంలో ఉన్న చంద్రబాబును కనీసం రెండో స్థానానికైనా తెచ్చుకుందామనే ఎత్తుగడతో విలీనం పుకార్లు పుట్టిస్తున్నారని విమర్శించారు. అశేషమైన ప్రజాదరణతో మొన్నటి ఉప ఎన్నికల్లో విజయదుందుభి మోగించిన తమ పార్టీకి మరో పార్టీతో విలీనం అయ్యే అవసరం ఎంత మాత్రం లేదని ఆయన తేల్చి చెప్పారు. 

‘వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి ఢిల్లీ నివాసం గేటు దగ్గర ఇది వరకు పార్టీ జెండా ఉండేదట. అది ఇపుడు కనపడ్డం లేదట...కాంగ్రెస్‌లో విలీనం చేయడానికే జెండాను తీసేశారట...జగన్ ఇంట్లో ఫ్యాన్ తీసేసి ఏసీ బిగించుకున్నారట. ఫ్యాన్ లేదు కాబట్టి విలీనం అయిపోతారట...’ టీడీపీ వారు ఇంతటి చౌకబారు పసలేని విమర్శలు చేస్తున్నారని ఆయన మండి పడ్డారు. చదవేస్తే ఉన్న మతీ పోయిందన్న రీతిలో టీడీపీ నాయకుడు దాడి వీరభద్రరావు చేసిన ఈ విమర్శలు చూస్తే ఆయన స్థాయి తప్పి మాట్లాడుతున్నారనిపిస్తుందని అంబటి అన్నారు. రాష్ట్రంలో అనేక ప్రజా సమస్యలున్నా ప్రతిపక్ష పార్టీగా వాటి జోలికి పోకుండా జగన్ ఇంటికి రంగులేమి వేశారు, జెండా ఎలా ఉంది అని ఇంత కీలకంగా తీక్షణంగా టీడీపీ పరిశీలిస్తోందంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా అంటే వారెంత భయపడి పోతున్నారో అర్థం అవుతోందని అంబటి అన్నారు. 

రాష్ట్రపతి ప్రణబ్‌కుమార్ ముఖర్జీని తమ పార్టీ గౌరవాధ్యక్షురాలు వె.ఎస్.విజయమ్మ మర్యాదపూర్వకంగా కలిసి నందుకు టీడీపీ వారు రకరకాలుగా వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. విజయమ్మ, రాష్ట్రపతిని కలిసినా, ప్రధానిని కలిసినా బహిరంగంగానే కలిశారని దాపరికం ఏమీ లేదన్నారు. టీడీపీ అధినేత ఎన్.చంద్రబాబునాయుడు మాదిరిగా రహస్యంగా కలవ లేదని రాంబాబు దెప్పి పొడిచారు. చంద్రబాబు ప్రధాని వద్దకు ఎంపీలతో కలిసి వెళ్లినపుడు అందరి సమక్షంలో ఒక సారి, విడిగా ఎవరూ లేకుండా 3,4 నిమిషాలు మరోసారి కలిసి అవసరమైతే కాంగ్రెస్‌కు మద్దతు నిస్తామనే నీచమైన ఆలోచనలు కూడా చేశారని అలాంటివి తమ పార్టీ చేయదని అంబటి అన్నారు. అసలు కుమ్మక్కు అయ్యే వారు బహిరంగంగా కలుస్తారా! కుమ్మక్కు అయ్యే వారు బాబులాగా కలుస్తారు గానీ...అని ఆయన ఎద్దేవా చేశారు. 

ఢిల్లీలో జగన్ నివాసం వద్ద జెండా లేదని ఓ పనికి మాలిన పత్రిక రాస్తే దాన్ని పట్టుకుని టీడీపీ వారు యాగీ చేయడం ఎంత వరకు సమంజసం అని ఆయన ప్రశ్నించారు. ఓ వర్గం మీడియా ఇష్టానుసారం వ్యతిరేక వార్తలు రాస్తూ ఉందని వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఎందుకంటే అలాంటివి కనుక ప్రజలు పట్టించుకుని ఉంటే వై.ఎస్.రాజశేఖరరెడ్డి రెండు సార్లు కాంగ్రెస్‌ను గెలిపించి ఉండే వారే కాదన్నారు.టీడీపీ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్‌లోకి వస్తున్న వలసలను ప్రస్తావించగా ‘బాబు పాదయాత్ర 50 కి.మీ పూర్తి కాగానే ఒక నాయకుడు వచ్చారు, 100 కి.మీ పూర్తి కాగానే ఇద్దరు వచ్చారు, 200 పూర్తయ్యేటప్పటికి నలుగురు వస్తారు...ఇలా ఆయన యాత్ర పూర్తి అయ్యేంత వరకూ వస్తూనే ఉంటారు’ అని అంబటి అన్నారు. తమ పార్టీ తరపున పాదయాత్ర ఉంటుందా, ఉంటే ఎవరు చేస్తారనేది బుధవారం జరిగే పార్టీ సీజీసీ, సీఈసీ సంయుక్త సమావేశంలో నిర్ణయిస్తామని ఆయన మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

http://www.sakshi.com/Main/Breakingstory.aspx?catid=465777&Categoryid=14&subcatid=0

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!