YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Wednesday, 10 October 2012

బాబు హయాంలోనే ఒప్పందం

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే 2000 నవంబర్ 18న ఎమ్మార్ ప్రాజెక్టు ఒప్పందం జరిగిందని.. 2002లోనే ప్రాజెక్టుకు భూకేటాయింపులు జరిగాయని సీనియర్ ఐఏఎస్ అధికారి బి.పి.ఆచార్య తరఫు న్యాయవాది వి.సురేందర్‌రావు సీబీఐ ప్రత్యేక కోర్టుకు నివేదించారు. బెయిల్ మంజూరు చేయాలంటూ ఆచార్య మరోసారి దాఖలు చేసుకున్న పిటిషన్‌ను ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి యు.దుర్గాప్రసాద్‌రావు బుధవారం విచారించారు. ఈ సందర్భంగా ఆచార్య తరఫున సురేందర్‌రావు వాదనలు వినిపించారు. 2005 జనవరి 19 నుంచి 2009 డిసెంబర్ 24 వరకు ఆచార్య ఏపీఐఐసీ ఎండీగా బాధ్యతలు నిర్వహించారని.. ఆచార్య ఎండీగా బాధ్యతలు చేపట్టక ముందే ఎమ్మార్ ఒప్పందం జరిగిందని, ప్రాజెక్టుకు భూకేటాయింపులు, భూముల స్వాధీనానికి నోటిఫికేషన్ ఇచ్చారని ఆయన వివరించారు. ఎండీ హోదాలో ప్రాజెక్టు అమలును మాత్రమే ఆచార్య పర్యవేక్షించారని, ఒప్పందంలో ఎటువంటి మార్పులు, చేర్పులు చేయలేదని పేర్కొన్నారు. దర్యాప్తును అడ్డుకుంటారనే అనుమానంతోనే ఆచార్యను అరెస్టు చేస్తున్నామని సీబీఐ రిమాండ్ రిపోర్టులో పేర్కొందని, దర్యాప్తు పూర్తి చేసి ఇటీవల తుది చార్జిషీట్ కూడా దాఖలు చేసిందని వివరించారు. 

ఆచార్య పాత్రకు సంబంధించిన దర్యాప్తు పెండింగ్‌లో లేదని సీబీఐ దాఖలు చేసిన అన్ని చార్జిషీట్లలో స్పష్టం చేసిందని గుర్తుచేశారు. ఇదే కేసులో నిందితుడిగా ఉన్న మరో ఐఏఎస్ అధికారి ఎల్.వి.సుబ్రమణ్యం ఇప్పటికీ సర్వీసులోనే కొనసాగుతున్నారని, ఆయన సాక్షులను ప్రభావితం చేయలేనప్పుడు ఆచార్య ఎలా చేయగలరని ప్రశ్నించారు. ఇప్పట్లో తుది విచారణ ప్రారంభమయ్యే అవకాశం లేదని.. సుప్రీంకోర్టు నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం బెయిల్ పొందేందుకు ఆచార్య అర్హుడని నివేదించారు. మరోవైపు.. ఎమ్మార్ కేసు దర్యాప్తు పూర్తయిందని, అయినా ఆచార్యను జైలులోనే ఉంచాలని సీబీఐ తరఫున డిప్యూటీ లీగల్ అడ్వయిజర్ బళ్లా రవీంద్రనాథ్ వాదనలు వినిపించారు. ఏపీఐఐసీ ఉద్యోగులు ఈ కేసులో సాక్షులుగా ఉన్నారని, ఆచార్యకు బెయిల్ ఇస్తే వారిని ప్రభావితం చేసే అవకాశం ఉందన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి నిర్ణయాన్ని ఈ నెల 16కు వాయిదా వేశారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!