YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Friday, 12 October 2012

మందకృష్ణా.. టీడీపీలో చేరు

హైదరాబాద్, న్యూస్‌లైన్: నిజాలు చెప్పడం చేతకాక, నిత్యం అబద్ధాలతో కాలం వెళ్లదీస్తున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు మాదిరిగానే ఆయనకు వంతపాడుతున్న మంద కృష్ణమాదిగ కూడా వ్యహరిస్తున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ సీజీసీ సభ్యుడు ఎం.మారెప్ప దుయ్యబట్టారు. చంద్రబాబుపై అభిమానం ఉంటే ఆ పార్టీలో చేరి, పచ్చచొక్కా తొడుక్కోవాలని సూచించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎస్సీ విభాగం రాష్ట్ర కన్వీనర్ నల్లా సూర్యప్రకాష్‌తో కలిసి శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే మాదిగలకు అత్యంత లబ్ధి చేకూరిందని మారెప్ప వివరించారు. 

మాదిగలపై వైఎస్‌కు ప్రత్యేక అభిమానం ఉండేదని అందుకే 2009 ఎన్నికల్లో జనరల్ స్థానాలైన మల్కాజ్‌గిరి పార్లమెంటుకు, జడ్చర్ల శాసనసభ స్థానానికి మాదిగ అభ్యర్థులకు టికెట్లు ఇచ్చారని చెప్పారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో కూడా వైఎస్ అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదం పొందేలా చేసి కేంద్రానికి పంపించిన విషయాన్ని గుర్తుచేశారు. అదే విధంగా వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి కూడా వర్గీకరణకు మద్దతిస్తూ లేఖపై సంతకం చేశారని చెప్పారు. తమ పార్టీ మొదటి ప్లీనరీలో కూడా వర్గీకరణపై తీర్మానం చేశామన్నారు. 

మందకృష్ణ వాటన్నింటినీ విస్మరించి మహానేత వైఎస్‌పై అవాకులు చవాకులు మాట్లాడటం సరైందికాదని, ఇలాగే వ్యవహరిస్తే సహించేది లేదని హెచ్చరించారు. తన హయాంలో ఏబీసీడీల ద్వారా మాదిగలకు 22 వేల ఉద్యోగాలు కల్పించానంటూ చంద్రబాబు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు దాదాపు రూ.17 వేల కోట్లు చంద్రబాబు పాలనలోనే పక్కదారి పట్టించారని ఆరోపించారు. ఫోన్‌ల ద్వారా ప్రధానులను, రాష్ట్రపతులను నియమించానని చెప్పుకునే చంద్రబాబు ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత ఎందుకు తీసుకురాలేదని మారెప్ప ప్రశ్నించారు.

చిత్తశుద్ధి, విశ్వసనీయతలేని చంద్రబాబుకు చెక్క భజన చేస్తున్న మందకృష్ణను మాదిగలు కూడా నమ్మడంలేదని పార్టీ ఎస్సీ విభాగం రాష్ట్ర కన్వీనర్ నల్లా సూర్యప్రకాష్‌రావు దుయ్యబట్టారు. చంద్రబాబు హయాంలో వృద్ధులకు, వితంతువులు, వికలాంగులకు కేవలం రూ.75 పెన్షన్ అందజేయడమే కాకుండా దాన్ని సైతం మూడునెలలకొకసారి ఇచ్చింది నిజం కాదా? అని మందకృష్ణను సూటిగా ప్రశ్నించారు. వృద్ధులకు రూ.200లు, వికలాంగులకు రూ.500 నెలనెలా వచ్చేటట్లు చేసిన ఘనత వైఎస్‌దేనని చెప్పారు. అయితే మందకృష్ణ వాస్తవాలను దాచిపెట్టి చంద్రబాబు మాదిరిగానే అసత్యాలను చెప్తున్నారని విమర్శించారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!