YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Thursday, 11 October 2012

రాజన్న దారిలోనే...

Written by Rajababu On 10/11/2012 5:04:00 PM
విద్యుత్ చార్జీల పెంపుపై నిరసన వ్యక్తం చేసిన రైతులను నిట్టనిలువునా బషీర్ బాగ్ లో కాల్పి చంపిన కాలం.. అంగన్ వాడీ కార్యకర్తలను నడిరోడ్డు మీద గుర్రాలతో తొక్కించిన పాలన అది.. భవిష్యత్ కానరాక చేనేత కార్మికులు, రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న రోజులవి.. పాలకులకు ప్రజల సమస్యలంటే అసహ్యం వేసిన సమయం.. డబ్బుల కోసమే రైతులు, చేనేత కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ప్రజల మనోభావాలను దెబ్బ తీసిన ఆ రోజుల్లో ప్రతిపక్ష పార్టీ నాయకుడి హోదాలో వైఎస్ రాజశేఖరరెడ్డి మహా కార్యక్రమాన్ని చేపట్టారు. మండు టెండలను సైతం లెక్క చేయకుండా.. తెలుగుదేశం సాగిస్తున్న ప్రజా వ్యతిరేక పాలనలో ప్రజల ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా తెలుసుకోవడానికి మహానేత 'ప్రజాప్రస్థానం' పేరుతో పాదయాత్రకు స్వీకారం చుట్టారు. ప్రజా ప్రస్థానంలో 16 వందల కిలో మీటర్లకు పైగా పాదయాత్ర చేసి ప్రజలతో మమేకమయ్యారు. రంగారెడ్డి జిల్లా చేవేళ్ల నుంచి ప్రారంభమైన ప్రజా ప్రస్థానం శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం లో ముగిసింది. సుదీర్ఘంగా సాగిన పాదయాత్రలో ప్రజల కష్టాలను మహానేత స్వయంగా చూశారు.. విన్నారు.. ఆకలింపు చేసుకున్నారు.. దాని ఫలితమే తొమ్మిదేళ్ల ప్రజావ్యతిరేక పాలనకు వ్యతిరేకంగా జనం తీర్పు ఇచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖరరెడ్డి పదవీ బాధ్యతల్ని చేపట్టాక... ప్రజలకు ఇచ్చిన మాటను మరవకుండా ఎన్నో ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేశారు. ఆరోగ్య శ్రీ, ఫీజు రీఎంబర్స్ మెంట్, పావలా వడ్డీ, 108 సర్వీసు, వృద్యాప్య, వికలాంగ పెన్షన్ పథకాలను వైఎస్ విజయవంతంగా అమలు చేశారు.

ప్రజల్లో భరోసా కల్పించిన వైఎస్ కు మరోసారి పట్టం కట్టారు జనం. అయితే విధి ఆడిన నాటకంలో మహానేత ప్రజలకు దూరమయ్యారు. మహానేతతోపాటే ప్రజా సంక్షేమ పథకాలు కూడా ప్రజలకు దూరమయ్యాయి. ప్రజలు గతంలో కంటే ప్రస్తుతమే ప్రజలు ఎక్కువ ఇబ్బందులకు లోనవుతున్నారని విజయమ్మ అన్నారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వ హయాం నాటి సువర్ణయుగం త్వరలోనే వస్తుందని ప్రజల్లో భరోసా కల్పించాలనే ఉద్దేశ్యంతోనే మరో 'ప్రజా ప్రస్థానం' పాదయాత్ర చేపట్టనున్నట్టు వైఎస్ఆర్ సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ వెల్లడించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ .. వైఎస్ చేపట్టిన 'ప్రజాప్రస్థానం' ను షర్మిలా మరోసారి కొనసాగించనున్నట్టు విజయమ్మ తెలిపారు.

ఆరోగ్యశ్రీ, ఇందిరమ్మ గృహాలు, వడ్డీ లేని రుణాలు, 108 సర్వీసుల పథకాలు నిర్వీర్యం అయ్యారని.. నిత్యవసర వస్తువుల ధరలు కొండెక్కి కూర్చున్నాయని.. ప్రభుత్వ అభివృద్ధి పథకాల ఊసే లేదని.. ఉద్యోగాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని.. 104 సర్వీస్ ఉద్యోగాలు కల్పించలేకపోయిందని మీడియా సమావేశంలో వెల్లడించారు.
ఇలాంటి సమస్యలు రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న తరుణంలో పాదయాత్ర చేసి ప్రజలకు నమ్మకాన్ని కలిగించాలనే ఉద్దేశంతో పాదయాత్రను చేపడుతున్నామన్నారు. ఇబ్బందుల్లో ఉన్న ప్రజలుకు బాసటగా నిలువాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి, పార్టీ నాయకుల అభిప్రాయం మేరకు పాదయాత్ర చేపట్టాలని నిర్ణయం తీసుకున్నామని విజయమ్మ తెలిపారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ కుమ్మక్కై జగన్మోహన్ రెడ్డిని జైలులో పెట్టినందున షర్మిలా పాదయాత్ర చేయడానికి ముందుకు వచ్చారని ఆమె అన్నారు. మహానేత ప్రజల దగ్గరికి ఎలా వచ్చారో.. ప్రజలకు ఎలా భరోసా ఇచ్చారో అదే విధంగా.. వైఎస్ రాజశేఖరరెడ్డి స్పూర్తితో పాదయాత్ర చేయాలని నిర్ణయించామన్నారు. పాదయాత్ర అక్టోబర్ 18 తేదిన వైఎస్ఆర జిల్లా ఇడుపుల పాయ నుంచి ప్రారంభమై ఇచ్చాపురం వరకు సుమారు 3 వేల కిలోమీటర్లకు పైగా సాగుతుందని అన్నారు. సమస్యల పరిష్కారానికి ప్రజల మధ్య ఉండాలని జగన్ చెప్పారని.. బెయిల్ పై విడుదలయ్యాక జగన్ పాదయాత్రను కొనసాగిస్తారని.. అప్పటి వరకు షర్మిల పాదయాత్రను నిర్వహిస్తారన్నారు.

ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందా అని సాధారణ ప్రజల్లో అనుమానాలు నెలకొన్న నేపథ్యంలో విశ్వసనీయతకు, ప్రజా సంక్షేమ పథకాలు కేరాఫ్ అడ్రస్ గా మారిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి పాదయాత్రతో వెళ్లేందుకు నిర్ణయం తీసుకుంది. ప్రజా వ్యతిరేక పాలన సాగించిన ఏ ప్రభుత్వాన్నైనా ప్రజలు హర్షించరు అని ఎన్నో సంఘటనలు చరిత్రలో మనకు సాక్ష్యంగా నిలిచాయి. ప్రజలతో మమేకమైన, ప్రజా సమస్యల పరిష్కారానికి అండగా నిలిచి ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాపక్షంగా మారి ఎలుగెత్తి పోరాటం చేస్తోంది. ప్రజలు సమస్యలుపై పోరాటం చేయడానికి.. ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి, జనానికి భరోసా ఇవ్వడానికి.. వైఎస్ అందించిన స్పూర్తితో మరో ప్రజాప్రస్థానానికి వైఎస్ఆర్ సీపీ ముందుడుగు వేస్తోంది. ప్రజల విశ్వాసాన్ని చూరగొనడం.. విశ్వసనీయత అనేది వైఎస్ రక్తంలోనే ఉందని విజయమ్మ చేసిన వ్యాఖ్యలు షర్మిలకు అండగా ఉన్నాయి. షర్మిల ప్రజాప్రస్తానం యాత్ర ప్రజలకు సువర్ణయుగాన్ని అందిస్తాయని ప్రజలు ఆశిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా షర్మిల పాదయాత్రకు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


http://www.sakshi.com/Main/Featuredetails.aspx?Newsid=50617&Categoryid=28&subcatid=0

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!