పులివెందుల/ఇడుపులపాయ, న్యూస్‌లైన్: రాష్ట్రంలో పేద ప్రజల కన్నీళ్లు తుడిచి వారికి భరోసా ఇవ్వడానికే మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి కుమార్తె షర్మిల పాదయాత్రను చేపట్టేందుకు సిద్ధమైనట్లు తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి చెప్పారు. ఈ నెల 18 నుంచి ప్రారంభమయ్యే ఆ యాత్రకు సంబంధించిన అనేక అంశాలపై చర్చించేందుకు శనివారం ఇడుపులపాయలోని వైఎస్‌ఆర్ గెస్ట్‌హౌస్‌లో పార్టీ నేతలు సన్నాహక సమావేశం నిర్వహించారు.
అనంతరం వైఎస్‌ఆర్ సీపీ కేంద్ర పాలక మండలి సభ్యులు భూమానాగిరెడ్డి, ఎమ్మెల్యేలు కొరముట్ల శ్రీనివాసులు, అమరనాథరెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, జిల్లా వైఎస్‌ఆర్ సీపీ కన్వీనర్ సురేష్‌బాబు, పులివెందుల ఇన్‌చార్జి వై.ఎస్.భాస్కర్‌రెడ్డితో కలిసి భూమన కరుణాకర్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. షర్మిల చేపట్టబోయే పాదయాత్ర దేశ చరిత్రలో తొలి మహిళా యాత్ర అని అన్నారు. 18వ తేదీ ఉదయం 11గంటలకు వైఎస్‌ఆర్ ఘాట్‌లో నివాళులర్పించి బహిరంగ సభ నిర్వహించిన అనంతరం పాదయాత్ర ప్రారంభమవుతుందన్నారు. ఈ పాదయాత్ర ఆరునెలల పాటు కొనసాగుతుందన్నారు. మహానేత ఐదేళ్లలో రాష్ట్రాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్లారని, ఆయన మరణం తరువాత ప్రజలు కష్టాలలో చిక్కుకున్నారని భూమన అన్నారు. ప్రజల కష్టాలు తెలుసుకొని తామున్నామని భరోసా ఇవ్వడానికే వైఎస్ కుటుంబం నుంచి షర్మిల పాదయాత్ర చేపట్టనున్నారన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి, గోవిందరెడ్డి, పాదయాత్ర కో-ఆర్డినేటర్ తలశిల రఘురాం తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment