పాదయాత్రను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రాజకీయంలో చివరి అస్త్రంగా ప్రయోగిస్తున్నారు. 2004 ఎన్నికలకు ముందు 2003లో దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి మండుటెండల్లో చేవెళ్ల నుంచి ఇచ్చాపురం వరకు 1500 మైళ్ల పాదయాత్ర నిర్వహించారు. ఆయన తన పాదయాత్ర ద్వారా ప్రజల మనసులను దోచుకున్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర విజయవంతం కావడానికి చాలా కారణాలున్నాయి.
ఆ కారణాల్లో కొన్ని - 1. వైయస్ రాజశేఖర రెడ్డి 25 ఏళ్ల పాటు అధికారంలో లేరు. ఉత్తమ ఆలోచనలు కలిగిన ప్రత్యామ్నాయ నేతగా ప్రజలు వైయస్సార్‌ను చూశారు. 2. వైయస్ పాదయాత్రను ప్రజలు అధికారం కోసం చేపట్టినట్లుగా ప్రజలు భావించలేదు. దాన్ని అధికారం కోసం యాత్రగా వారు చూడలేదు. 3. రాష్ట్రం కరువుతో, రైతుల ఆత్మహత్యలతో రాష్ట్రం అట్టుడికిపోతోంది. ప్రభుత్వం ప్రతిపక్షాల మాటలను వినడం లేదు. ప్రజలను పట్టించుకోవడం లేదు. వ్యవసాయంపై కాకుండా పాలకులు ఐటి వంటివాటిపై దృష్టి పెట్టారు. రైతుల కష్టాలు, వ్యవసాయ ఇబ్బందులు తెలిసిన నేతగా రైతుల ముంగిట్లోకి వైయస్ వెళ్లారు.
4. సంప్రదాయబద్దమైన వస్త్రధారణ, ఎదుటి వారు చెప్పేది సహనంతో వినే వైయస్ లక్షణం ప్రజలను ఆకర్షించింది. తక్కువ మాట్లాడి ఎక్కువ వినే పద్ధతిని వైయస్ అనుసరించారు. 6. ప్రస్థానం వల్ల కాంగ్రెసు కార్యకర్తలు తెలుగదేశం పార్టీని ఓడించే శక్తిగల నాయకుడిగా గుర్తించి వైయస్ నాయకత్వంపై విశ్వాసం పెంచుకున్నారు.
వైయస్ రాజశేఖర రెడ్డి ప్రజా ప్రస్థానం అతి సాధారమైంది. ప్రజల కష్టాలను తెలుసుకోవడానికి చేపట్టిన ఒక కార్యక్రమం. దానికి దర్శకుడు లేడు, స్క్రిప్టు రైటర్ లేడు. మానసిక నిపుణుల సలహాలు లేవు. ప్రజల చెంతకు ఎలా వెళ్లాలనే విషయాన్ని పనిగట్టుకుని సిద్ధం చేసుకున్న వ్యవహారాలు ఏవీ లేవు. సాధారణమైంది, అద్భుతమైంది, అంతే...
చంద్రబాబు చేపట్టిన వస్తున్నా మీకోసం పాదయాత్ర సినిమా లాగానో, డ్రామాలాగానో ఉంది. ప్రముఖ సినీ దర్శకులు, రచయితలు ఇందులో పాలు పంచుకున్నారు. తన రాజకీయ జీవితంలో మొదటిసారి చంద్రబాబు తన భార్యను భాగస్వామిని చేశారు. హిందూపురంలో హారతి ఇచ్చి చంద్రబాబును ఆమె పాదయాత్రకు సాగనంపారు. ముసలి వాళ్లను, యువకులను కౌగలించుకుంటూ, వారిని ముద్దాడుతూ యాత్ర సాగిస్తున్నారు. పరిస్థితి అనుగుణంగా తమ నాయకుడు నడుచుకోవడం పట్ల తెలుగుదేశం కార్యకర్తలు సంతోషంగా ఉన్నారు.
మొదటిసారి విక్టరీ సింబల్ వదిలేసి నమస్కారం పెడుతున్నారు. ఐటిని వదిలేసి ప్రజల ముందుకు వచ్చారు. అయితే, అత్యంత నిస్సహాయ స్థితిలో చంద్రబాబు ఆ స్థితికి రావాల్సి వచ్చిందని తటస్థ పరిశీలకులు భావిస్తున్నారు. పార్టీ కార్యకర్తలకు ఉత్సాహంగానే ఉంది, కానీ సాధారణ ప్రజలు అంత ఆసక్తి చూపడం లేదు. తొమ్మిదేళ్ల పాటు తమ పట్ల చంద్రబాబు నిర్దయగా వ్యవహరించిన తీరును, తమ సమస్యలను పట్టించుకోకపోవడాన్ని వారు మరిచిపోలేకపోతున్నారు.
కాంగ్రెసు దుష్టపాలనకు వ్యతిరేకంగా ఎందుకు పాదయాత్ర చేస్తున్నారనే ప్రశ్నకు సమాధానం కూడా చెప్పలేని స్థితిలో చంద్రబాబు ఉన్నారు. రాజ్యాంగపరంగా సంక్రమించిన అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించడానికి ఆయన ముందుకు రావడం లేదు. వైయస్ జగన్ దూకుడుని కాంగ్రెసుతో కుమ్మక్కయి నిలువరించడానికి మాత్రమే చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు.
చంద్రబాబు ఓటు బ్యాంకు క్రమంగా తగ్గిపోతూ వస్తోంది. తెలుగుదేశం పార్టీ ఓటు బ్యాంకు 1994లో 44.14 శాతం ఉండగా 2010 - 2012 19. 5 శాతానికి తగ్గిపోయింది. వైయస్సార్ కాంగ్రెసు ఓటు బ్యాంకు 54 శాతం ఉంది. వివిధ వర్గాలు తెలుగుదేశం పార్టీకి దూరమయ్యాయి. 2009 నుంచి 45 అసెంబ్లీ లేదా పార్లమెంటు స్థానాల్లో చాలా చోట్ల తెలుగుదేశం డిపాజిట్లు కోల్పోయింది. తెలుగుదేశం పార్టీ విశ్వసనీయతను కోల్పోయింది. ఇదంతా చంద్రబాబు అవకాశవాద రాజకీయాలు, విధానాల వల్లనే జరిగింది.
బ్యాండ్ ఎయిడ్ ద్వారా తెలుగుదేశం పార్టీ పైకి లేస్తుందని అనుకుంటున్నారు. కానీ శస్త్రచికిత్స చేసినా ఫలితం ఉండదని గ్రహించలేకపోతున్నారు. తమ తప్పుడు కథనాలతో ప్రజలను ప్రభావితం చేస్తామని ఎల్లో మీడియా భావిస్తోంది. చంద్రబాబు చాలా వాటికి ఆద్యుడైనా చాలా పాతవాటిని వదిలించుకోలేకపోతున్నారు. బొంబాయిలో అన్ని సౌకర్యాలతో రూపుదిద్దిన ఎసి బస్సు చంద్రబాబుకు కావాల్సి వచ్చింది. మరో ఎసి బస్సులో ప్రయాణించే వంటవాడు కావాలి. ప్రత్యేకంగా చంద్రబాబుకు వంటలు చేసి పెట్టాలి. ప్రత్యేకంగా జ్యూస్‌లు, స్నాక్స్ కావాలి. ఇప్పటికీ గంట, గంటన్నర పాటు అర్థం పర్థం లేని ప్రసంగాలు సాగిస్తున్నారు. ప్రజలు చెప్పేది వినడానికి బదులు ఆయన ప్రసంగాలు చేస్తున్నారు.
తాను తప్ప అందరూ అవినీతిపరులు, దుర్మార్గులు అని చెప్పడానికి చంద్రబాబు ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు వల్లనే ఈ రోజు ప్రజలు నలిగిపోతున్నారు. గత తరాల కన్నా ప్రజలు ఇప్పుడు తెలివి పెంచుకున్నారు. చంద్రబాబు ఏం అనుకున్నా ప్రజలు మాత్రం ఆయనకు తగిన విధంగానే సమాధానం చెబుతున్నారు. దాన్ని 45 సార్లు ప్రజలు ఆయనకు చూపించారు. చంద్రబాబు వస్తున్నా మీకోసం యాత్ర తెలుగుదేశం అవకాశాలు పెంచుతుందనేది కల్ల మాత్రమే.
గురువారెడ్డి, అట్లాంటా, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ
No comments:
Post a Comment