YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Monday, 12 November 2012

అవిశ్వాసం ఎందుకు పెట్టవు బాబూ?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు అంబటి, గడికోట ప్రశ్న
ఊరూరా తిరిగి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న బాబు.. తెర వెనుక ఎందుకు రక్షిస్తున్నట్టు?
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టే అవకాశాన్ని ఎందుకు ఉపయోగించుకోరు?
మజ్లిస్ మద్దతు ఉపసంహరించుకున్న అరగంటకే ప్రభుత్వాన్ని పడగొట్టబోమని టీడీపీ ప్రకటించింది
ఆ వెంటనే ప్రభుత్వానికి ఢోకా లేదని బొత్స చెప్పారు
ఇదంతా లాలూచీ కుస్తీ కాదా?

హైదరాబాద్, న్యూస్‌లైన్ : కాంగ్రెస్ ప్రభుత్వానికి మజ్లిస్ పార్టీ మద్దతును ఉపసంహరించుకున్న తరువాత ఉత్పన్నమైన సందిగ్ధ పరిస్థితుల్లో కూడా ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబునాయుడు అవిశ్వాస తీర్మానం ఎందుకు పెట్టరని వైఎస్సార్ కాంగ్రెస్ కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యుడు అంబటి రాంబాబు ప్రశ్నించారు. సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డితో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘తొమ్మిదేళ్లుగా కాంగ్రెస్‌తో ఉన్న మిత్రపక్షం మజ్లిస్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంది. ఈ పరిస్థితులను సువర్ణావకాశంగా తీసుకుని అవిశ్వాసం పెట్టకుండా బాబు ఎందుకు వెనుకడుగు వేస్తున్నారు’’ అని అంబటి ప్రశ్నించారు. 

‘‘కిరణ్ సర్కారు దౌర్భాగ్యమైనదని, ఒక్క గంట కూడా అధికారంలో కొనసాగే హక్కు దీనికి లేదని ఊరూరా తిరిగి చెబుతున్న చంద్రబాబు.., తెరవెనుక అదే ప్రభుత్వాన్ని ఎందుకు రక్షిస్తున్నట్లు? ముప్పై ఏళ్లుగా కాంగ్రెస్‌పై పోరాటం చేస్తున్నానని చెబుతున్న చంద్రబాబు, ఆ ప్రభుత్వాన్ని పడగొట్టే అవకాశం వచ్చినప్పుడు ఎందుకు ఉపయోగించుకోరు? అసలు మీది ప్రతిపక్షమా లేక అధికార పక్షానికి మిత్రపక్షమా స్పష్టం చేయాలి’’ అని డిమాండ్ చేశారు. ‘‘కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు మజ్లిస్ నేత ఒవైసీ మధ్యాహ్నం 12 గంటలకు ప్రకటించారు. ఆ తరువాత అరగంటకే.. అవిశ్వాసం పెట్టబోమంటూ టీడీపీకి చెందిన ఓ పెద్దమనిషి సెలవిచ్చారు. ఆయన అలా చెప్పారో లేదో.. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇదంతా లాలూచీ కుస్తీ అనిపించడంలేదా’’ అని ధ్వజమెత్తారు. ఈ ప్రభుత్వం ఎప్పుడు పడిపోతుందా అని రాష్ట్ర ప్రజానీకం ఎదురు చూస్తోందని, ఆ పని చేయాల్సిన చంద్రబాబు మాత్రం అదేమీ పట్టించుకోకుండా తెరవెనుక నుంచి కాపాడుతున్నారని అంబటి విమర్శించారు. వేరే పార్టీలతో కలిసి అవిశ్వాస తీర్మానం పెట్టడానికి తాము సిద్ధంగా లేమని అంబటి ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. సభలో అవిశ్వాస తీర్మానం వస్తే మాత్రం మద్దతిచ్చి తీరుతామని స్పష్టంచేశారు. మజ్లిస్ మద్దతు ఉపసంహరణ వెనుక జగన్ కుట్ర ఉందా అని ఓ విలేకరి ప్రశ్నించగా.. ‘‘చంద్రబాబు అవిశ్వాసం పెట్టకపోవడం వెనుక కూడా జగన్ కుట్రే ఉంది. ఒక్కటేమిటి ఈ రాష్ట్రంలో ఏది జరిగినా జగన్ కుట్రే ఉంది’’ అని రాంబాబు వ్యంగ్యంగా బదులిచ్చారు.

ప్రభుత్వం బాగుందని చెప్పండి

ప్రభుత్వాన్ని పడగొట్టబోమని చెబుతున్న చంద్రబాబు ‘‘కిరణ్ ప్రభుత్వం బాగుంది. 2014 వరకూ ఈ ప్రభుత్వమే కొనసాగాలని ప్రజలంతా కోరుకుంటున్నారు’’ అని బహిరంగంగా చెప్పాలని శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. ‘‘మజ్లిస్ మద్దతు ఉపసంహరణతో కాంగ్రెస్ బలం 153కు పడిపోయిందంటున్నారు. కొందరు ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా ఈ ప్రభుత్వంతో విసిగిపోయామని, అవకాశం వచ్చినప్పుడు బయటకు వస్తామని సంకేతాలు ఇస్తున్నారు. ఇలాంటి పరిస్థితిని బాబు వినియోగించుకోవడంలేదు. అలాంటప్పుడు ప్రభుత్వాన్ని పదే పదే విమర్శించడమెందుకు? ‘వస్తున్నా మీకోసం’ అంటూ కాలికి బొబ్బలెక్కేలా తిరగడం దేనికి? కరువు, వరద సహాయ చర్యల్లో వైఫల్యం, విద్యుత్ సరఫరాలో అధ్వానంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వంపై బాబుకు మమకారం ఎందుకు’’ అని శ్రీకాంత్‌రెడ్డి ప్రశ్నించారు. ‘‘అసలు టీడీపీ ఎమ్మెల్యేలు చెబుతున్నదేమిటి? వైఎస్ పాలన తెస్తామని మేము బహిరంగంగా చెబుతూ ఉంటే.. రావణ రాజ్యం వస్తుందని వారు అంటున్నారు. వైఎస్ పాలన ఎలా ఉందో చెప్పాల్సింది ప్రజలు. టీడీపీ వారు కాదు’’ అని అన్నారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!