YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Saturday, 17 November 2012

చంద్రబాబుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత మైసూరా ప్రశ్న

అవిశ్వాసం పెట్టకుండా ప్రభుత్వాన్ని తిట్టడం ఎందుకు?
డొంక తిరుగుళ్లు, మెలికలు ఎందుకు?
బేరసారాలు ఎవరివో అవిశ్వాసం వచ్చినపుడు తేలుతుంది
అవిశ్వాసం గురించి మాకు పూర్తిగా తెలుసు
మీరు ఇప్పుడు సరేనంటే.. అసెంబ్లీ సమావేశాలు 
ప్రారంభమైనప్పుడే అవిశ్వాసం పెట్టొచ్చు


హైదరాబాద్, న్యూస్‌లైన్: అవిశ్వాస తీర్మానం పెట్టే విషయంలో సూటిగా స్పందించకుండా డొంక తిరుగుళ్లు, వంకర టింకర మాటలెందుకని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు(సీజీసీ) ఎం.వి.మైసూరారెడ్డి టీడీపీ నేతలను సూటిగా ప్రశ్నించారు. ఆయన శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావుతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘ఈ ప్రభుత్వానికి ఒక్క రోజు కూడా అధికారంలో కొనసాగే అర్హత లేదని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడే చెబుతున్నారు.. పనికి మాలిన ప్రభుత్వం అంటున్నారు.. అదే నిజమైనపుడు ఒక గుర్తింపు పొందిన ప్రధాన ప్రతిపక్షంగా అవిశ్వాస తీర్మానం పెట్టమని మేం కోరుతున్నాం.. దానికి స్పందించకుండా అవిశ్వాస తీర్మానం గురించి తెలియని వాళ్లు అడిగితే మేం పెడతామా! అని ప్రశ్నించడం ఏమిటి? అవిశ్వాసమంటే మీకు భయమా?’ అని మైసూరా ప్రశ్నించారు. 

రెండుసార్లు ప్రతిపక్షంలోనూ, ఒక సారి అధికారంలోనూ పనిచేసిన వ్యక్తిగా తనకు అవిశ్వాస తీర్మానం గురించి పూర్తిగా తెలుసునని, శాసనసభ నియమావళిపై కూడా అవగాహన ఉంద ని మైసూరా అన్నారు. ‘‘అవిశ్వాసం పెట్టేది శాసనసభ సమావేశాలున్నపుడేనన్న విషయం బాగా తెలుసు, అయినా ఎందుకు డిమాండ్ చేస్తున్నామంటే ఇపుడు మీరందుకు అంగీకరిస్తే చాలు, సమావేశాలు ప్రారంభమైనపుడే పెట్టొచ్చు’’ అని మైసూరా వివరణ ఇచ్చారు. ‘‘చంద్రబాబు చట్టసభలో అవిశ్వాసం పెట్టే అవకాశాన్ని వదిలి వేసి ఊరూరా పాదయాత్రలు చేస్తూ ప్రభుత్వంపై తిట్ల పురాణం చదివితే ప్రయోజనం ఏమిటి? ఇది ప్రజలను తప్పుదోవ పట్టించడమే అవుతుంది. వారిని మభ్య పెట్టడమే అవుతుంద’’ని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మాకు అధికార దాహం లేదు: గవర్నర్ వద్దకు వెళ్లి బలప్రదర్శన చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్‌ను టీడీపీ నేతలు కోరడాన్ని మైసూరా తప్పు పట్టారు. ‘‘గవర్నర్ ముందు బలప్రదర్శన అనేది అధికారదాహంతో ఉన్నవాళ్లు చేసే పని. తమకున్న సంఖ్యాబలాన్ని ప్రదర్శించి ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరేవాళ్లు అలా చేస్తారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అధికార దాహం లేదు, ఆ పని చేయదు. ప్రజల్లో ఉండి వారి విశ్వాసంతో ఎన్నికై ప్రభుత్వంలోకి రావాలనుకునే పార్టీ మాది, అందుకే బల ప్రదర్శన వేరు, అవిశ్వాసం వేరు అంటున్నాం’’ అని అన్నారు. ‘‘మంత్రులే చెబుతున్నారు, ఈ ప్రభుత్వంలో పాలన జరగడం లేదని, అచేతనంగా ఉందని, ఒక చేయికి తెలియకుండా మరో చేయితో పనులు జరుగుతున్నాయని... ఇవన్నీ వారు అంతర్గతంగా మాట్లాడ్డం లేదు, బాహాటంగా మీడియా ముందుకే వచ్చి చెబుతున్నారు. ఇలాంటి అనిశ్చిత పరిస్థితిని టీడీపీ ఒక ప్రతిపక్షంగా ఉపయోగించుకుని అవిశ్వాసం పెట్టకుండా వెనక్కు తగ్గడాన్నే మేం ప్రశ్నిస్తున్నాం, అవిశ్వాసం అంటే మీకు భయమా? పెట్టడానికి ధైర్యం లేదా’’ అని ఆయన అన్నారు. 

సంఖ్యాబలం ఉంటే తామే అందుకు పూనుకునే వారమని, లేదు కాబట్టే టీడీపీ పెడితే మద్దతు ప్రకటిస్తామని చెబుతున్నామని అన్నారు. అవిశ్వాసం పెట్టాలని అందరూ డిమాండ్ చేస్తున్నా పెట్టడం లేదంటే టీడీపీ ప్రభుత్వంతో లాలూచీ పడిందనైనా అనుకోవాలి, లేదా అభయహస్తం ఇచ్చిందనైనా అనుకోవాలన్నారు. అసలు అవిశ్వాసం పెడితే ఎవరు బేరసారాలు ఆడుకునేదీ కచ్చితంగా తేలిపోతుందన్నారు. ఏ పార్టీకి చెందిన ఒక్క ఎమ్మెల్యే గైర్హాజరైనా వారు ప్రభుత్వంతో బేరమాడుకున్నట్లేనని మైసూరా అన్నారు. ఎమ్మెల్యేలను కొనుక్కునే అవసరం తమకు లేదని, నేలవిడిచి సాము చేయడ ం చంద్రబాబు అలవాటని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

డ్రామాల బాబు: వంద మంది బీసీలను శాసనసభకు పంపిద్దామని తమ పార్టీ ప్రతిపాదిస్తే దానికి సమాధానం చెప్పకుండా వంద టికెట్లు ఇస్తామని చంద్రబాబు చెప్పడం మోసపూరితమని గట్టు రామచంద్రరావు అన్నారు. గెలవలేని చోట్ల సీట్లను కేటాయించడం కన్నా ముఖ్యమైన పార్టీలన్నీ కూడబలుక్కుని అనధికారికంగా బీసీలకు వంద స్థానాలు కేటాయిద్దామనేది తమ పార్టీ విధానమని ఆయన అన్నారు. నిజంగా బాబుకు ఈ విషయంలో చిత్తశుద్ధి లేదని, డ్రామాలాడుతూ డ్రామాల బాబుగా మారి పోయారని విమర్శించారు.

source:sakshi

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!