‘‘ఫ్యాక్షన్ గొడవల్లో మా నాన్నను చంపేశారు. మా అమ్మ ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేస్తుంది. ఇల్లు గడవక మా అమ్మ మమ్ములను స్కూలు మాన్పించింది. మేం ఏ గ్రేడ్ స్టూడెంట్లం. మాకు చదువుకోవాలని ఉంది..’’ అంటూ ఇద్దరు చిన్నారులు ఏడుస్తూ చెప్పడంతో షర్మిల చలించిపోయారు. వెంటనే పిల్లలిద్దరినీ దగ్గరికి తీసుకొని ‘‘ఏడ్చొద్దు తల్లీ! మీ ఇద్దరినీ చదివించే బాధ్యత నాది.. మీ చదువు పూర్తయ్యే వరకు నేను చూసుకుంటా’’ అని వారికి హామీ ఇచ్చారు. పత్తికొండలో షర్మిల బస చేసిన క్యాంప్ వద్దకు ఆదివారం ఉదయమే పదేళ్ల రాశి, ఆ పాప తమ్ముడు సురేంద్ర వచ్చారు. షర్మిలక్కను కలవాలంటూ సెక్యూరిటీ వారికి చెప్పి అక్కడే కూర్చున్నారు.
అది చూసిన పుట్టపర్తి నియోజకవర్గం పార్టీ నేత డాక్టర్ హరికృష్ణ వారిద్దరిని షర్మిల వద్దకు తీసుకెళ్లారు. షర్మిలను చూడగానే పిల్లలిద్దరు వెక్కివెక్కి ఏడుస్తూ తమ పరిస్థితిని వివరించారు. తండ్రి హనుమంతు హత్యకు గురైతే తల్లి అనసూయ ఓ ప్రైవేటు క్లినిక్‌లో పనిచేస్తూ నెలకు రూ.2,500 సంపాదిస్తుందని, దీంతో ఇల్లు గడవడం కూడా కష్టంగా ఉందని పాప రాశి ఏడుస్తూ వివరించింది. దీంతో పాఠశాల చదువు అయిపోయేంత వరకు చదివించే బాధ్యత తనదేనని షర్మిల హామీ ఇచ్చారు. ఆ సమయంలో అక్కడే ఉన్న పత్తికొండ నియోజకవర్గం నాయకులు నాగరత్నమ్మ, రామచంద్రారెడ్డి, పుట్టపర్తి నియోజకవర్గం నాయకుడు హరికృష్ణ ఆ పిల్లల బాధ్యత తాము తీసుకుంటామని చెప్పారు. ‘‘మాట ఇచ్చాను. తప్పొద్దన్నా’’ అంటూ షర్మిల ఆ పిల్లలను వారికి అప్పగించారు. నాగరత్నమ్మ పాప రాశిని కస్తూరిబా పాఠశాలలో చేర్పించే ఏర్పాటు చేయగా, డాక్టర్ హరికృష్ణ బాబు పాఠశాలకు నెలనెలా ఫీజు చెల్లించేందుకు హామీ ఇచ్చారు.
No comments:
Post a Comment