YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Saturday, 17 November 2012

భరోసానిస్తూ!

‘తాగడానికి నీళ్లు లేవు... రెండు, మూడు గంటలకు మించి కరెంటు ఉండదు... చేన్లకు నీళ్లు లేవు.. పింఛన్లు ఎత్తేశారు... ఫీజులు కట్టలేక పిల్లలు చదువు మానేశారు... నవంబర్ వచ్చినా స్కూల్లో యూనిఫారాలు లేవు... వలంటీర్ టీచర్లకు జీతాలు లేవు...’

- వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌మోహన్ రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన ‘మరో ప్రజా ప్రస్థానం’ పాదయాత్రలో అడుగడుగునా ప్రజలు చెపుతున్న సమస్యల్లో ఇవి కొన్ని మాత్రమే.

కర్నూలు, న్యూస్‌లైన్ ప్రతినిధి: షర్మిల పాదయాత్ర చేస్తూ వస్తున్నారని తెలియగానే వ్యవసాయ పనులు పక్కన బెట్టి రైతులు... కూలీ పనులు మానుకొని మహిళలు... బస్సులు, ఆటోల్లోని ప్రయాణీకులు... గుంపులు గుంపులుగా తరలివస్తూ జగన్ సోదరికి తమ బాధలు చెప్పుకున్నారు. ఈ దుర్మార్గపు ప్రభుత్వ పాలనలో ప్రజల కష్టాలు తెలుసుకొని జగనన్నకు చెప్పేందుకే తాను వచ్చానన్నారు. జిల్లాలో పదోరోజు పాదయాత్రలో భాగంగా శనివారం షర్మిల ఎమ్మిగనూరు మండలంలోని గణేష్ రైస్‌మిల్ నుంచి శనివారం ఉదయం పాదయాత్ర ప్రారంభించారు. కలుగొట్ల, కె. తిమ్మాపురం, దైవం దిన్నెల గుండా కోడుమూరు నియోజకవర్గంలోని కంపాడ్‌లోకి ప్రవేశించించారు. 15 కిలోమీటర్ల పాదయాత్రలో షర్మిలకు అడుగడుగునా జనం నీరాజనాలు పట్టారు.

రాత్రి వరకు ప్రజల బాధలు వింటూనే...
ఉదయం పాదయాత్ర ప్రారంభమైన తరువాత కలుగొట్ల వద్ద మహిళలు, రైతులు, కూలీలు, విద్యార్థులు రోడ్డు పైకి వచ్చి కూర్చొని షర్మిలకు తమ బాధలు చెప్పుకున్నారు. మహానేత వై.ఎస్. రాజశేఖర్‌రెడ్డి ఉన్నప్పటి పరిస్థితి... ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యల గురించి విన్నవించారు. పెరిగిన ఎరువుల ధరలు, కరెంటు లేక బోర్లు పనిచేయక ఎండుతున్న పంటలు, పండిన పంటలకు మద్ధతు ధర లేకపోవడం, ఉపాధి హామీ పథకంలో కూలీలకు రూ. 30 కూడా ఇవ్వని పరిస్థితి... ఇలా తాము ఎదుర్కొంటున్న సమస్యలను ఏకరువు పెట్టారు. షర్మిల ఓపిగ్గా విని ధైర్యం చెప్పారు. భవిష్యత్తుకు భరోసా ఇచ్చారు. 

చంద్రబాబే కాదు... కిరణ్‌కుమార్ కూడా అబద్దాల కోరే!
కె. తిమ్మాపురానికి వెళ్లగానే గ్రామ ప్రజలంతా ఊరి చావిడి వద్ద గుమిగూడి షర్మిలతో రచ్చబండ నిర్వహించారు. మహిళలంతా తమకు పింఛన్లు రావడం లేదని, ఉన్న పింఛన్లు కూడా ఎత్తేస్తున్నారని వెల్లడించారు. మహిళా గ్రూపుల కింద అప్పు తీసుకుంటే రూ.3 వడ్డీ వంతున వసూలు చేస్తున్నారని స్థానిక పరిస్థితిని వివరించారు. దీంతో షర్మిల ‘ సీఎం వడ్డీలేని రుణాలు ఇస్తున్నామని చెపుతున్నారు కదక్కా!’ అని ప్రశ్నించడంతో అలాంటిదేమీ లేదని సమాధానమిచ్చారు. దాంతో ఆమె ‘ ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు ఒక్కరికే అబద్దాలు చెప్పే అలవాటు ఉందనుకొన్నాను.

కానీ కిరణ్‌కుమార్ రెడ్డికి కూడా అబద్ధాలు దండిగానే చెప్పే అలవాటు ఉందన్నమాట’ అని వ్యాఖ్యానించారు. వారితో పాటు రైతులు కూడా కరెంటు, నీటి కష్టాలను చెప్పుకోగా... ‘ ఈ ప్రభుత్వం పట్ల మీకు విశ్వాసం ఉందా?’ అని ప్రశ్నించడంతో ‘లేదు... లేదు’ అంటూ సమాధానం చెప్పారు. దీంతో షర్మిల స్పందిస్తూ... ‘ ప్రజలకు విశ్వాసం లేకపోయినా ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడుకు మాత్రం కిరణ్ ప్రభుత్వంపై విశ్వాసం ఉందంట. అందుకే అవిశ్వాసం పెట్టడం లేదు’ అని చెపుతూ కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కు రాజకీయాలను, జగన్‌ను ప్రజలకు దూరం చేసేందుకు పన్నుతున్న కుట్రలను ప్రజలకు వివరించారు.

పెద్ద పెద్ద చదువులు చదవాలి...
కె. తిమ్మాపురంలో మధ్యాహ్న భోజనాల తరువాత పాదయాత్ర ప్రారంభించిన షర్మిల అక్కడే ఉన్న ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలకు వెళ్లారు. విద్యార్థులు పెద్ద సంఖ్యలో గుమిగూడి ఆమెకు స్వాగతం పలకడంతో పాటు తమ సమస్యలు వివరించారు. 

250 మంది విద్యార్థులకు ముగ్గురే రెగ్యులర్ టీచర్లు ఉన్నారని, విద్యావలంటీర్లను కూడా ఆగస్టులో గానీ నియమించలేదని వారు చెప్పారు. నవంబర్ నెల వచ్చినా ఇప్పటి వరకు యూనిఫారాలు లేవని, బాత్‌రూంలు సరిగా లేవని తమ బాధలు వెల్లడించారు. దీంతో షర్మిల టీచర్ గా మారి విద్యార్థులకు బుద్ధులు చెప్పారు. ‘తరతరాల వెనుకబాటుకు చదువే శాశ్వత పరిష్కారం. పిల్లలంతా శ్రద్ధగా మనసు పెట్టి చదువుకోవాలి. టెన్త్, ఇంటర్, డిగ్రీలతో చదువు ఆపకుండా పెద్ద చదువులు చదవాలి. పెద్ద ఉద్యోగాలు చేయాలి. మరో ఏడాది గడిస్తే జగన్ ముఖ్యమంత్రి అవుతారు. మీరు ఫ్రీగా చదువుకోవచ్చు. అప్పటి వరకు అధైర్యపడొద్దమ్మా! ’ అని బుజ్జగించారు.

అనంతరం గార్లదిన్నెలో కూలీలు, రైతులతో మాట్లాడి వారి బాధలు విన్నారు. గురు రాఘవేంద్ర ప్రాజెక్టు పూర్తికాక కాలువలకు నీరు రాక పడుతున్న కష్టాలు వివరించారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డిలదే ఈ పాపం అని ఆమె వివరిస్తూ... గురు రాఘవేంద్ర ప్రాజెక్టును ప్రారంభించి పనులు పూర్తిచేస్తే ఎత్తిపోతలకు మోటార్లు బిగించలేని దయనీయస్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. అనంతరం దైవందిన్నె వద్ద ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తూ ప్రభుత్వ, ప్రతిపక్ష తీరుపై నిప్పులు చెరిగారు. 

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!