YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Saturday 17 November 2012

‘రాజ’స్థానానికి రాచబాట సుగమం!


పెరుగుతున్న నైతిక బలం
పాదయాత్ర మాయాజాలం
కలిసిరాబోతున్న మధ్యంతరం
అట్నునంచి నరుక్కొచ్చిన ఎంఐఎం
సజీవంగా సానుభూతి పవనం
రాజశేఖరరెడ్డి అధిష్ఠించిన పీఠం మీదికి అధిరోహణం చేయాలన్నది జగన్ కల. అయితే కలను సాకారం చేసుకునే మార్గంలో ఉన్న జగన్‌ను మార్గమధ్యంలోంచే సీబీఐ తీసుకెళ్లి చంచల్‌గూడలో పెట్టింది. అక్కడ ఆయనకు మరింత ఖాళీ సమయం దొరికింది. మరింత బలంగా కలగంటున్నారు. కల సాకారమయ్యే దిశగా మరింత బలమైన వ్యూహరచనలు చేస్తున్నారు. వాటి ఫలితాలు జైలు వెలుపల కనిపిస్తున్నాయి. ఆయన కలలను ఈడేర్చడానికి ఆయన అనుచరులు, వర్గీయులు, కుటుంబసభ్యులు అందరూ అహరహం పూజలు చేస్తున్నారు. శ్రమిస్తున్నారు. అది సహజం. అయితే, ఆయన అభిమానులు, సన్నిహితుల పూజలు ఫలిస్తునాయో... ఆయన వ్యూహాలు ఫలిస్తునాయోగానీ.. బాహ్యప్రపంచంలో జగన్‌కు అన్నీ మంచి శకునములే కనిపిస్తున్నాయి.
ఇనుమడిస్తున్న మనోబలం
వైఎస్ జగన్ జైలులోనే ఉండిపోయాడనే ఒక్క బాధ తప్ప... వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో దిగులేదీ లేదు. ఆ పార్టీ బలం నానాటికీ పెరుగుతోంది. జగన్ సొంత పార్టీ స్థాపించిన తర్వాత తొలిసారిగా ఎదుర్కొన్న కడప ఉప ఎన్నికల సమయంలోనే ఆయన గురించి నానా అవాకులూ చెవాకులూ ప్రచారంలోకి వచ్చాయి. గతంలో వచ్చినంత మెజారిటీ ఈసారి రాదని, మరొకటి మరొకటని చివరిక్షణం దాకా ప్రచారం చేశారు. ఇప్పుడు కూడా సరిగ్గా జగన్ వైరి పక్షాల నుంచి అలాంటి ప్రచారమే జరుగుతోంది. ఇప్పటిదాకా జగన్ గెలిచిన స్థానాలన్నీ సానుభూతితో గెలిచినవేనని, ఈ సానుభూతి 2014 ఎన్నికల వరకు నిలబడడం అనేది అసాధ్యమని... జగన్ మట్టికొట్టుకుపోవడం ఖాయమని పాపం నేతలు గొంతులు చించుకుంటున్నారు. కానీ కడప ఉప ఎన్నికల సందర్భంలో ప్రజలు ఇచ్చిన తీర్పు.. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా జగన్ పట్ల వెలువడుతుందనడంలో సందేహం లేని పరిస్థితి కనిపిస్తోంది.
జగన్ తన వర్గ బలాన్ని నిరూపించుకోవడానికి ప్రయత్నించిన రోజున నోరు మెదపకుండా మిన్నకున్న ఎమ్మెల్యేల్లో అనేక మంది ఇప్పుడు ఆయన పార్టీలో సభ్యులుగా ఉన్నారు. ఆనాటినుంచి ఈనాటి లోగా వారు తమ ఎమ్మెల్యే పదవులకు కూడా రాజీనామాలు చేసేశారు. ఇంకా రాజీనామాలు చేయకుండా.. తమ రాజకీయ ప్రస్థానాన్ని ఆయనతో కలిపి నడిపిస్తున్న వారు ఇంకా అనేకులు. జగన్ గేలం వేస్తున్నాడు, కొంటున్నాడు, ప్రలోభ పెడుతున్నాడు, డబ్బు సంచులు చేరవేస్తున్నాడు... ఇలాంటి పడికట్టు విమర్శలు అనేకం రాజకీయ ప్రకటనల మార్కెట్‌లో సదా వినిపిస్తూఉండవచ్చు గాక.. సామాన్యుడి చిన్న బుర్రకు స్ఫురించే చిన్న లాజిక్ ఏమిటంటే.. మొన్నటికి మొన్న తన వర్గం వారితో రాజీనామాలు చేయించి... 17 స్థానాల్లో ఉప ఎన్నికలకు తెరతీసిన రోజున జగన్‌కు తన బలాన్ని ‘బ్లోఅప్’ చేసి చూపించుకోవాల్సిన అవసరం ఉంది. ఏకమొత్తంగా ఎంతమంది తనకోసం కాంగ్రెసును వదలి వస్తారో.. అంతమందినీ ఆయన అదేరోజున రాజీనామాలు చేయించడానికి ప్రయత్నించారు. అందులో సందేహం లేదు. ఒకవేళ ఈ వైరిపక్షాలు ఆరోపిస్తున్న డబ్బు సంచులు, ప్రలోభాలు వంటి ప్రక్రియలు ఎన్నయినా.. సరే ఆరోజున జరిగి ఉండాలి. అంతేతప్ప, ఇప్పుడు  అనగా.. ఆయన జైల్లోకి వెళ్లిన తర్వాత.. ఆగి ఆగి.. అప్పుడొకటీ అప్పుడొకటీ ప్రలోభపెట్టే అవకాశం లేదు. అంటే జగన్ కోసం వచ్చేస్తున్న ఎమ్మెల్యేలు కేవలం డబ్బుసంచులకోసమే వస్తున్నారన్న ఆరోపణలు పసలేనివని ఇప్పుడు జరుగుతున్న ఎమ్మెల్యే రాజేష్ చేరిక వంటివి నిరూపిస్తున్నాయి. ఎమ్మెల్యే వనిత చేరిక కూడా ఆ పార్టీకి మరో మంచి పరిణామం. కనీసం రాబోయే ఎన్నికల్లో తనకు మళ్లీ టిక్కెట్ ఇస్తారా లేదా అనే ఒప్పందం గురించి కూడా మాట్లాడుకోకుండానే తను వైకాపాలో చేరుతున్నట్లుగా ఆమె చాలా స్పష్టంగా ప్రకటించారు.
అచ్చంగా ఇలాంటి చేరికలు, ఇలాంటి మాటలు పార్టీకి నైతిక బలాన్ని పెంచుతాయి. పొద్దస్తమానమూ తమ ప్రత్యర్థులు ఒకటే తరహా ప్రలోభాల విమర్శలతో విరుచుకుపడుతోంటే.. నలుగురూ చెబితే అబద్ధం నిజమవుతుందనే సిద్ధాంతాన్ని నిరూపణ చేయడానికన్నట్లుగా మాట్లాడుతూ ఉంటే.. ఇలాంటి పరిణామాలు పార్టీకి నైతికంగా అదనపు బలాన్ని అందిస్తాయి. ఒకవైపు జగన్ జైల్లో ఉన్నాడనే దిగులు దిగమింగుకుంటూ బయట పార్టీ నిర్మాణం సన్నగిల్లకుండా దృష్టి నిలుపుతున్న శ్రేణులకు ఇలాంటి అనల్పమైన మనోబలాన్ని కూడా అందిస్తాయి.
షర్మిల పాదయాత్ర
వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర రోజులు ఇప్పుడు మళ్లీ ఆయన అభిమాన ప్రజలకు గుర్తుకు వస్తున్నాయి. వైఎస్ తనయ... తండ్రి జమానాలో రాజకీయాలంటే విముఖత చూపిస్తూండే షర్మిల అనివార్యమైన పరిస్థితిలో ఇప్పుడు ప్రజల ముందుకు వచ్చారు. పాదయాత్రకు సాహసించారు. ఆమె పాదయాత్రకు లభిస్తున్న స్పందన కూడా వైకాపా ఆశలను చిగిరింపజేస్తోంది. పార్టీకి గరిష్టంగా ఆశలు పెంచుతున్న మరో మంచి శకునం ఇది.
షర్మిల పాదయాత్ర విషయంలో పార్టీలో అనేక మల్లగుల్లాలు పడ్డారు. తెలుగుదేశం నేత చంద్రబాబునాయుడు పాదయాత్ర చేస్తున్న నేపథ్యంలో తాము కూడా అచ్చంగా అదే యాత్ర కాకుండా.. మరో రకంగా ప్రజలకు చేరువ కావాలని ప్లాన్ చేశారు. అయితే ఎక్కువ ప్రభావ పూరితంగా ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేయడానికి పాదయాత్ర ఒక్కటే ఉపకరించగలదని నిర్ణయించారు. విజయమ్మ పాదయాత్ర అనేది అసాధ్యం. అయతే వైఎస్ కుటుంబసభ్యులే చేస్తే తప్ప.. పాదయాత్రకు జనాదరణ ఔద్ధత్యస్థాయిలో ఉండడం జరగదు. మిగిలిన ఆప్షన్ షర్మిల ఒక్కటే. తన వ్యక్తిగత అభిరుచుల రీత్యా రాజకీయ పదవులు, ఎత్తుగడల పట్ల అనాసక్తిగా ఉండే మహిళ షర్మిల. జీవితమే రాజకీయంగా, ప్రజాజీవితంగా బతికిన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డితో కూడా ఈ విషయంలో ప్రేమగా పలుమార్లు ఎత్తిపొడుస్తూ ఉండే తనయ ఆమె. అలాంటిది తండ్రి పేరిట  ఏర్పాటైన పార్టీ అధికార పీఠం వైపు ప్రస్థానానికి తాను స్వయంగా సారథ్యం వహించాల్సి రావడం వైచిత్రి.
నిజానికి వైఎస్ షర్మిల పాదయాత్ర నిర్ణయం వెలువడిన తర్వాత.. వారిని విమర్శిస్తూ ప్రెస్‌మీట్‌లు పెట్టిన కాంగ్రెస్, తెదేపా నాయకులు మైకులు ఆఫ్ అయిన తరువాత ఆఫ్ ది రికార్డ్ ఎన్నెన్ని వెటకారాలు మాట్లాడారో వింటే పార్టీ కార్యకర్తలకు రక్తం ఉడుకెత్తుతుంది. షర్మిల ఏమిటి పాదయాత్ర చేయడం ఏమిటి.. అంటూ అనేకులు సూటిపోటిమాటలతో నీరసపరిచే ప్రయత్నం చేశారు. రెండు మూడు రోజులు గడిచేసరికి వారి నోళ్లకు తాళాలు పడ్డాయి. ఎండ కన్నెరుగకుండా పెరిగన అతివ.. రోజుల తరబడి పాదయాత్ర చేయడం అసలు ఊహకైనా సాధ్యమేనా అనుకున్న వారు.. తమలో నివ్వెరపాటును కప్పిపుచ్చుకోవడానికి నానా పాట్లు పడాల్సి వచ్చింది. ప్లాన్ ఏ విమర్శలు ఫెయిలవడంతో.. అంతా ప్లాన్ బీకి మళ్లారు. షర్మిల పాదయాత్ర వారి కుటుంసభ్యుల్లో అభిప్రాయ భేదాలకు తావిస్తోందని, జగన్ భార్య భారతికి ఇష్టం లేదని.. షర్మిలే అధికారాన్ని తన్నుకు పోతుందని ఇలా రకరకాల కొత్త విమర్శలను అందుకున్నారు. కుటుంబంలోనూ చిచ్చుపెట్టడానికి ప్రయత్నించారు. షర్మిల జగన్‌ను అతిక్రమించి జనాదరణ పొందకుండా కాపలా కాసేందుకే విజయమ్మ అప్పుడప్పుడూ పాదయాత్రలో పాల్గొంటున్నారంటూ పీసీసీ చీఫ్ బొత్స కూడా ఇలాంటి లేకి విమర్శల రాజకీయాలకు దిగజారారు.
అయితే ప్రజలు మాత్రం ఈ అన్ని రకాల విమర్శలను ఏకరీతిగా గమనిస్తున్నారు. ఓర్వలేనితనంగా, వైరిపక్షాల దుష్ర్పచారంగా మాత్రమే చూస్తున్నారు. ఆ రకంగా షర్మిల పాదయాత్ర పార్టీకి అద్భుతమైన మైలేజీని ఇవ్వగలుగుతోంది.
మధ్యంతరం మహిమాన్వితం...
పూర్తికాలం పరిపాలిస్తే.. తమ తమ ప్రభుత్వాలు చేసిన పూర్తిస్థాయి అక్రమాలన్నీ వెలుగుచూస్తే పూర్తిగా పరువు గంగపాలైపోతుందని బెదిరిపోతున్న కాంగ్రెస్ వచ్చే ఆగస్టు సమయానికెల్లా మధ్యంతర ఎన్నికలు వచ్చేలాగా... వ్యూహరచన చేస్తున్నదని సమాచారం. కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే.. రాబోయే సార్వత్రిక ఎన్నికల తర్వాత రాహుల్‌గాంధీ ప్రధాని కావడం ఒక్కటే వారికి జీవితాశయం. ఏం చేసినా, ఏం ఆలోచించినా ఆ దిశగానే చేస్తుంటారు. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ నేలమట్టం అయిపోయినా సరే... వారికి అనవసరం.. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఏది మంచిదనిపిస్తే అది చేస్తారు. ఆ రీతిగా చూస్తే.. వచ్చే సంవత్సరం బడ్జెట్‌సమావేశాల తర్వాత.. పార్లమెంటు రద్దు నిర్ణయం ప్రకటించి ఆగస్టు వేళకు మధ్యంతరానికి వెళ్లాలన్నది కాంగ్రెస్ పెద్దల ప్లాన్. తమ ప్రభుత్వాల వైఫల్యాలు ఎక్కువ వెలికి రాకుండా ముందే ప్రజల వద్దకు వెళ్లాలని ఆలోచన. అదే జరిగితే ఆ సమయానికే రాష్ట్రప్రభుత్వం కూడా రద్దవుతుంది. ఇక్కడకూడా అప్పుడే మధ్యంతర ఎన్నికలు వస్తాయి.
అదే నిజమైతే.. జగన్‌కు అంతకు మించిన అద్భుతమైన శకునం ఉండదు. అందరూ ఏ సానుభూతి జగన్‌కు అనుకూలం అవుతుందని అంటున్నారో.. 2014 దాకా ఆ సానుభూతి నిలబడదని ఎత్తిపొడుస్తున్నారో...  అలాంటి సానుభూతి మధ్యంతరం నాటికి చాలా చాలా సజీవంగా, ఆమాటకొస్తే మరింత ఉధృతంగా ఉంటుంది. అంటే మధ్యంతరమే వస్తే గనుక... జగన్ మరింత ఢంకా బజాయించి గెలవడం గేరంటీ.
ఎంఐఎం ఉపసంహరణ
దాదాపు దశాబ్దంగా కాంగ్రెస్‌తో కలిసి అంటకాగుతున్న మజ్లిస్ పార్టీ కిరణ్‌ప్రభుత్వ దుర్మార్గం గా వ్యవహరిస్తున్నదన్న ఆరోపణలతో కాంగ్రెస్‌ను సంఘపరివార్ కీలుబొమ్మగా అభివర్ణిస్తూ తమ మద్దతు ఉపసంహరించడం అనేది రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత తాజా పరిణామం. సాధారణంగా హైదరాబాదు మినహా మిగిలిన రాష్ట్రంలో అడుగు పెట్టి కూడా ఎరగని నాయకులు ఒవైసీలు... ఇప్పుడు తాము రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి కిరణ్ సర్కారు అనుసరిస్తున్న ముస్లిం వ్యతిరేక వైఖరిని ఎండగడతామని వార్నింగ్ ఇచ్చారు కూడా. ఇది జగన్‌కు చాలా అనుకూలమైన శకునం. నిజానికి జగన్ స్వయంగా నడిపించిన మంత్రాంగం అనికూడా ప్రచారంలో ఉంది.
రాష్ట్రంలో సాంప్రదాయంగా ముస్లిం ఓటుబ్యాంకు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉంది. ఈ వర్గంలో తన బలం పెంచుకోవడానికి జగన్ తన ప్రయత్నాలు తాను చేశారు. మధ్యలో జగన్ బీజేపీతో కలవబోతున్నాడనే ప్రచారాన్ని, తప్పుడు అభివర్ణనలతో ప్రచారంలోకి తేవడం ద్వారా ముస్లింలలో జగన్ పట్ల కొంత మేర అనుమానాలు సృష్టించడంలో ఆయన వైరిపక్షాలు కృతకృత్యమయ్యాయి. కాంగ్రెస్‌ను వ్యతిరేకిస్తూ.. సోనియాతోనే సున్నం పెట్టుకున్న జగన్ కేంద్రస్థాయిలో తన మనుగడను కాపాడుకోవాలంటే.. కాంగ్రెస్‌కు ఏకైక ప్రత్యామ్నాయం అయిన బీజేపీతో కలవాల్సిందే కదా అనే లాజిక్ కొందరికి అనుమానాలను కలిగించింది. అయితే ఇప్పుడు మజ్లిస్ దన్నుతో జగన్ సదరు అనుమానాలను సమూలంగా, అది కూడా రాష్ట్రవ్యాప్తంగా తుడిచిపెట్టేయబోతున్నారు.
మంచి చెడుల సంగతి ఎలా ఉన్నా.. ఈ రాష్ట్రంలో ముస్లింలకు అంటూ ఓ స్థాయిలో ఉన్న ఏకైక పార్టీ ఎంఐఎం మాత్రమే. రాష్ట్రమంతా ముస్లింలు ఈ పార్టీని తమదిగా ఐడెంటిఫై చేసుకుంటారు. ఆ పార్టీ నాయకులు ఊరూరూ తిరిగి కాంగ్రెస్‌ను తిట్టడం ప్రారంభిస్తే ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. పైగా ముస్లిం వర్గాల్లో కట్టుబాటు కూడా జాస్తి. అసద్ ఇప్పటికే జగన్ తనకు ప్రస్తుతం మంచి స్నేహితుడు అనే స్టేట్‌మెంట్ కూడా ఇచ్చారు. ముస్లిం ఓటు బ్యాంకును గంపగుత్తగా తన వైకాపా ఖాతాలో వేసుకోవడానికి జగన్ సంధించిన పాశుపతాంగా అసదుద్దీన్ ఒవైసీని భావించాలి. వారి రాష్ట్ర యాత్ర కార్యరూపంలోకి రాగానే.. ముస్లిం ఓటు బ్యాంకు వైకాపా కు నీరానాలు పట్టడమూ ఎక్కువవుతుంది. ఆల్రెడీ మతాల ప్రాతిపదికగా క్రిస్టియన్ ఓటు బ్యాంకు గన్ జేబులోనే ఉంది. ఈ రెండు మతాల ఓటు బ్యాంకులను రాష్ట్ర వ్యాప్తంగా ఏకరీతిగా తన పరం చేసుకున్న తర్వాత జగన్ తన దృష్టి కేంద్రీకరించడానికి మిగిలేదెల్లా... హిందువుల్లో కులాల వారీ ఓటుబ్యాంకులు మాత్రమే. అందులో కొన్ని తన ఖాతాలోనే ఉండగా.. మరి కొన్నింటిని మరల్చుకోవడం ఆయనకు కష్టం కాదు. కొన్నింటిని విస్మరించడం వల్ల కూడా ఆయనకు నష్టం లేదు. ఏతావతా మత, కులాల ప్రాతిపదికల పరంగా మజ్లిస్ తాజా ఎత్తుగడ.. గన్‌కు చాలా గొప్ప శకునంగా కనిపిస్తోంది.
సానుభూతి భయం
జగన్ జైల్లో ఉండడం ప్రత్యర్థులకు ఒక రకంగా లాభిస్తుంది. రాబోయే ఎన్నికల్లో ఆయన విజయం సాధిస్తే గనుక... ‘జైల్లో ఉన్నాడనే సానుభూతితోనే ఓట్లు పడ్డాయని, సీబీఐ మీద, న్యాయవ్యవస్థ మీద తాము తమ కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి ప్రభావం  చూపించగలిగి ఉన్నా... ఆయనను బయటకు పంపి సానుభూతిని పలుచనచేసి ఉండేవార’మని కాంగ్రెస్ వారు ఆ తర్వాత అయిదేళ్లపాటూ ఆత్మవంచన చేసుకుంటూ బతికేయవచ్చు. అలాగే... ‘కాంగ్రెస్ పార్టీ జగన్‌తో కుమ్మక్కు అయిందని, అందుకే ఆయనను జైల్లో ఉంచి ఆయనకు సానుభూతి పెరిగి ఓట్లు వెల్లువలా పడేలా దోహదం చేసిందని.. పరోక్షంగా కాంగ్రెస్ జగన్ విజయానికి కారణమైం’దని ఇలా రకరకాల ఆషాఢభూతి మాటలు వల్లెవేస్తూ తెలుగుదేశం పార్టీ ఆ తర్వాతి అయిదేళ్లపాటూ కాలం దొర్లించవచ్చు. ఇందుకు పనికొస్తుందే తప్ప... ఆయనను జైల్లో ఉంచడం అనేది... వైకాపా పట్ల ప్రజల్లో సానుభూతి పవనాలు రెట్టింపు కావడానికి కారణం అవుతోంది.
వైకాపా ఆవిర్భావం తరువాత జరిగిన ఉప ఎన్నికల్లో అవమానకరమైన వ్యత్యాసాలతో ఓడిపోయిన పార్టీలు ... జగన్‌కు సానుభూతి అంశం ఒక్కటే కలిసొచ్చిందని అంటూ మాట్లాడిన ఆత్మవంచన మాటలు మనం ఇంకా మరచిపోలేదు. అయితే ఇప్పుడు ఆయన జైలు పాలవడం అనేది సదరు సానుభూతి (నిజమే అయితే) ప్రజల్లో  చెరగిపోకుండా సజీవంగా ఉండడానికి, జైలుపాలవడం గురించి అదనపు సానుభూతి జతకావడానికి కారణంగా నిలుస్తోందన్నది నిజం. ఆ రకంగా జగన్‌కు జైలు జీవితం.. సానుభూతి పవనాల పరంగా డబుల్ బొనాంజాగా భావించాల్సిందే తప్ప.. మరోరకమైన దిగులు అక్కర్లేదు.
source:
http://greatandhrapaper.com/telugunews.php?id=41335&cat=10&scat=37

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!