ఎంఐఎం మద్దతు ఉపసంహరణతో తక్షణ నష్టం ఏమీ లేదని విశ్లేషణ పాదయాత్ర నుంచి తాజా పరిస్థితిని వాకబు చేసిన చంద్రబాబు హైదరాబాద్, న్యూస్‌లైన్: కాంగ్రెస్ ప్రభుత్వానికి మజ్లిస్ మద్దతు ఉపసంహరణ టీడీపీని ఇరకాటంలో పడేసింది. అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు ఆ పార్టీకి అవకాశం ఏర్పడినా.. సర్కారుకు బాసటగానే నిలవాలని నిర్ణయించుకుంది. కాంగ్రెస్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టడానికి ఇది సరైన సమయంగా పార్టీ నేతలు పలువురు గట్టిగా అభిప్రాయపడినప్పటికీ పాదయాత్రలో ఉన్న అధినేత చంద్రబాబునాయుడు మాత్రం అందుకు భిన్నంగానే స్పందించారు. తాజా పరిణామాలపై పార్టీ నేతలను ఆయన అడిగితెలుసుకున్నారు. ఆయన ఆదేశాల మేరకు విలేకరుల సమావేశం నిర్వహించిన పార్టీ ఉపాధ్యక్షుడు ఇ.పెద్దిరెడ్డి అవిశ్వాస తీర్మానం పెట్టే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. గత కొన్నేళ్లుగా కాంగ్రెస్‌తో కుమ్మక్కయి పనిచేస్తున్నామన్న విమర్శలున్నాయని, వాటిని దూరం చేసుకోవడానికి ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవలసి ఉన్నప్పటికీ ఎన్నికలను ఎదుర్కొనే పరిస్థితి లేనందునే అవిశ్వాస తీర్మానం పెట్టకుండా రాజకీయ వ్యూహంతో వెళ్లాలని నిర్ణయించిన ట్టు పార్టీ నాయకుడొకరు చెప్పారు. ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైన కారణంగానే బాబు పాదయాత్ర చేస్తూ ప్రజల మధ్యకు వెళుతున్నారని టీడీపీ ప్రకటించింది. కానీ తాజా పరిణామాల నేపథ్యంలో.. అవిశ్వాసం అన్నది ప్రభుత్వాలను కూల్చడానికి కాదని, ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకేనని విలేకరుల సమావేశంలో మాట్లాడిన నేతలు చెప్పడం విశేషం. కాంగ్రెస్‌కు ఎంఐఎం మద్దతు ఉపసంహరణ గురించి రంగారెడ్డి జిల్లాలో పాదయాత్రలో ఉన్న చంద్రబాబు వాకబు చేశారు. మద్దతు ఉపసంహరణకు దారితీసిన పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అందుబాటులో ఉన్న నేతలతో, ముఖ్యులతో ఫోన్లో, వ్యక్తిగతంగా మధ్యాహ్నం భోజన విరామ సమయంలో మాట్లాడారు. ఎంఐఎం మద్దతు ఉపసంహరించుకున్నా, కాంగ్రెస్ తరపున ఎన్నికైన ఎమ్మెల్యేలు పలువురు శాసనసభ్యత్వాలకు రాజీనామాలు చేసినా ప్రభుత్వానికి తక్షణమే వచ్చిన నష్టమేమీ లేదని వారు విశ్లేషించుకున్నట్టు సమాచారం. ముఖ్యంగా పార్టీ ఎన్నికలను ఎదుర్కొనే పరిస్థితి లేకపోవడంపైనా చర్చించినట్లు తెలిసింది. పైగా తమ ఎమ్మెల్యేల రాజీనామాలు ఆమోదించటం లే దా వారిని శాసనసభ్యత్వాలకు అనర్హులుగా ప్రకటింపజేసిన తర్వాత ప్రభుత్వమే విశ్వాస పరీక్షకు వెళ్లొచ్చనే అభిప్రాయమూ వ్యక్తమైనట్లు చెప్తున్నారు. అదే జరిగితే మెజారిటీ అధికార పార్టీకే ఉంటుందని టీడీపీ నేతలు గట్టిగా వాదిస్తున్నారు. 2009లో టీడీపీ తరపున 92 మంది ఎంపికయ్యారు. అందులో 11 మంది పార్టీని వీడారు. ఇద్దరు స్వతంత్రులుగా ఉన్నారు. మరొకరు పార్టీ అధినేతపై అసంతృప్తిగా ఉన్నారు. వీరందరినీ మినహాయిస్తే పార్టీకి ప్రస్తుతం శాసనసభలో 78 మంది ఎమ్మెల్యేలున్నారు. 2004లో పార్టీ తరపున 46 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఎన్నికయ్యారు. ఆ సంఖ్యా బలంతోనే వైఎస్ ప్రభుత్వంపై ఒకసారి, అప్పటి స్పీకర్ కేఆర్ సురేష్‌రెడ్డిపై మరోసారి 2008లో అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించారు. తాజాగా గత ఏడాది డిసెంబర్‌లో అనేక ఒత్తిళ్ల నడుమ కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. 2008లో రాజకీయంగా ఉపయోగించుకునేందుకు, తాజాగా కిరణ్‌కుమార్‌రెడ్డి సర్కారుకు బలం ఉందని నిరూపించేందుకు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టామని పార్టీ నేత ఒకరు వ్యాఖ్యానించారు. ఇపుడు ఎంఐఎం మద్దతు ఉపసంహరించింది కాబట్టి మన కు రాజకీయంగా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే లాభం కంటే నష్టమే ఎక్కువని పార్టీ నేతలు చెబుతున్నారు. ఊహించని పరిణామాలు జరిగి ప్రభుత్వం కూలిపోతే ముందస్తు ఎన్నికలను ఎదుర్కోవాల్సి వస్తుందని, అది రాజకీయంగా తమకు నష్టం కలిగించే చర్య మాత్రమే అవుతుందని పొలిట్‌బ్యూరో నాయకుడొకరు విశ్లేషించారు. |
Monday, 12 November 2012
అవిశ్వాసానికి టీడీపీ వెనుకడుగు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment