YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Friday, 16 November 2012

రైతన్నను ఏడిపిస్తున్న ప్రభుత్వం: షర్మిల

రాష్ట్రంలో వైఎస్ జగన్ నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ప్రజాదరణ ఓర్వలేకే పాలక కాంగ్రెస్, ప్రతిపక్ష టీడీపీలు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని షర్మిల ధ్వజమెత్తారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో నిర్వహిస్తున్న మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో ఆమె మాట్లాడుతూ ఉదయించే సూర్యుడిని ఎవరూ ఆపలేరని, అలాగే జగన్ ప్రభంజనాన్ని ఎవరూ అడ్డుకోలేరని స్పష్టం చేశారు. 

రాష్ట్రంలో ప్రజలు ఎన్నడూ లేని కష్టాలు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సమయంలో ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ.. కాంగ్రెస్ తో కుమ్మక్కైందని విమర్శించారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలో ఉన్నప్పుడు 50 ఏళ్లు నిండిన చేనేత కార్మికులకు పింఛన్లు విడుదల చేస్తే, నేడు చేనేత రంగాన్ని ఆదుకునే నాథుడే కరువయ్యాడన్నారు. 

విద్యుత్ బకాయిను నాడు వైఎస్ 1300 కోట్లు మాఫీ చేశారని, కానీ నేడు కరెంటు కష్టాలు నానాటికీ పెరుగుతున్నాయని షర్మిల అన్నారు. రైతులకు విత్తనాలు, సబ్సిడీ అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ, రానున్న కాలంలో జగన్ నేతృత్వంలో ప్రజలు రాజన్న రాజ్యాన్ని తప్పక చూస్తారని షర్మిల పేర్కొన్నారు. ఆమె ప్రసంగానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది.

రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులపై ఏ మాత్రం శ్రద్ధ లేదని షర్మిల విమర్శించారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో శుక్రవారం నిర్వహిస్తున్న మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో ఆమె ప్రసంగిస్తూ రాష్ట్ర పాలక, ప్రతిపక్షాల వైఖరిని తీవ్రంగా ఆక్షేపించారు. రైతులపై మాత్రమే కాకుండా మహిళలు, విద్యార్థుల సమస్యలపై కూడా రాష్ట్ర ప్రభుత్వం అంతులేని నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోందన్నారు. రైతులు తీవ్ర అప్పుల్లో కూరుకుపోయారని, మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఆ పరిస్థితి లేదని షర్మిల అన్నారు. నాడు మహిళలకు వైఎస్.. పావలావడ్డీ రుణాలు ఇప్పిస్తే, నేడు కిరణ్ సర్కారు వడ్డీలేని రుణాలు ఇస్తామని ప్రకటించి అమలులో విఫలమవుతోందని దుయ్యబట్టారు.

ధరల పెరుగుదల అరికట్టలేకపోవడంతోపాటు, గ్యాస్ సిలిండర్ల పరమితి విధించడం, విద్యుత్, ఆర్టీసీ చార్జీల పెంపుతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్ సంక్షోభంతో పరిశ్రమలు మూతపడుతున్నాయని, పరిశ్రమలు రోడ్డున పడుతున్నాయన్నారు. వైఎస్ ఉన్నపుడు రాష్ట్రంలో ఈ పరిస్థితి లేదన్నారు. వైఎస్ దుర్మరణం తట్టుకోలేక చనిపోయినవారిని కాంగ్రెస్ నిర్లక్ష్యం చేసిందన్నారు. నాడు వారంతా కాంగ్రెస్ కు ఓటేసిన వారే అని, అయినా కూడా కాంగ్రెస్ పార్టీ తీవ్ర నిర్లక్ష్యం వహించిందని అన్నారు. 

ఎలాంటి సంక్షేమ పథకాన్ని ప్రవేశపెట్టినా రాజీవ్, ఇందిర పేర్లతో ప్రారంభించేవారని.. కానీ, వైఎస్ కుటుంబానికి కాంగ్రెస్ తీవ్ర ద్రోహం చేసిందని దుయ్యబట్టారు. విద్యార్థులు బాగా చదువుకోవాలని, ప్రతి ఇంటి నుంచి పిల్లలు ఉన్నత విద్యావంతులు కావాలని వైఎస్ఆర్ ఫీజు రీయింబర్స్ మెంట్ ప్రవేశపెడితే నేడు ప్రభుత్వం ఆ పథకాన్ని నానాటికీ మరుగునపరుస్తోందన్నారు. మరోవైపు ప్రతిపక్ష పాత్రను చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ మరిచిపోయిందని ఎద్దేవా చేశారు. మామను వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన చంద్రబాబుకు మాట ఇవ్వడం, నిలబెట్టుకోవడం అంటే ఏమిటో తెలియదన్నారు.

source:sakshi

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!