YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Thursday 15 November 2012

అవిశ్వాసం మేమే పెడతాం .మీరు మద్దతిస్తారా?

టీడీపీని నిలదీసిన వైఎస్సార్ సీపీ నేత మైసూరా
ప్రజల పట్ల విశ్వసనీయత ఉంటే చంద్రబాబే అవిశ్వాసం పెట్టాలి
కానీ ఆ పని చేయకుండా ఆయన వీధులకెక్కి విమర్శలు చేస్తున్నారు
అవిశ్వాసం పెడితే ప్రజా సమస్యలపై అసెంబ్లీలో చర్చ జరుగుతుంది
దీంతో ప్రజా సమస్యలు కొద్దిగానైనా పరిష్కారమయ్యే అవకాశముంది

హైదరాబాద్, న్యూస్‌లైన్: ‘‘ప్రభుత్వ వైఫల్యం కారణంగా రాష్ట్రంలో ప్రజలు పుట్టెడు దుఃఖంలో ఉన్నారు. సంక్షేమం పడకేసి పరిపాలన అస్తవ్యస్తమై ప్రజా జీవనం పూర్తిగా స్తంభించింది. ప్రజా శ్రేయస్సు కోరే ఏ రాజకీయ పార్టీకైనా శాసనసభ వేదికగా అవిశ్వాసం ప్రవేశపెట్టడానికి ఇంతకన్నా అనువైన సమయం మరొకటి ఉండదు. ప్రజల పట్ల విశ్వసనీయత ఉంటే గుర్తింపు కలిగిన ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా టీడీపీ అధినేత చంద్రబాబు అవిశ్వాసం పెట్టాలి. అలా చేస్తే ప్రజాపక్షంగా మేం మద్దతిస్తాం. లేదంటే ప్రజల పక్షాన నిలిచేందుకు మేమే అవిశ్వాసం ప్రవేశం పెడతాం. మీరు మద్దతిస్తారా?’’ అని ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిలదీసింది. సీజీసీ సభ్యుడు ఎం.వి.మైసూరారెడ్డి గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వివరించారు. 

‘‘విద్యుత్ కోతల కారణంగా పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నాయి. కార్మికులు రోడ్డున పడుతున్నారు. అలాగే రైతుల పరిస్థితి మరింత దయనీయంగా తయారైంది. మరోవైపు అసలు చార్జీలకంటే సర్దుబాటు చార్జీల పేరిట రెండింతలు అదనంగా విధిస్తున్నారు. నిత్యావసర ధరలు ఆకాశాన్నంటాయి. ఇలా అన్ని విధాలుగా ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. పరిపాలన చేయాలనే ఆలోచన ముఖ్యమంత్రి, మంత్రులకు లేదు. నిత్యం ఒకరికొకరు సయోధ్య కుదుర్చుకునేందుకు ఢిల్లీకి పరుగెత్తడానికే వారికి సమయం సరిపోదు’’ అని విమర్శించారు.

టీడీపీకీ అంతే బాధ్యత ఉంది..

ప్రజాశ్రేయస్సు పట్ల ప్రభుత్వానికి ఎంత బాధ్యత ఉంటుందో అదే విధంగా ప్రధాన ప్రతిపక్షానికి అంతే బాధ్యత ఉంటుందని మైసూరా పేర్కొన్నారు. ప్రజాసమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రతిపక్షం చేతిలో అవిశ్వాసం అనేది ఒక ఆయుధం లాంటిదని వివరించారు. ‘‘అవిశ్వాసం ప్రవేశపెట్టడం ద్వారా ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లవచ్చు. సభలో ప్రతి అంశంపై చర్చ జరుగుతుంది. వీటికి ముఖ్యమంత్రి, మంత్రులు కచ్చితంగా సమాధానం చెప్పాల్సి ఉంటుంది. దీంతో ప్రజాసమస్యలు కొద్దిగానైనా పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది’’ అని అన్నారు. అయితే ప్రతిపక్షనేత చంద్రబాబు మాత్రం ప్రభుత్వం అన్ని రంగాల్లో వైఫల్యం చెందిందని వీధుల్లో విమర్శలు చేస్తున్నారే తప్ప చేతిలో ఉన్న ఆయుధాన్ని ఉపయోగించడంలేదని విమర్శించారు. అదేమని నిలదీస్తే కుంటిసాకులు లేవనెత్తుతున్నారని దెప్పిపొడిచారు. అవిశ్వాసం ప్రవేశపెడితే ఎవరు బేరసారాలు కుదుర్చుకున్నారో తేలిపోతుంది కదా? అని చంద్రబాబును నిలదీశారు. లేకపోతే ఆయనే బేరసారాలు కుదుర్చుకోవడం వల్ల అవిశ్వాసం పెట్టడంలేదా? అని అనుమానం వ్యక్తం చేశారు.

సాంకేతిక అర్హత మీకే ఉంది..

ప్రజల పాలిట శాపంగా మారిన ఈ ప్రభుత్వంపై అవిశ్వాసం ప్రవేశపెట్టే అర్హత వైఎస్సార్ కాంగ్రెస్‌కు ఉండుంటే ఈపాటికి ఎప్పుడో చేసేవారమని మైసూరా స్పష్టం చేశారు. శాసనసభ వేదికగా ప్రభుత్వాన్ని నిలదీసే అర్హత సాంకేతికంగా టీడీపీకి మాత్రమే ఉందన్నారు. సభలో ఇప్పటికీ వైఎస్సార్ కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లకు గుర్తింపులేదని తెలిపారు. ‘‘అవిశ్వాసం నోటీసులు ఇవ్వడానికి ఒక్క ఎమ్మెల్యే ఉన్నా సరిపోతుంది. కానీ అది చర్చకు రావాలంటే కనీసం 30 మంది సభ్యులు ఉండాలి. చర్చకు రాకుండా అవిశ్వాసం నోటీసులు ఇస్తే అది వృథా ప్రయాసే అవుతుంది. కనుక ప్రజాపక్షంగా వైఎస్సార్ కాంగ్రెస్ నోటీసులు ఇవ్వడానికి సిద్ధం. దానికి మీరు మద్దతిస్తారా?’’ అని చంద్రబాబును నిలదీశారు.

ఆరు నెలల తర్వాత మా సత్తా చూస్తారు..

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఏ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పోటీకి సిద్ధంగా ఉందని మైసూరా తేల్చి చెప్పారు. తాము ఎవరి దగ్గరికీ వెళ్లాల్సిన పరిస్థితి లేదని, కాంగ్రెస్సే మా దగ్గరికి వచ్చేరోజు వస్తుందని ఒక ప్రశ్నకు బదులుగా చెప్పారు. రేపటి రోజున కేంద్రంలో కాంగ్రెస్‌కు 60కి మించి పార్లమెంటు స్థానాలు వచ్చే పరిస్థితి లేదన్నారు. మరో 6 నెలలు గడిస్తే మా సత్తా ఏంటో చూపిస్తామని అన్నారు. రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ 25 నుంచి 30 దాకా పార్లమెంటు స్థానాలు దక్కించుకొని నంబర్ 2 స్థానంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. అదే విధంగా రానున్న రోజుల్లో కాంగ్రెస్, బీజేపీయేతర ప్రధాన మంత్రులు అయ్యే అవకాశముందని అభిప్రాయపడ్డారు. వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ మాత్రమే స్నేహితుడు కాదని, దేశంలోని చాలా మంది నాయకులు మిత్రులుగా ఉన్నారని మరో ప్రశ్నకు సమాధానమిచ్చారు. స్నేహం వేరు, రాజకీయాలు వేరని, అసదుద్దీన్ ఏవిధంగా మాట్లాడారో తనకు తెలియదని, మద్దతు ప్రతిపాదనలు వచ్చినప్పుడు ఆలోచన చేస్తామన్నారు.

source:sakshi

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!