YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Saturday, 17 November 2012

ప్రజలవైపో.. ప్రభుత్వంవైపో తేల్చుకోండి

అవిశ్వాసం మీరు పెట్టండి.. లేదా మేం పెడతాం మద్దతివ్వండి
మీ పాదయాత్రలో ఉన్న చిత్తశుద్ధి ఎంతో నిరూపించుకోండి
ఈ ప్రభుత్వం ఎప్పుడు కూలుతుందా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు
షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ శనివారం యాత్ర ముగిసేనాటికి..రోజులు: 31, కిలోమీటర్లు: 403.90

‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘న్యూస్‌లైన్’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘చంద్రబాబు నాయుడు గారూ! ఇదిగో.. ఈ ప్రజల మాటలు, వాళ్ల గోడు మీకు వినిపిస్తోందా? ప్రజలకు ఏమీ చేయలేని ఈ దుర్మార్గపు ప్రభుత్వం ఎప్పుడెప్పుడు కూలుతుందా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు. మీ పాదయాత్రలో చిత్తశుద్ధి ఉంటే, నిజంగా మీలో విశ్వసనీయత అనేది ఉంటే వెంటనే అవిశ్వాసం పెట్టండి. కానీ మీరేమో అవిశ్వా సం పెట్టనుగాక పెట్టను అంటారు. కాబట్టి మేమే అవిశ్వాసం పెడతాం.. దానికి మీరు మద్దతు ఇస్తారా? సూటిగా చెప్పండి. మీరు ప్రజల పక్షం ఉంటారో..ప్రభుత్వం పక్షం ఉంటారో తేల్చుకోండి’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చెల్లెలు షర్మిల.. టీడీపీ అధ్యక్షుడికి సవాల్ విసిరారు.

ప్రజల కష్టాలు పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం, దానికి వెన్నుదన్నుగా నిలిచిన టీడీపీ వైఖరులకు నిరసనగా జగన్‌మోహన్‌రెడ్డి తరఫున షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర 31వ రోజు శనివారం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు, కోడుమూరు నియోజకవర్గాల పరిధిలో సాగింది. తిమ్మాపురం గ్రామంలో షర్మిల రచ్చబండ మీద మహిళలతో కలిసి కొద్దిసేపు ముచ్చటించారు. ‘అమ్మా.. బోరులో నీళ్లు తోడుకొని తాగుదామన్నా కరెంటు ఉండటం లేదు.. తాగే నీళ్లకు కూడా ఇబ్బంది ఉంది. వానలు లేక పంటలు ఎండిపోయినయ్.. నష్ట పరిహారం ఇస్తామన్నారు కానీ ఇంత వరకు లేదు. జ్వరం వస్తే పస్తులు పడుకుంటున్నాం.. మొన్ననే చంద్రబాబు గారి పాదయాత్ర మా ఊరి నుంచే పోయింది. ఆయనకూ మా బాధలు చెప్పినం. ఇది పనికిరాని ప్రభుత్వం.. కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దించితే మీకు మేలు జరుగుతుంది అన్నారు.. బాబుగారు తలచుకుంటే ప్రభుత్వం కూలిపోతుందని టీవీల్లో చెప్తున్నారు. మరి ఎందుకు ఈ ప్రభుత్వాన్ని బాబుగారు కూలగొట్టడం లేదమ్మా’’ అని ఇదే గ్రామానికి చెందిన వెన్నెల మహిళా గ్రూపు సభ్యులు తోడేళ్ల రామలింగమ్మ, నర్సమ్మ షర్మిలను అడగటంతో ఆమె పై విధంగా స్పందించారు.

ఇల్లు ఇవ్వట్లేదు.. బిల్లూ ఇవ్వట్లేదు..

‘‘వైఎస్సార్ ఇలాంటి గ్రామాలకే వచ్చి రచ్చబండ మీద నిలబడి ‘అర్హులై ఉండి ఇల్లు లేని నిరుపేదలు ఉంటే చెయ్యి ఎత్తండి’ అని అడిగితే ఒక్క చెయ్యి కూడా పైకి లేవకూడదని, అంతలా ప్రజలకు మేలు చేయాలని ఆయన అనుకున్నాడు. ఈ రాష్ట్రంలో గుడిసె అనేదే లేకుండా ప్రతి పేదవానికీ పక్కా ఇల్లు కట్టివ్వాలని కలలుగన్నారు. కాని ఈ చేతగాని ప్రభుత్వం వైఎస్సార్ పెట్టిన పథకాలకు తూట్లు పొడుస్తోంది. కనీసం వైఎస్సార్ మంజూరు చేసిన ఇల్లుకు కూడా ఈ ప్రభుత్వం బిల్లులు ఇవ్వలేకపోతోంది. ప్రజలు.. మహిళలు.. విద్యార్థులు.. రైతులు.. కూలీలు ఏ ఒక్కరి సమస్యలు కూడా వారికి పట్టడం లేదు. ఇటువంటి ప్రభుత్వాన్ని గద్దెదింపాల్సిన చంద్రబాబు పాదయాత్ర అంటూ కొత్త డ్రామా ఆడుతున్నారు. గ్రామాలను శ్మశానాలుగా మార్చి మళ్లీ అక్కడికే వెళ్లి నాకో అవకాశం ఇవ్వాలంటూ మొసలి కన్నీళ్లు కార్చుతున్నారు. ఈ దుర్మార్గపు ప్రభుత్వాన్ని కూల్చకుండా నిలబెడుతున్నారు. ఇప్పుడాయన ప్రతిపక్షం కాదు. కాంగ్రెస్‌కు టీడీపీ మిత్రపక్షంగా మారింది’’ అని షర్మిల నిప్పులు చెరిగారు.

విద్యార్థులకు చెట్ల కింద పాఠాలు..

31వ రోజు ఉదయం ఎమ్మిగనూరు శివారులోని గణేశ్ రైస్ మిల్ నుంచి బయలుదేరిన షర్మిలకు అడుగడుగునా ప్రజలు నీరాజనాలు పలికారు. మధ్యాహ్నం కలగొట్ల, తిమ్మాపూరు చేరేవరకు వేలాది మంది జనం పాదయాత్రలో ఆమె వెంట నడిచారు. తిమ్మాపురంలో ప్రాథమికోన్నత పాఠశాలను సందర్శించారు. ఇక్కడ ఏడు తరగతులకుగాను మూడే గదులు ఉన్నాయి. విద్యార్థులకు చెట్లకింద పాఠాలు బోధిస్తున్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్న షర్మిల ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. విద్యార్థుల భవిష్యత్తు మీద ప్రభుత్వం చూపిస్తున్న శ్రద్ధ ఇదా? అని ప్రశ్నించారు. నవంబర్ గడుస్తున్నా ఇప్పటి వరకు స్కూల్ యూనిఫామ్ ఇవ్వక పోవటాన్ని ఆమె తప్పు పట్టారు. తిమ్మాపూరం మీదుగా గార్లదిన్నె, దైవందిన్నె గ్రామాలవైపు వస్తుండగా రైతు కూలీలు ఎదురుగా వచ్చి ఎండిపోయిన పత్తి చెట్లను, నాణ్యత లేని దిగుబడి వచ్చిన పత్తిని షర్మిలకు చూపించారు. దైవందిన్నెలో కిక్కిరిసిన ప్రజలను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. అక్కడి నుంచి కోడుమూరు నియోజకవర్గంలోని కాంపాడు గ్రామం సమీపంలో ఏర్పాటు చేసిన బసకు రాత్రి 8.45 షర్మిల చేరుకున్నారు. శనివారం మొత్తం 15 కిలోమీటర్ల మేర యాత్ర సాగింది. ఇప్పటివరకు మొత్తం 403.90 కిలోమీటర్ల మేర పాదయాత్ర పూర్తయింది.

షర్మిలకు నాయకుల సంఘీభావం

కర్నూలు, న్యూస్‌లైన్ ప్రతినిధి: జిల్లాలో సాగుతున్న షర్మిల పాదయాత్రకు ఇతర జిల్లాల నుంచి వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు సంఘీభావంగా తరలివస్తున్నారు. మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ, మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ, వైజాగ్ నాయకులు మల్లి చిన్న, శ్రీనివాస రావు శనివారం కూడా పాదయాత్రలో పాల్గొన్నారు. కొత్తగా నెల్లూరు జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ కాకాణి గోవర్ధన్ రెడ్డి, వైఎస్సార్ సీపీ రంగారెడ్డి జిల్లా కన్వీనర్ బి. జనార్దన్ రెడ్డి, కావలి ఇన్‌చార్జి రాంరెడ్డి ప్రతాపరెడ్డి, పార్టీ డాక్టర్స్ సెల్ కన్వీనర్ జి. శివ భారత్ రెడ్డి పాదయాత్రలో షర్మిల వెంట నడిచారు. జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు శోభా నాగిరెడ్డి, చెన్నకేశవరెడ్డి, పార్టీ ప్రోగ్రాం కమిటీ కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, మాజీ మంత్రి ఎం. మారెప్ప, మాజీ ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఎస్.వి. మోహన్ రెడ్డి, పార్టీ జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి తదితరులు యాత్రలో పాల్గొన్నారు.

చంద్రకళకు మళ్లీ చదువుకళ..

ఇంటర్మీడియెట్ పాసై పేదరికంతో డిగ్రీ చదవలేక కూలీ పనులకు వెళ్తున్న బాలికను షర్మిల అక్కున చేర్చుకున్నారు. తిరిగి కాలేజ్‌కు వెళ్లి చదువుకుంటే ఖర్చులు తాను చెల్లిస్తానని భరోసా ఇచ్చారు. తిమ్మాపురం గ్రామానికి చెందిన విరూపాక్ష గౌడ్ కూతురు చంద్రకళ ఇంటర్మీడియెట్ సీఈసీలో ఉత్తీర్ణత సాధించారు. పేదరికంతో చదువు మానేసి కూలీ పనులకు వెళ్తున్నారు. పత్తి చేలో పత్తి తీస్తున్న వారిని షర్మిల పలకరించారు. పేదరికంతో తాను ఉన్నత చదువుకు దూరమయ్యానని, ఇవ్వాళ వైఎస్సార్ బతికే ఉంటే తాను ధైర్యంగా డిగ్రీ చదివేదానినని చంద్రకళ చెప్పారు.

ఆడోళ్లమే ఓట్లేసి గెలిపిస్తాం
‘‘జగన్ను జేళ్ల బెట్టి గెలుద్దామనుకుంటాండారు. ఆయన ఎక్కడున్నా ఆడోళ్లమే ఓట్లేసి గెలిపిత్తం. మొన్న జగన్‌కు(ఎమ్మిగనూరు బైఎలక్షన్‌లో) ఓటెయ్యొద్దని రూపాయలు పంచినారు.. ఓటు వేయకుండా ఉన్నామా? చంద్రబాబు ముందే ముంచేసిన మనిషి. ఇప్పుడొచ్చి అప్పుడు బాగచేయలేదు.. ఇప్పుడు జేస్తా అంటే.. ఆ మనిషిని ఎట్టా నమ్మేది?’’ అని తిమ్మాపూరానికి చెందిన 75 ఏళ్ల వృద్ధురాలు చాకలి శంకరమ్మ షర్మిలతో అన్నారు. ‘అన్న బాగుండాడా అమ్మా’ అని ఆమె షర్మిలను జగన్ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

source:sakshi

2 comments:

  1. Ippudu Avisvasam Pedithe T.D.P Lekka Telipotundani Bayapadutunnaru.......


    Babu Garu Avisvasam Pettalantay Kiran Goverment Ki Magic Figure Vuntaynay Pedataru....

    ReplyDelete
  2. Ipudu Avsvasam Pedithe Ela Cheppandi Ala pedithe T.D.P lekka Telipoyundi..

    Babu Garu Vunnaday Congress Ni Kapadatanikay....
    Babu garu Avisvasam Pettalantay Kiran Governament ki Magic Figure Vuntaynay Tappa Evvru Gurinchi Babu Garu Avisvasam Pettaru....
    T.T.P ki vupayogam vuntay Tappa..


    May B Next Election Lo Congress T.D.P Kalisi goverment form chestaro...??????

    Already By Election lo Proove aindi T.D.P & congress Votes Kalipina
    YSR CONGRESS Ni Reach Avalekapoindi..

    ReplyDelete

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!