YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Wednesday, 14 November 2012

* పాలక, ప్రతిపక్షాలపై మరో ప్రజాప్రస్థానంలో షర్మిల నిప్పులు 
* అవిశ్వాసం పెట్టి టీడీపీ తన నిజాయతీ నిరూపించుకోవాలి
* బాబుకు తెలిసింది అబద్ధాలు.. వెన్నుపోటు రాజకీయాలే
* మద్దతు ఉపసంహరించుకున్నందుకు ఎంఐఎంను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభినందిస్తోంది 

మరో ప్రజాప్రస్థానం నుంచి న్యూస్‌లైన్ ప్రత్యేక ప్రతినిధి: ‘‘మాలాంటి వారు పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు తెలుసుకోవడంలో అర్థం ఉంది. కానీ చంద్రబాబుకు పాదయాత్ర ఎందుకు? ఆయనకు కావాల్సినంత మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ ప్రజాకంటక ప్రభుత్వాన్ని అవిశ్వాస తీర్మానం పెట్టి దించేయొచ్చు.. కానీ దించేయరట. ఎంఐఎం కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు వెనక్కి తీసుకుంది. వైఎస్సార్‌సీపీ ఆ పార్టీని అభినందిస్తోంది. ఇప్పుడు అవిశ్వాస తీర్మానం పెట్టి ఈ ప్రభుత్వాన్ని కూలదోయడం చాలా సులభం. ప్రతిరోజూ అడుగుతూనే ఉన్నాం.. నిలదీస్తూనే ఉన్నాం.

కానీ టీడీపీ అవిశ్వాసం పెట్టదట! పేరుకు మాత్రం ఈ ప్రభుత్వం పనిచేయడం లేదంటూ చంద్రబాబు తిడుతూనే అదే ప్రభుత్వానికి మిత్రపక్షంగా మారారు..’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చెల్లెలు షర్మిల నిప్పులు చెరిగారు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా కాంగ్రెస్, టీడీపీ ఒక్కటయ్యాయని ధ్వజమెత్తారు. కుమ్మక్కు రాజకీయాలు చేయడం లేదన్న మాట నిజమే అయితే.. తెలుగుదేశం పార్టీ అవిశ్వాసం పెట్టి తన నిజాయతీని రుజువు చేసుకోవాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు అవిశ్వాసం పెట్టరని.. ఆయనకు తెలిసిందల్లా అబద్ధాలు చెప్పడం, వెన్నుపోటు రాజకీయాలు చేయడమేనని ఎద్దేవా చేశారు. 

మరో ప్రజాప్రస్థానంలో భాగంగా మంగళ, బుధవారాల్లో షర్మిల కర్నూలు జిల్లా ఆదోనీ, మంత్రాలయం నియోజకవర్గాల్లో పాదయాత్ర కొనసాగించారు. మంగళవారం దీపావళి పండుగ అయినా ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి పాదయాత్రలో షర్మిలతో కలిసి కదం తొక్కారు. వెళ్లిన ప్రతిచోటా షర్మిలకు ఘనస్వాగతం పలికారు. ఆదోని పట్టణంలో నిర్వహించిన బహిరంగ సభ జనంతో పోటెత్తింది. సభలో షర్మిల మాట్లాడుతూ.. పాలక, ప్రతిపక్షాల తీరును ఎండగట్టారు.

బాబుపై ఎందుకు విచారణ చేయరు?
‘‘రెండెకరాల చంద్రబాబు వేల కోట్లు ఎలా సంపాదించారని కమ్యూనిస్టులు ప్రశ్నిస్తే ఆయనపై విచారణ జరపరు. చంద్రబాబును మించిన ధనవంతుడైన రాజకీయనేత లేడని తెహల్కా వెబ్‌సైట్ ఆరోపిస్తే విచారణ చేయరు. రాష్ట్రానికి ఉపయోగపడుతుందన్న జ్ఞానం కూడా లేకుండా చంద్రబాబు కేజీ బేసిన్‌లో లక్షల కోట్ల విలువైన గ్యాస్‌ను రిలయన్స్‌కు కట్టబెట్టినా దానిపై విచారణ జరపరు. ఆపద్ధర్మ సీఎంగా కేబినెట్ కూడా లేకుండా అధికార దుర్వినియోగంతో ఎకరానికి రూ.2 కోట్ల విలువ చేసే 850 ఎకరాల భూమిని తన బినామీ సంస్థ అయిన ఐఎంజీకి ఎకరాకు రూ.50 వేలకు కట్టబెడితే దానిపైనా విచారణ చేయరు. ఐఎంజీ వ్యవహారాన్ని వైఎస్సార్‌సీపీ న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్తే జడ్జిగారు ఎందుకు విచారణ జరపరు అని సీబీఐని ప్రశ్నించారు. 

కానీ సీబీఐ తన వద్ద సిబ్బంది లేదంటూ చెప్పింది. జగనన్న, ఆయన బంధువులు, స్నేహితుల ఇళ్లలో మాత్రం 28 బృందాలతో ఏకధాటిగా దాడులకు పాల్పడింది. కానీ చంద్రబాబుపై విచారణకు సిబ్బంది లేరంట...’’ అని షర్మిల అన్నారు. ‘‘కరెంటు రెండు మూడు గంటలైనా ఉండడం లేదని రైతులు, ప్రజలు కన్నీళ్లు పెట్టుకుంటుంటే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అంటారూ.. కరెంటు లేకపోతే ఏం? కిటికీలు, తలుపులు తీసి పడుకోండి అని అంటారు. ఆయన మాత్రం ఏసీలో ఉంటారు. ఇంత బాధ్యత లేని మనిషి గురించి ఇంకే ం మాట్లాడతాం..’’ అని దుయ్యబట్టారు.

పండుగ రోజూ.. అదే హోరు: దీపావళి రోజున ఆదోని శివారులోని మిల్టన్ స్కూల్ వద్ద ప్రారంభమైన పాదయాత్ర 9.5 కిలోమీటర్ల మేర సాగింది. పండుగ రోజు కూడా షర్మిలతో కలిసి నడిచేందుకు జనం భారీగా వచ్చారు. వైఎస్ తనయను చూడడమే పండుగ అన్నట్లుగా ప్రజలు ఆమె వెన్నంటే నడిచారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రభుత్వాసుపత్రి సర్కిల్ వద్ద జరిగిన సభలో షర్మిల ప్రసంగిస్తూ.. ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. 

అనంతరం షాహిద్ జామియా మసీదు వద్ద ముస్లిం సోదరులు ఘనస్వాగతం పలికారు. అక్కడ షర్మిల శాంతి కపోతాన్ని ఎగురవేశారు. బుధవారం బాలల దినోత్సవం సందర్భంగా షర్మిల.. ఆదోని శివారులోని మల్లికార్జున విద్యాలయంలో ఉదయం పిల్లల మధ్య గడిపారు. వారితో కేక్ కట్ చేయించిన తర్వాత పాదయాత్రను ప్రారంభించారు. చిన్న పెండేకల్ క్రాస్ మీదుగా కపటి, రంగాపురంల మీదుగా పాదయాత్ర సాగింది. 

కపటి తర్వాత పాదయాత్ర మంత్రాలయం నియోజకవర్గంలోకి ప్రవేశించగా.. ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ఘనస్వాగతం పలికారు. బుధవారం రాత్రి 7 గంటలకు రంగాపురం శివారులో ఏర్పాటు చేసిన రాత్రి బసకు షర్మిల చేరుకున్నారు. బుధవారం 13 కి.మీ. మేర పాదయాత్ర చేశారు. మంగళ, బుధవారాల్లో షర్మిలతో కలిసి ఎమ్మెల్యేలు ఆళ్లనాని, ఆకేపాటి అమర్‌నాథ్ రెడ్డి, కాపు రాంచంద్రారెడ్డి, ఎ.శ్రీనివాసులు పాదయాత్రలో పాల్గొన్నారు. కర్నూలు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు శోభా నాగిరెడ్డి, వై.బాలనాగిరెడ్డి, చెన్నకేశవరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గౌరు చరితారెడ్డి, సాయి ప్రసాద్ రెడ్డి షర్మిలతో పాటు పాదయాత్ర చేస్తున్నారు. తెలంగాణకు చెందిన పార్టీ నేతలు కేకే మహేందర్ రెడ్డి, జిట్టా బాలకృష్ణారెడ్డి, పువ్వాడ అజయ్ తదితరులు బుధవారం షర్మిలను కలిశారు. 

మహిళల సమస్యలు తెలుసుకుంటూ.. 
దీపావళి రోజున ఆదోనిలో గుడిమైదానం వద్ద మహిళలతో కలిసి షర్మిల రచ్చబండ నిర్వహించారు. మహిళలందరూ ముందుకు రావాలని పిలుస్తూ ‘ఓ పింక్ రంగు చీర కట్టుకున్న అవ్వా.. ఇలా రా.. ముందుకు రా..’ అని పిలిచారు. ఈ సందర్భంగా మహిళలు తమకు రుణాలివ్వడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. జగనన్న వచ్చాక చేనేత కార్మికులకు, మహిళలకు, రైతులకు వడ్డీలేని రుణాలు ఇస్తారని షర్మిల భరోసా ఇచ్చారు. అంతకుముందు ఆదోని కూరగాయల మార్కెట్లో వర్తకులు, కొనుగోలుదారులతో షర్మిల మాట్లాడారు. కిలో టమాటా ఎంతకు అమ్ముతున్నారని, ఎంత గిట్టుబాటు అవుతుందని వారిని అడిగారు. రోడ్లపైనే కూర్చుంటూ మహిళలు, రైతులు, విద్యార్థులు.. ఇలా అన్ని వర్గాల కష్టాలను తెలుసుకుంటూ షర్మిల ముందుకు సాగుతున్నారు.

రైతుల గోడు వింటూ..
బుధవారం మార్గమధ్యలో బిచిగెరి సమీపంలో పత్తి రైతులు గిడ్డయ్య, ఉరుకుందమ్మ షర్మిల వద్దకు వచ్చి తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఎకరా రూ.12 వేలు పెట్టుబడి పెడితే ఇప్పుడు గిట్టుబాటు ధర రావడం లేదని వాపోయారు. రాజన్న ఉన్నప్పుడు రూ. 6 వేల వరకు పలికిన ధర ఇప్పుడు రూ.2,500 నుంచి రూ.3 వేలకే అమ్మాల్సివస్తోందని వాపోయారు. పిల్లల చదువులు కూడా ఆగిపోయే పరిస్థితి ఉందని, అప్పుల్లో కూరుకుపోతున్నామన్నారు. కపటికి చెందిన సావిత్రమ్మ మాట్లాడుతూ.. తాను 8 ఎకరాలు గుత్తకు తీసుకుని లక్షకు పైగా పెట్టుబడి పెట్టి వేరుశనగ పంట వేస్తే.. కనీసం 30 బస్తాలు కూడా వచ్చే పరిస్థితి లేదని కంటతడి పెట్టుకున్నారు. త్వరలోనే రైతురాజ్యం వస్తుందని షర్మిల వారికి భరోసానిచ్చి ముందుకు కదిలారు.



source:sakshi

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!