YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Monday, 11 June 2012

సాయంత్రం 5 గంటలకల్లా క్యూలో ఉంటే ఎంత రాత్రి అయినా ఓటేయొచ్చు

*50 వేల మంది సిబ్బందితో ఏర్పాట్లు: సీఈవో భన్వర్‌లాల్
* ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్
* సాయంత్రం 5 గంటలకల్లా క్యూలో ఉంటే ఎంత రాత్రి అయినా ఓటేయొచ్చు
* ఎన్నికల నియోజకవర్గాల్లో పెయిడ్ హాలిడే..

హైదరాబాద్, న్యూస్‌లైన్: రాష్ట్ర భవిష్యత్ రాజకీయాలను శాసిం చే ఉప ఎన్నికలుగా చెబుతున్న నెల్లూరు లోక్‌సభ నియోజకవర్గం, 18 అసెంబ్లీ నియోజకవర్గాలకు మరికొద్ది గంటల్లో పోలింగ్ సమరం ప్రారంభం కానుంది. మంగళవారం ఉదయం8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు స్వేచ్ఛగా, ప్రశాంతంగా పోలింగ్ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు రాష్ర్ట ముఖ్య ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ వెల్లడించారు. ఉప ఎన్నికల స్థానాల్లోని 46.13 లక్షల మంది ఓటర్లు నిర్భయంగా తమకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేయాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు.

ఎన్నికల ఏర్పాట్లు ఇవీ..
ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. సాయంత్రం 5 గంటలకల్లా క్యూలో ఉన్న ప్రతి ఒక్కరికి స్లిప్ ఇచ్చి ఎంత రాత్రి అయినా ఓటు వేసే అవకాశం కల్పిస్తారు. ఓటరు గుర్తింపు కార్డు లేదా ఓటర్ స్లిప్‌లతో పోలింగ్ కేంద్రాలకు వెళ్లాలి. ఈ రెండు లేకపోయినా ఓటర్ జాబితాలో పేరున్న వారు ఆయా పోలింగ్ కేంద్రాలకు వెళ్లి అక్కడ బూత్‌స్థాయి ఆఫీసర్ నుంచి ఓటర్ స్లిప్ పొంది ఓటు వేయాలి. ఉదయం 7 గంటలకు పోలింగ్ కేంద్రాల్లో అభ్యర్థుల ఏజెంట్ల సమక్షంలో మాక్ పోలింగ్ ద్వారా ఈవీఎంలు తనిఖీ చేస్తారు. రాజకీయ పార్టీల అభ్యర్థుల ఏజెంట్లు అందరూ ఉదయం 7 గంటలకల్లా పోలింగ్ కేంద్రాలకు చేరుకోవాలి. ఏ పార్టీకి వేసిన ఓటు ఆ పార్టీకి పడుతోందా లేదా అనే విషయాన్ని మాక్ పోలింగ్ ద్వారా నిర్ధారించుకోవాలి. ఆ తర్వాత మొత్తం క్లియర్ చేసి పోలింగ్ ప్రారంభించాలి. 

నెల్లూరు నియోజకవర్గంతోపాటు 18 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రభుత్వ కార్యాలయాలు, షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్లకు సెలవు ప్రకటించారు. ఆయా కార్యాలయాల్లో పనిచేసే సిబ్బందికి వేతనంతో కూడిన సెలవు. ఉప ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో ఓటర్లుగా ఉంటూ ఇతర జిల్లాలు, ప్రాంతాల్లో పనిచేసే వారికి కూడా ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్ 135 (బి) మేరకు వేతనంతో కూడిన సెలవు ఇస్తారు.. అలాంటి వారు తప్పనిసరిగా సెలవు వినియోగించుకుని ఓటు వేయాలి. ఉదాహరణకు ప్రత్తిపాడు ఓటర్‌గా ఉంటూ విజయవాడలో పనిచేస్తుంటే.. అలాంటి వారు వేతనంతో కూడిన సెలవు పొంది ప్రత్తిపాడు వచ్చి ఓటు వేయవచ్చు. 

నెల్లూరు లోక్‌సభ, 18 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 46.13 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా 5,413 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలింగ్ నిర్వహణకు 5,755 కంట్రోల్ యూనిట్లను, 6,266 బ్యాలెట్ యూనిట్లను వినియోగిస్తున్నారు. మొత్తం ఓటర్లలో పురుష ఓటర్లు 22.77 లక్షల మంది కాగా మహిళా ఓటర్లు 23.33 లక్షల మంది ఉన్నారు. ఇతర ఓటర్లు 13 మంది కాగా సర్వీసు ఓటర్లు 3,222 మంది ఉన్నారు. ఉప ఎన్నికల బరిలో మొత్తం 255 మంది అభ్యర్థులు ఉన్నారు. 

పోలింగ్ కేంద్రాల్లో ఏమి జరుగుతోందో చూసేందుకు వీలుగా ప్రతీ పోలింగ్ కేంద్రంలో లైవ్ వెబ్ కాస్టింగ్ ఏర్పాటు. లైవ్ వెబ్ కాస్టింగ్‌ను జిల్లా కలెక్టర్‌తో పాటు నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి, రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి, కేంద్ర ఎన్నికల కమిషన్ పర్యవేక్షిస్తుంది. అభ్యర్థులు కూడా రిటర్నింగ్ అధికారి వద్ద లైవ్ వెబ్ కాస్టింగ్ చూడొచ్చు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద మైక్రో పరిశీలకుడిని నియమిస్తారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద వీడియో గ్రాఫర్‌ను ఏర్పాటు చేసి, ఓటర్లను వీడియో గ్రఫీ చేస్తారు. ఉప ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో 3,200 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకంగా గుర్తించారు. వాటిలో పూర్తిగా కేంద్ర సాయుధ పోలీసు బలగాలను నియమించారు. 

పోలింగ్ కేంద్రాల వద్దకు ఓటు వేయడానికి వచ్చే అంధులు, వికలాంగులు, పిల్లలతో వచ్చే మహిళలకు క్యూలో ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేయడంతో పాటు షామియానాలు వేయాలి. ఓటర్లు, పోలింగ్ సిబ్బంది, పోలీసులకు ఏదైనా అస్వస్థత సంభవిస్తే వైద్యం చేసేందుకు వీలుగా సంచార వైద్య శాలలను ఏర్పాటు చేశారు. ప్రజా రవాణాపై ఆంక్షల్లేవు. ఓటర్లు తమ వాహనాల్లోనైనా లేదా ఆర్టీసీ బస్సులు లేదా ఆటో రిక్షాలు, ఇతరత్రా వాహనాల్లో వచ్చి ఓట్లు వేయవచ్చు. 

ఐదంచెల భద్రత: డీజీపీ దినేష్‌రెడ్డి
హైదరాబాద్, న్యూస్‌లైన్: ఉప ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా చేసేందుకు ఐదంచెల భద్రతను ఏర్పాటు చేసినట్లు డీజీపీ వి.దినేష్‌రెడ్డి సోమవారం వెల్లడించారు. ప్రతి పోలింగ్ స్టేషన్ వద్దా ఒక సాయుధ పోలీస్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. డీజీపీ కార్యాలయంలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో దినేష్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర పోలీసు, ఏపీఎస్పీ, ఏఆర్ నుంచి 15 వేల మంది పోలీసులను బందోబస్తుకు వినియోగిస్తున్నామన్నారు. 200 కేంద్ర పారా మిలటరీ కంపెనీలను ఎన్నికల భద్రత కోసం రప్పించినట్లు తెలిపారు. 

ఉప ఎన్నికలలో మొట్టమొదటిసారి రెండు వేల మంది పోలీసు అధికారులను భద్రత పర్యవేక్షణ విధులకు వినియోగిస్తున్నట్లు డీజీపీ వివరించారు. ఐజీ, డీఐజీల పర్యవేక్షణలో ప్రతి నియోజకవర్గానికీ ఒక ఎస్పీ స్థాయి అధికారిని నియమించినట్లు తెలిపారు. మండలానికి ఒక డీఎస్పీని బాధ్యుడిగా నియమించామన్నారు. ఒక నియోజకవర్గంలో ఐజీ, మరో నియోజకవర్గంలో డీఐజీ, వేరొక నియోజకవర్గంలో ఎస్పీ ఉండేలా ఉప ఎన్నికలు జరిగే జిల్లాల్లో ప్రత్యేక ప్రణాళిక రూపొందించామని వివరించారు. 270 చెక్‌పోస్టులను ఏర్పాటుచేసి తనిఖీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!