హైదరాబాద్, న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఉప ఎన్నికల్లో కుట్రలు పన్నిన కాంగ్రెస్, టీడీపీలు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు డిమాండ్ చేశారు. ఆ రెండు పార్టీలు కలిసిపోయి ‘సైకిల్ కాంగ్రెస్’గా పేరు మార్చుకోవాలని సూచించారు. ఉపఎన్నికల పర్వం మొదలైనప్పటి నుంచీ రకరకాల కుతంత్రాలు పన్నాయన్నారు. పోలింగ్ ముగిశాక కాంగ్రెస్, టీడీపీలు ఓటమి ఖాయమని తెలుసుకుని సానుభూతి పనిచేసిందనే ప్రచారం చేస్తున్నాయన్నారు.
ఆయన బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ... 15న వెల్లడయ్యే ఫలితాల్లో అన్ని స్థానాల్లోనూ వైఎస్సార్ కాంగ్రెస్ గెలవబోతుండటానికి సానుభూతి ఒక్కటే కారణం అనేది సరికాదన్నారు. ప్రజల సానుభూతి పొందడానికి అర్హత ఉండాలనీ... చంద్రబాబు అలిపిరి వద్ద హత్యాయత్నం నుంచి తప్పించుకుంటే ప్రజలు ఎందుకు సానుభూతి చూపలేదో పరిశీలించు కోవాలన్నారు.
‘జగన్‌ను ప్రజల మధ్య లేకుండా చేసి జైల్లో పెట్టారు. ప్రచారానికి వెళ్లిన వై.ఎస్.విజయమ్మను దూషించారు. షర్మిలను సైతం విమర్శించారు. సీఎం కిరణ్, పీసీసీ అధ్యక్షుడు బొత్స, చిరంజీవి, చంద్రబాబులు జగన్‌ను ఆడిపోసుకున్నారు. ఇన్ని చేసినా ప్రజలు నమ్మలేదు’ అని గట్టు చెప్పారు. జగన్ వద్ద ఇక అస్త్రాలేమీ లేవని చెబుతున్న లగడపాటి రాజగోపాల్ ఎంపీ పదవికి రాజీనామా చేసి మళ్లీ గెలవాలని సవాలు చేశారు. ఆయన ఖాళీ చేసే స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి గెలవకపోతే రాజకీయాల నుంచి విరమించుకుంటానని గట్టు చెప్పారు.
No comments:
Post a Comment