YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Monday, 8 October 2012

రోశయ్య, కిరణ్ సర్కారుల మూడేళ్ల రికార్డు

*వైఎస్ మరణం తర్వాత వరుసపెట్టి బాదుడు 
*విద్యుత్ చార్జీలు మూడుసార్లు పెంపు 
*మరో రెండు సార్లు ‘సర్దుబాటు’ వడ్డన 
*మూడేళ్లలో రూ. 13,022 కోట్ల భారం 
*ఆర్‌టీసీ చార్జీలూ మూడుసార్లు పెంపు 
*ప్రయాణికులపై రూ. 1,900 కోట్ల బాదుడు
*‘వ్యాట్’తో రూ. 5,000 కోట్లకు వాత
*ఆస్తి పన్ను, వాహనాల పన్ను, నీటి చార్జీల 
*రూపంలో మరో రూ. 2,100 కోట్ల వడ్డన 
*మరిన్ని పన్నులతో త్వరలో 6,146 కోట్ల మోత

హైదరాబాద్, న్యూస్‌లైన్: మొన్న బస్సు చార్జీలు బాదేశారు... నిన్న వంట గ్యాస్ ధర పెంచి బండ పడేశారు...
రేపు సర్దుబాటు చార్జీలు వడ్డించేందుకు సిద్ధమయ్యారు... జనంపై ఈ వడ్డనల పరంపర మొన్నా నిన్నా మొదలైనది కాదు. మూడేళ్ల నుంచీ విరామం లేకుండా వరుసపెట్టి బాదేస్తున్నారు. వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఆరేళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ ఆరేళ్లలో ఒక చార్జీ పెంపు లేదు. ఒక పన్ను పోటు లేదు. ప్రజలపై కొత్తగా ఎలాంటి భారం మోపలేదు. మూడేళ్ల కిందట ఆయన మరణించారు. ఆ తర్వాత ఈ మూడేళ్లలో ఎడాపెడా చార్జీలు, పన్నులు వడ్డిస్తూ వస్తునానరు. సామాన్యుడి బతుకును మరింత భారం చేస్తున్నారు. 

విద్యుత్, రవాణా రంగాలపై మార్చి మార్చి చార్జీలు వడ్డించారు. పప్పూ ఉప్పూ బియ్యం చక్కెరా వంటి నిత్యావసర వస్తువులనూ వదలకుండా పన్ను పోట్లు పొడిచారు. ఆరేళ్ల పాటు ప్రజలపై ఎలాంటి భారం మోపకుండా సర్కారును నడిపిన వై.ఎస్.రాజశేఖరరెడ్డి మరణించిన తర్వాత.. రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వాలు వరుస వడ్డనలతో ప్రజల నడ్డివిరవటమే పనిగా పెట్టుకున్నాయి. విద్యుత్ చార్జీలు, ఇంధన సర్దుబాటు చార్జీలు, బస్సు చార్జీలు, విలువ ఆధారిత పన్నులు, నీటి పన్నులు, ఆస్తి పన్నులు, రవాణా పన్నులు, రిజిస్ట్రేషన్ చార్జీలు.. మార్చిమార్చి పెంచేస్తున్నాయి. అన్ని రకాల చార్జీలు, పన్నుల రూపంలో కేవలం మూడేళ్లలోనే ఏకంగా 22 వేల కోట్ల రూపాయల మేర ప్రజానీకంపై భారం మోపాయి. ఇందులో అత్యధిక చార్జీలు, పన్నులను జనం ప్రతి ఏటా చెల్లించుకుంటూ పోవాల్సిందే. తాజాగా విద్యుత్ సర్దుబాటు చార్జీల పేరుతో మరో రూ. 1,500 కోట్ల బాదుడుకు దాదాపు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేశారు. అతి త్వరలో మరో 6,000 కోట్లకు పైగా పన్నులు వడ్డించేందుకు సర్కారు సిద్ధమవుతుండటం ప్రజలను బెంబేలెత్తిస్తోంది. 

ఒకవైపు కేంద్ర సర్కారు పెట్రోలు, డీజిల్, వంటగ్యాస్ ధరలను పెంచుకుంటూ పోతోంటే.. రాష్ట్ర ప్రజలపై కొంతలో కొంతైనా భారం తగ్గించే దిశగా ఏ మాత్రం ఆలోచన చేయని సర్కారు.. ఆ పెరిగిన ధరలపై వ్యాట్ రూపంలో అదనపు ఆదాయం దండుకుంటోంది. కొద్ది రోజుల కిందటే డీజిల్ ధరను లీటరుకు ఐదు రూపాయలు చొప్పున పెంచుతూ.. వంట గ్యాస్ సబ్సిడీ సిలిండర్లపై పరిమితి విధించిన కేంద్ర ప్రభుత్వం.. పది రోజులు తిరక్కుండానే గ్యాస్ ధరను రూ. 12 పెంచేసిన విషయం తెలిసిందే. విరామం లేకుండా తగులుతున్న ధరాఘాతాలతో జనం గగ్గోలు పెడుతున్నా పట్టించుకునే దిక్కులేకుండా పోయింది. 

వరుసపెట్టి బాదుడే బాదుడు... 

వైఎస్ మరణించిన తర్వాత 2010లో అప్పటి ముఖ్యమంత్రి రోశయ్య నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ వినియోగదారులపై రూ. 1000 కోట్ల మేర భారం వేసింది. అనంతరం బాధ్యతలు స్వీకరించిన కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం ఆ తరువాత ఏడాది 2011లో మరో రూ. 1000 కోట్లు, 2012లో ఏకంగా రూ. 5000 కోట్ల మేర విద్యుత్ చార్జీలు పెంచి ప్రజల నడ్డివిరిచింది. అంతటితో ఆగని రాష్ట్ర ప్రభుత్వం 2010-11, 2011-12 ఆర్థిక సంవత్సరాలకు గాను ఇంధన సర్దుబాటు చార్జీల పేరుతో వినియోగదారులపై ఏకంగా రూ. 6,022 కోట్ల మేర భారం మోపింది. 

అంతటితో ఆగితేనా..? 2012-13 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికి గాను.. యూనిట్‌కు రూపాయి చొప్పున మొత్తం రూ. 1,500 కోట్లు ఇంధన సర్దుబాటు చార్జీలు వడ్డిస్తూ రేపో మాపో ఉత్తర్వులు రానున్నాయి. ఈ వడ్డనలు ఇక్కడితో ఆగే సూచనలు లేవు. 2009-10 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇంధన సర్దుబాటు చార్జీల రూపంలో మరో 1,480 కోట్ల రూపాయల భారం వేయటానికి సర్కారు సిద్ధంగా ఉంది. ఈ భారాన్ని ప్రజలపై మోపరాదని హైకోర్టు తీర్పు ఇచ్చినా.. రాష్ట్ర ప్రభుత్వం దానిని సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. 

విద్యుత్ రంగంలోనే కాదు.. పన్నుల పేరుతో ప్రజలను ఎడాపెడా బాదేసే కార్యక్రమానికి ప్రభుత్వం 2010లో శ్రీకారం చుట్టింది. విలువ ఆధారిత పన్ను (వ్యాట్)ను 12.5 నుంచి 14.5 శాతానికి పెంచింది. ఈ కారణంగా ప్రజలపై రూ. 1,500 కోట్ల మేర భారం పడింది. ఆ తరువాత అధికారం చేపట్టిన కిరణ్‌కుమార్‌రెడ్డి వ్యాట్‌లో మరో స్లాబును 4 నుంచి 5 శాతానికి పెంచేశారు. ఈ జాబితాలో నిత్యావసర వస్తువులు అనేకం ఉన్నాయి. ఫలితంగా రాష్ట్రంలో పేద, మధ్య తరగతి ప్రజానీకంపై రూ. 2,500 కోట్ల మేర భారం పడింది. అంతటితో ప్రజలను వదిలిపెట్టని కాంగ్రెస్ ప్రభుత్వం.. ఆర్‌టీసీ చార్జీలను ఎడాపెడా పెంచేస్తూ వచ్చింది. 2010లో అప్పటి ముఖ్యమంత్రి రోశయ్య ఆర్‌టీసీ ప్రయాణికులపై రూ. 500 కోట్ల మేర భారం మోపితే, కిరణ్ సర్కారు 2011, 2012 సంవత్సరాల్లో కలిపి ప్రయాణికులపై రూ. 1,200 కోట్ల మేర చార్జీల పెంపు ద్వారా భారం మోపారు. 

అంతేనా..? నాటి రోశయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వాహనాల జీవిత పన్ను పెంపు ద్వారా ప్రజలపై రూ. 800 కోట్ల భారం మోపింది. ఇప్పుడు కిరణ్ సారథ్యంలోని ప్రభుత్వం వాహనాల జీవిత పన్నును రూ. 1,000 కోట్ల మేర పెంచేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి బీటీ విత్తనాల ధరను తగ్గించి రైతులకు మేలు చేస్తే.. కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం వాటి ధరను పెంచి రైతాంగంపై రూ. 200 కోట్ల భారం మోపింది. రాష్ట్ర రాజధానిలో మంచినీటి చార్జీలను ఎడాపెడా పెంచటం ద్వారా రూ. 300 కోట్ల మేర ప్రజలపై భారం మోపారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని మునిసిపాలిటీలు, నగర పాలక సంస్థల్లో ఆస్తిపన్ను పెంపు ద్వారా రూ. 1,000 కోట్ల మేర ప్రజను బాదారు. పంచదార, వస్త్రాలపై వ్యాట్ ఐదు శాతం విధించటం ద్వారా మరో రూ. 1,000 కోట్ల భారం పడింది. 

విద్యుత్ వినియోగదారులపైనే రూ. 13,022 కోట్లు

గడచిన మూడేళ్లలో ప్రభుత్వం మూడు సార్లు పెంచిన విద్యుత్ చార్జీలతో ప్రజలపై రూ. 7,000 కోట్ల అదనపు భారం పడింది. దీనికి అదనంగా ఇప్పుడు తాజాగా వేసిన ఇంధన సర్దుబాటు చార్జీలతో మరో రూ. 6,022 కోట్ల మేర వినియోగదారులపై భారం పడింది. అంటే మునుపెన్నడూ లేని రీతిలో రాష్ట్ర ప్రభుత్వం ఒక్క విద్యుత్ వినియోగదారులపైనే రూ. 13,022 కోట్ల భారం మోపింది. వచ్చే ఐదేళ్ల పాటు విద్యుత్ చార్జీలు పెంచబోమని వైఎస్ 2009 ఎన్నికల్లో ప్రజలకు హామీ ఇచ్చారు. అంతేకాదు 2008-09కి సంబంధించి గృహ వినియోగదారులపై రూ. 500 కోట్ల ఇంధన సర్దుబాటు చార్జీలను ప్రభుత్వమే భరిస్తుందని ఆయన ప్రకటించారు. 

అందుకు భిన్నంగా రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వాలు గృహ వినియోగదారులపై కూడా భారం మోపాయి. ఇప్పుడు మరోసారి సర్దుబాటు చార్జీల షాక్ . 2012-13 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికి (అంటే ఏప్రిల్, మే, జూన్ - మూడు నెలల కాలానికి) గాను ఏకంగా రూ. 1,500 కోట్ల ఇంధన సర్దుబాటు చార్జీల వడ్డనకు లాంఛనాలు పూర్తయ్యాయి. ఇక విద్యుత్ నియంత్రణ మండలి నుంచి ఆదేశాలు రావటమే ఆలస్యం. ఈ చార్జీలు నవంబర్ నుంచే వసూలు చేయనున్నారు. 

ముందే హెచ్చరించిన సాక్షి!

‘ముందుంది మరింత మంచి కాలం అని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి చెపుతున్నారు. అయితే ఇది రాష్ట్ర ప్రజలకు కాదు. ప్రభుత్వ ఖజానాకు మాత్రమే. గత రెండేళ్లలో 15 వేల కోట్ల రూపాయల మేర భారం మోపిన ప్రభుత్వం రాష్ట్ర ప్రజానీకంపై కొత్త సంవత్సరంలో ఏకంగా 12 వేల కోట్ల రూపాయలు అదనపు భారం వేయనుంది’ అని ‘సాక్షి’ ఈ ఏడాది జనవరి 1వ తేదీ సంచికలో పాఠకుల ముందు ఉంచింది. ‘సాక్షి’ చెప్పినట్లే ప్రభుత్వం ప్రజలపై చార్జీలు, పన్నుల రూపంలో భారం మోపింది.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!