ఉమ్మడి ప్రత్యర్థి అయిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడానికి కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు ఒకే మార్గం పట్టే అవకాశాలున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. శుక్రవారం ఉప ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో రెండు పార్టీలు తదనంతర పరిణామాలను ఎదుర్కోవడానికి సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి ఏ విధమైన ముప్పు వాటిల్లకుండా చూడడం ఆ పార్టీల ప్రథమ లక్ష్యంగా కనిపిస్తోంది.
రాష్ట్రంలోని 18 శానససభా స్థానాలకు, ఓ లోకసభ స్థానానికి పోలింగ్ ముగిసింది. రేపు శుక్రవారం ఫలితాలు వెలువడుతాయి. తమ పార్టీ ఎనిమిది, తొమ్మిది స్థానాల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి నువ్వా నేనా అన్నట్లు పోటీ ఇచ్చిందని కాంగ్రెసు నాయకులు అంటున్నారు. కనీసం ఎనిమిది, తొమ్మిది స్థానాల్లో గట్టి పోటీ ఇస్తే తమ పార్టీ నుంచివైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వలసలను నివారించవచ్చునని కాంగ్రెసు నాయకులు భావిస్తున్నారు. చాలా తక్కువ ఓట్లతో ఓడిపోతే వలసలు ఉండవని, దాని వల్ల ప్రభుత్వానికి ఏ విధమైన ఢోకా ఉండదని అంటున్నారు.
ఉప ఎన్నికల తీరుపై ముఖ్యమంత్రి బుధవారం తన మంత్రివర్గ సహచరులతో చర్చించారు. వైయస్ జగన్ వైపు 12 మంది శాసనసభ్యుల దాకా దూకే అవకాశాలున్నాయని, పార్టీలో ఉంటే రాజకీయ ప్రయోజనాలు కాపాడుతామని కాంగ్రెసు నాయకులు వారికి హామీ ఇస్తున్నారని, కొంత మందికి మంత్రి వర్గంలో చోటు కల్పిస్తామని కూడా హామీలు ఇస్తున్నారని అంటున్నారు.
జగన్ అరెస్టు తర్వాత ఇద్దరు శాసనసభ్యులు రాజీనామా చేయడంతో కాంగ్రెసు బలం సభలో 154 నుంచి 152కు పడిపోయింది. ఉప ఎన్నికలు జరిగిన 18 స్థానాల్లో ఏ ఒక్క స్థానం గెలువకపోయినా నలుగురు సభ్యుల బలం కాంగ్రెసుకు అదనంగా ఉంటుంది. కాంగ్రెసుకు ఏడుగురు మజ్లీస్, ముగ్గురు ఇండిపెండెంట్ సభ్యుల మద్దతు ఉంది. తెలుగుదేశం పార్టీ జగన్ వైపు మొగ్గు చూపితేనే ప్రభుత్వం పడిపోతుంది.
ఒక వేళ మరోసారి ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తే తెలుగుదేశం పార్టీ ఓటింగ్‌కు గైర్హాజరైనా ప్రభుత్వం నిలబడుతుంది. తెలుగుదేశం పార్టీకి 86 మంది సభ్యులున్నారు. ఉప ఎన్నికల ఫలితాల తర్వాత తెలుగుదేశం పార్టీ పరిస్థితిని సమీక్షించే అవకాశాలున్నాయి. వైయస్ జగన్‌ను వ్యతిరేకించే కారణంతో ప్రభుత్వానికి మద్దతుగా నిలిస్తే తెలుగుదేశం పార్టీకి ఆత్మహత్యా సదృశ్యమే అవుతుందనే మాట వినిపిస్తోంది. అయితే, ప్రస్తుత తరుణంలో తెలుగుదేశం పార్టీఅధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఎన్నికలను ఎదుర్కోవడానికి సిద్ధంగా లేరని, దాంతో ప్రభుత్వం పడిపోకుండా ఏదో ఉపాయం ఆయన చేస్తారని అంటున్నారు.
No comments:
Post a Comment