YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Thursday, 14 June 2012

'దేశానికి'వలసల భయం.... నలుగురు ఎమ్మెల్యేలు జంప్? (andhrajyothy)


హైదరాబాద్, జూన్ 13: ఉప పోరు ముగిసింది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి కొత్త భయం పట్టుకుంది. ఫలితాలు తమకు అనుకూలంగా ఉంటాయని పైకి చెబుతున్నప్పటికీ... ఉప ఎన్నికల ఫలితాలు జగన్‌కు అనుకూలంగా, ఏకపక్షంగా వచ్చిన పక్షంలో పార్టీ నుంచి వలసలు తప్పవనే ఆందోళన వెంటాడుతోంది. కాంగ్రెస్‌తో పోలిస్తే టీడీపీ నుంచి జగన్ వైపునకు ఇప్పటిదాకా చెప్పుకోదగ్గ వలసలు లేవు. రానున్న ఎన్నికల్లో టిక్కెట్ దక్కదన్న అనుమానాలు, నియోజకవర్గాల్లో ఇతరత్రా సమస్యలున్న వారు మాత్రమే అటూ ఇటుగా ఊగుతూ ఉన్నారు. 

అప్పట్లో నెల్లూరు జిల్లా కోవూరు నేత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, కర్నూలు జిల్లా మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి వైఎస్ ఉండగానే కాంగ్రెస్‌తో అంటకాగడం మొదలుపెట్టారు. వైఎస్ మరణించాక, జగన్ పక్షాన నిలిచారు. జగన్ వేరు కుంపటి పెట్టుకున్న తర్వాత మాత్రం టీడీపీ నుంచి ఆ పార్టీలోకి వలసలు లేవు. ఇటీవలి రాజకీయ పరిణామాల నేపథ్యంలో జెండా మార్చేస్తారంటూ పలువురు టీడీపీ ఎమ్మెల్యేల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. మరీ ముఖ్యంగా కృష్ణా జిల్లా నూజివీడు ఎమ్మెల్యే రామకోటయ్య పేరు గుప్పుమంది. ఆయన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబును కలిసిన అనంతరం... ఈ ప్రచారాన్ని ఖండించారు. 

ఇప్పుడు ఉప ఎన్నికల ఫలితాలు టీడీపీకి ఏ మాత్రం అనుకూలంగా లేకున్నా, జగన్ హవా సుస్పష్టంగా కనిపించినా... టీడీపీ నుంచి వలసలు తథ్యమనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. 'వరుసగా రెండోసారి ప్రతిపక్షంలో కూర్చున్నాం. భవిష్యత్తు ఆశాజనకంగా లేనిపక్షంలో రాజకీయంగా నిలబడటం కష్టం. సానుకూల వాతావరణం ఉన్న పార్టీ వైపు వెళితే మంచిది' అని పలువురు నేతలు భావిస్తున్నారు. ఇప్పటికైతే... నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు జగన్ వైపు దూకడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వీరిలో ఇద్దరు కృష్ణా జిల్లాకు చెందిన వారు కాగా... రాయలసీమకు చెందిన వారొకరు, దక్షిణ కోస్తాకు చెందిన ఎమ్మెల్యే మరొకరు ఉన్నట్లు చెబుతున్నారు. 

పైకి ఖండిస్తున్నా...
ఉప ఎన్నికల ఫలితాలు తమకు వ్యతిరేకంగా వచ్చినప్పటికీ... వలసలు ఉండబోవని టీడీపీ అగ్ర నేతలు పైకి చెబుతున్నారు. అంతర్గతంగా మాత్రం 'ఆ గ్యారెంటీ ఇవ్వలేం' అని పేర్కొంటున్నారు. జగన్ పార్టీలోకి జంప్ చేయాలనుకునే వారు కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నారు. తమ నియోజకవర్గంలో అప్పటికే వైఎస్ఆర్సీపీ తరఫున బలమైన నాయకుడు ఉన్నట్లయితే, తమకు టికెట్ లభించే అవకాశం ఉండదు.

ఉప ఫలితాలు జగన్ పార్టీకి ఏకపక్షంగా ఉండవని టీడీపీ నేతలు చెబుతున్నప్పటికీ.... ఒకవేళ తాము భయపడుతున్నదే నిజమైతే పర్యవసనాలు ఎలా ఉంటాయి? పార్టీ నుంచి ఎవరెవరు జంప్ చేయవచ్చు? వాళ్లను నిలువరించేదెలా? అనే అంశాలపై టీడీపీ నేతలు తర్జన భర్జన పడుతున్నారు. ఈ ఉప ఫలితాలను ప్రాతిపదికగా తీసుకోవాల్సిన అవసరం లేదని, భవిష్యత్తు మనదేనని నచ్చచెప్పే యత్నాలు జరుగుతున్నాయి. మొత్తం మీద ఉప ఫలితాల అనంతరం రాజకీయ పరిణామాల వేడి మరింత పెరిగే పరిస్థితి కనిపిస్తోంది.



http://www.andhrajyothy.com/mainnewsshow.asp?qry=2012/jun/14/main/14main8&more=2012/jun/14/main/main&date=6/14/2012

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!