ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ అక్రమాలు, ప్రలోభాలను బయటపెట్టేందుకు యత్నించిన ‘సాక్షి’ విలేకరులపై పలుచోట్ల దాడులు జరిగాయి. కొన్నిచోట్ల ఈ దౌర్జన్యం పోలీసులు కళ్లెదుటే జరుగుతున్నా వారు చోద్యం చూశారు. గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గం పరిధిలోని వెల్దుర్తి ఎస్సీకాలనీలోని ఓటర్లు ఓటు వేసుకునేందుకు బయలుదేరుతుండగా కాంగ్రెస్, టీడీపీ కార్యకర్తలు అడ్డుతగిలారు. ఈ విషయం తెలుసుకున్న సాక్షి విలేకరి రమేష్ గౌడ్ అక్కడకు చేరుకుని టీడీపీ అభ్యర్థిని ప్రశ్నించారు. దీంతో అభ్యర్థితో ఉన్న కార్యకర్తలతో పాటు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా రమేష్‌పై దాడి చేశారు. పోలీసులు అక్కడే ఉన్నా పట్టించుకోలేదు. కొందరు టీడీపీ కార్యకర్తలు సాక్షి వాహనం కేబుల్‌ను గుంజే ప్రయత్నం చేశారు. అక్కడే ఉన్న నర్సరావుపేట డీఎస్పీ వెంకట్రామిరెడ్డి దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్తే.. మీ వల్లే ప్రశాంత వాతావరణం కలుషితమవుతోందంటూ రమేష్‌ను నెట్టివేశారు.
ఒంగోలులో టీడీపీ కార్యకర్తలు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలపై దాడికి పాల్పడ్డారు. సాక్షి వాహనం అద్దాలు పగులగొట్టేందుకు ప్రయత్నించారు. రామచంద్రపురం నియోజవర్గంలోని కాజులూరులో పోలింగ్ సరళిని పరిశీలించేందుకు వెళ్లిన సాక్షి సిబ్బందిపై కాంగ్రెస్ కార్యకర్తలు దౌర్జన్యానికి దిగారు. మద్యం సేవించిన కొందరు సాక్షి సిబ్బందిని నానా దుర్భాలాడుతూ దురుసుగా మీదకు వచ్చారు.
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గంలో సాక్షి చానల్ ప్రతినిధి కె.వినాయకరావుపై ఓ కాంగ్రెస్ నాయకుడు రెచ్చిపోయూడు. సీతారాంపురం నార్త్ పోలింగ్ కేంద్రమైన ప్రాథమిక పాఠశాల వద్ద ఈవీఎంలు పనిచేయడం లేదని మహిళలు తెలపడంతో సాక్షి ప్రతినిధి అధికారుల వివరణ తీసుకుని అక్కడి దృశ్యాలను చిత్రీకరిస్తుండగా కాంగ్రెస్ కార్యకర్తలు విరుచుకుపడ్డారు. వైర్లు గుంజేసి చిత్రీకరణను అడ్డుకున్నారు.
No comments:
Post a Comment