YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Monday, 11 June 2012

రాంచరణ్ వివాహ వేడుక కోసం వనమూలికల కేంద్రం ధ్వంసం

అనుమతి లేకుండానే మొక్కలు, చెట్ల నరికివేత
వీవీఐపీల కోసం రోడ్లు, స్వాగత తోరణాల నిర్మాణం

హైదరాబాద్, న్యూస్‌లైన్: ఎంకి పెళ్లి సుబ్బి చావుకు రావడమంటే ఇదే! రాజ్యసభ సభ్యుడు చిరంజీవి కుమారుడు రాంచరణ్ తేజ వివాహవేడుక... పచ్చని ప్రభుత్వ ఆయుర్వేద వనమూలికల క్షేత్రానికి ముప్పు తెచ్చింది. హిమాయత్‌సాగర్ సమీపంలోని ముప్పై ఎకరాల అపోలోవారి ఫాంహౌస్‌లో ఈనెల 14న రాంచరణ్ -ఉపాసనల వివాహాన్ని అంగరంగవైభవంగా నిర్వహించేందుకు చాలారోజుల క్రితమే ఏర్పాట్లు ప్రారంభించారు. అయితే వివాహానికి భారీసంఖ్యలో తరలివచ్చే వివిధ రంగాల వీవీఐపీలు ఏ మాత్రం అసౌకర్యానికి గురికాకుండా వచ్చి వెళ్లేందుకు, వారి వాహనాలు పార్క్ చేసేందుకు పక్కనే ఉన్న ప్రభుత్వ ఆయుర్వేద వనమూలికల క్షేత్రాన్ని ఎంచుకున్నారు. అనుకున్నదే తడవుగా ప్రహరీని కూల్చేసి ఔషధ మొక్కల్ని కొట్టేస్తూ.. వీఐపీల కోసం రహదారుల నిర్మాణం, పార్కింగ్ కోసం భూమిని చదును చేసే పనులు శరవేగంగా కొనసాగిస్తున్నారు. 

ఈ క్షేత్రం చుట్టూరా నిర్మించిన ప్రహరీని రెండు చోట్ల కూల్చేసి స్వాగత తోరణాలు నిర్మిస్తుండటం విశేషం. ఇక్కడి 58 ఎకరాల విస్తీర్ణంలో ఎర్రగడ్డ ఆయుర్వేద కళాశాల ఆధ్వర్యంలో రకరకాల వనమూలికల్ని పెంచుతున్నారు. అవికాస్తా రాంచరణ్ వివాహం కోసం ‘ఆహుతై’పోతున్నాయి. కాగా వనమూలికల మొక్కలు - చెట్లను నరికేస్తూ రహదారులు వేస్తున్న విషయాన్ని సూచన ప్రాయంగా కూడా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లక పోవటం విశేషం. రాష్ట్రంలో వివిధ ఆయుర్వేద ఆస్పత్రులకు అవసరమైన మూలికల్ని ఈ క్షేత్రం నుండే వినియోగిస్తున్నారు. ఈ క్షేత్రం పరిరక్షణ కోసం ప్రభుత్వం ఏటా భారీగానే నిధులను వ్యయం చేస్తోంది. సాధారణ జనాలకైతే కనీసం వనమూలికలను చూసేందుకు కూడా ఆయుష్ శాఖ అనుమతి ఇవ్వదు. కానీ కాంగ్రెస్‌లో ముఖ్య నాయకునిగా కొనసాగుతున్న చిరంజీవి కుమారుని వివాహం కోసం నిబంధనలన్నీ అతిక్రమించినా ఆ వైపు కన్నెత్తి చూసేవారే లేకపోవటం శోచనీయం

ఎలా కూల్చేస్తారు?: కళాశాల సూపరింటెండెంట్ 

ఎర్రగడ్డ ఆయుర్వేద కళాశాల అధీనంలో ఉన్న 58 ఎకరాల వనమూలికల కేంద్రంలో రోడ్లు, పార్కింగ్ ఏర్పాట్లు, ప్రహరీ గోడ కూల్చివేతకు కనీస అనుమతులు తీసుకోలేదని ఆయుర్వేదిక్ కళాశాల సూపరింటెండెంట్ దేవర చెప్పారు. ఎంతో విలువైన వనమూలికలున్న కేంద్రంలో రోడ్లు వేయటం, పార్కింగ్ కోసం చదును చేయటం సరికాదని చెప్పారు. ఈ అంశం తమ దృష్టికి రాలేదని మంగళవారం చర్యలు చేపడతామని చెప్పారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!