రాష్ట్ర పరిస్థితులను, సీబీఐ కక్షపూరిత వైఖరిని.. జగన్‌కు బెయిల్ రాకుండా సీబీఐ అడ్డుకుంటున్న తీరును వివరించిన విజయమ్మ కాంగ్రెస్ - టీడీపీ కుమ్మక్కు కుట్రలు రాష్ట్రపతికి దృష్టికి.. దర్యాప్తు విషయంలో న్యాయం చేయాల్సిందిగా విజ్ఞప్తి ప్రణబ్ ముఖర్జీకి జగన్ తరఫున అభినందనలు తెలిపిన విజయమ్మ న్యూఢిల్లీ, న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విషయంలో సీబీఐ అనుసరిస్తున్న కక్షపూరిత ధోరణిని ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు, ఎమ్మెల్యే వై.ఎస్.విజయమ్మ సోమవారం రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ దృష్టికి తీసుకెళ్లారు. జగన్‌కు బెయిల్ రాకుండా సీబీఐ పన్నుతున్న కుట్రలను కూలంకషంగా రాష్ట్రపతికి వివరించినట్లు ఆమె తెలిపారు. జగన్‌ను అణగదొక్కేందుకు కాంగ్రెస్, టీడీపీలు సీబీఐతో కుమ్మక్కై సాగిస్తున్న పన్నాగాలను కూడా నివేదించినట్లు చెప్పారు. దర్యాప్తు విషయంలో తమకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించి న్యాయం జరిగేలా చూడాలని విన్నవించామన్నారు. ఇదే సమయంలో.. రాష్ట్రపతిగా ఎన్నికైనందుకు ప్రణబ్‌కు జగన్ తరఫున ప్రత్యేక అభినందనలు తెలిపామన్నారు. పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, పార్టీ నేత వై.వి.సుబ్బారెడ్డితో కలిసి వై.ఎస్.విజయమ్మ సోమవారం మధ్యాహ్నం 1.30 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలుసుకున్నారు. ప్రణబ్‌తో గంటపాటు జరిగిన భేటీలో జగన్ కేసులో సీబీఐ వ్యవహరిస్తున్న తీరును వివరిస్తూ వినతిపత్రాన్ని అందజేశారు. భేటీ తర్వాత రాష్ట్రపతి భవన్ ఆవరణలో మేకపాటి, సుబ్బారెడ్డితో కలిసి ఆమె విలేకరులతో మాట్లాడారు. ‘‘సుప్రీంకోర్టులో ఈ నెల 5న జరిగిన బెయిల్ పిటిషన్‌పై విచారణ అనంతరం జగన్ బయటకు వస్తారని అనుకున్నాం. జగన్ బయటకు వచ్చాక ఆయనే స్వయంగా ఢిల్లీకి వచ్చి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని అభినందించాలనుకున్నారు. కానీ అది కుదరకపోవటంతో రాష్ట్రపతి ప్రణబ్‌ను కలిసి అభినందనలు తెలపాలని జగన్ మమ్మల్ని పంపారు. రాష్ట్రపతి ఎన్నికలయ్యాక ప్రణబ్‌ను కలుసుకోలేదు. అందుకే ఇప్పుడు కలిసి అభినందనలు తెలిపాం’’ అని విజయమ్మ తెలిపారు. ఈ సందర్భంగానే రాష్ట్ర పరిస్థితులను, ముఖ్యంగా జగన్ విషయంలో సీబీఐ వ్యవహరిస్తున్న తీరును ప్రణబ్‌కు వివరించామన్నారు. ‘‘మొదటినుంచీ జగన్‌పై సీబీఐ వ్యవహరిస్తున్న కక్షపూరిత వైఖరిని ప్రణబ్‌కు వివరించాం. ఎన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో ఐదు నెలల పాటు బెయిల్ రాకుండా సీబీఐ అడ్డుకున్న విషయాన్ని రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లాం. మాకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించి న్యాయం చేయాల్సిందిగా రాష్ట్రపతిని కోరాం’’ అని విజయమ్మ చెప్పారు. దీనిపై పరిశీలిస్తానని రాష్ట్రపతి హామీ ఇచ్చినట్లు ఆమె తెలిపారు. ‘పార్టీని బలోపేతం చేసేందుకు మీరు, షర్మిల పాదయాత్ర చేయనున్నారా?’ అని విలేకరులు అడగగా.. ‘‘ఇంకా నిర్ణయం తీసుకోలేదు’’ అని విజయమ్మ బదులిచ్చారు. సీబీఐతో కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కు: ఎంపీ మేకపాటి కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు సీబీఐతో కుమ్మక్కై వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని పూర్తిగా నిర్బంధంలో ఉంచేందుకు కుట్రను అమలుచేస్తున్నాయని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. ప్రస్తుతం జగన్ విషయంలో సీబీఐ వ్యవహరిస్తున్న తీరు కక్షపూరితమనే విషయం సామాన్యుడికిసైతం అర్ధమవుతోందన్నారు. జగన్ బెయిల్ పిటిషన్ విచారణకు ఒక రోజు ముందు టీడీపీ ఎంపీలు కేంద్ర ఆర్థికమంత్రి చిదంబరాన్ని కలిసిన రెండు గంటల్లోనే ఆస్తుల జప్తుకు సంబంధించి ఈడీ ఆదేశాలు ఇవ్వటాన్ని కూడా రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. గతంలో సీబీఐ కుట్రపూరిత చర్యలను వివరిస్తూ ప్రధానమంత్రికి అందించిన వినతిపత్రాన్నే రాష్ట్రపతికి కూడా సమర్పించామన్నారు. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన కొన్ని ప్రశ్నలకు మేకపాటి రాజమోహన్‌రెడ్డి బదులిస్తూ.. ‘‘పార్టీ కీలక సమావేశం జరగాల్సివుంది. అందులో నిర్ణయాలు తీసుకుంటారు. అన్నీ మీరే చూస్తారుగా’’ అని పేర్కొన్నారు. |
http://www.sakshi.com/main/FullStory.aspx?CatId=465449&Categoryid=1&subCatId=32
No comments:
Post a Comment