* జడ్చర్ల సెజ్‌లో ఎకరాకు రూ. 8 లక్షల నష్టం వచ్చిందన్న సీబీఐ * ట్రైడెంట్ లైఫ్ సెన్సైస్‌కు భూమి బదలాయింపుపైనా అవే అసత్యాలు.. అరబిందో బదలాయించింది అనుబంధ సంస్థకే * అందుకే దానికి ప్రాసెసింగ్ ఫీజులోనూ మినహాయింపు * అవన్నీ వదిలి.. ఫ్రెష్‌గా తీసుకోలేదంటూ సీబీఐ ఆరోపణలు * భూమి ఉండగా దాన్నొదిలి ఎవరైనా మళ్లీ కొత్తగా తీసుకుంటారా? వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సంస్థల్లో పెట్టుబడులకు సంబంధించిన కేసులో సీబీఐ తొలి చార్జిషీటు దాఖలు చేసింది ఈ ఏడాది మార్చి 31న. ఆరు నెలలు గడిచాక.. అక్టోబర్ 4న ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ ఈ కేసులో కొన్ని ఆస్తుల్ని అటాచ్ చేస్తూ ఉత్తర్వులిచ్చింది. ఆ చార్జిషీట్లోని అభియోగాల్ని మక్కీకి మక్కీ ఈ ఉత్తర్వుల్లో దించేసింది తప్ప ఈడీ కొత్తగా కనుగొన్న అంశాలేమీ లేవు. అలాగని సీబీఐ చార్జిషీట్లో అది దర్యాప్తు చేసి కనుగొన్న అంశాలేవో ఉన్నాయనుకుంటే పొరబడినట్టే! ఎఫ్‌ఐఆర్‌లో ఏం చెప్పిందో చార్జిషీట్లోనూ అదే చెప్పింది సీబీఐ. ఆ ఎఫ్‌ఐఆర్‌లోని అంశాలు కూడా.. కేసులో భాగంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్రావు, తెలుగుదేశం పార్టీ నేతలు వేసిన పిటిషన్లలోనివే. పోనీ వాటిలోనైనా కాస్త నిజాలున్నాయా అంటే.. అదంతా అబద్ధాల సమాహారం. వాటిలోని నిజానిజాలివిగో... * లీజుకూ అమ్మకానికీ తేడా ఉండదా? రెండింటికీ ఒకటే రేటుంటుందా? అభివృద్ధి చేసిన భూమికీ.. చేయని భూమికీ తేడా ఉండదా? రెండింటి విలువా ఒకటేనా? * పదహారు కోట్ల లాభం కలిగిందని అందుకు ప్రతిఫలంగా ఎవరైనా రూ. 29.5 కోట్లు ముడుపులుగా చెల్లిస్తారా? - ఇవన్నీ సామాన్యులు సైతం తేలిగ్గా తెలుసుకోదగ్గ ప్రశ్నలు. వీటిని తెలుసుకోవటానికి పెద్ద పెద్ద డిగ్రీల చదువులేం అక్కర్లేదు. మరి జాతీయ స్థాయి దర్యాప్తు సంస్థలైన సీబీఐకో, ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్‌కో ఇవన్నీ తెలియవనుకోవాలా? తెలిసినా సరే... పదేపదే ఇవే అంశాల్ని అవెందుకు ప్రస్తావిస్తున్నాయి? ఎఫ్‌ఐఆర్ నుంచి రిమాండ్ రిపోర్టు వరకూ... ఆఖరికి అటాచ్‌మెంట్ ఉత్తర్వుల్లో సైతం వీటినే ప్రస్తావిస్తున్నాయెందుకు? వాస్తవాలు బయటపెట్టకుండా వాళ్లు మోసం చేయాలనుకుంటున్నదెవరిని? మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలోని ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్)లో హెటెరో డ్రగ్స్, అరబిందో ఫార్మా లిమిటెడ్‌లకు తలా 75 ఎకరాల్ని దివంగత వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రభుత్వ హయాంలో ఏపీఐఐసీ కేటాయించిందని, ధరల కమిటీ నిర్ణయించిన ధర కన్నా తక్కువ ధరకు ఈ భూమిని కేటాయించటం ద్వారా ఈ రెండు సంస్థలకూ నాటి ప్రభుత్వం రూ. 12 కోట్ల మేర లబ్ధి కలిగించిందనేది సీబీఐ చేసిన ప్రధాన ఆరోపణ. ఇది కాక మెదక్ జిల్లా పాశమైలారంలోని ఎక్స్‌పోర్ట్స్ ప్రమోషన్ ఇండస్ట్రియల్ పార్క్‌లో (ఈపీఐపీ) అరబిందో ఫార్మా లిమిటెడ్‌కు కేటాయించిన భూమిని అది తన అనుబంధ సంస్థయిన ట్రైడెంట్ లైఫ్ సెన్సైస్‌కు బదలాయించిందని.. ఈ బదలాయింపు బదులు ట్రైడెంట్ నేరుగా ప్రభుత్వం నుంచి కొనుగోలు చేసి ఉంటే ప్రభుత్వానికి రూ. 4.3 కోట్ల మేర లాభం వచ్చేదని సీబీఐ మరో ఆరోపణ చేసింది. ఇలా అరబిందో, హెటెరో సంస్థలకు ప్రభుత్వం రూ. 16.3 కోట్ల మేర లబ్ధిని చేకూర్చిందని, అందుకు ప్రతిఫలంగా ఆ సంస్థలు వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డికి చెందిన సంస్థల్లో రూ. 32 కోట్లు పెట్టుబడిగా పెట్టాయనేది సీబీఐ అభియోగాల సారాంశం. వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డికి చెందిన సంస్థల్లో పెట్టుబడులపై దర్యాప్తు చేస్తున్న సీబీఐ.. ఇప్పటికే ఈ కేసులో నాలుగు చార్జిషీట్లు దాఖలు చేసింది. వాటిలో మొదటి చార్జిషీటు సారాంశం మొత్తం ఇదే. మరి ఈ ఆరోపణల్లో వాస్తవమెంత? సీబీఐ కావాలని వదిలేసిన అంశాలేంటి? ఒక్కసారి చూద్దాం... చంద్రబాబు హయాంలోనే భూ సేకరణ... మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ కోసం 954 ఎకరాల భూమిని టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా సేకరించారు. వై.ఎస్.రాజశేఖరరెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందే ఈ భూ సేకరణ పూర్తయింది. ఇలా సేకరించిన భూమికి ఎకరాకు రూ. 75 వేల చొప్పున పరిహారం చెల్లించారు. భూ సేకరణ పూర్తయిన తరవాత మూడేళ్ల దాకా ఏ ఒక్క పరిశ్రమా ముందుకు రాలేదు. దురదృష్టమేమంటే సీబీఐ తన చార్జిషీట్లో ఈ అంశాలు వేటినీ ప్రస్తావించ లేదు. ఎందుకంటే వీటిలో చంద్రబాబునాయుడి పేరుంది కాబట్టి. జరిగింది ఇదీ... ఇలా మూడేళ్ల పాటు ఏ పరిశ్రమా రాకపోయేసరికి 2006లో అప్పటి ఏపీఐఐసీ ఎండీ బి.పి.ఆచార్య రాష్ట్ర ప్రభుత్వం అనుమతితో కేంద్రానికి ఒక ప్రతిపాదన చేశారు. మొత్తం 954 ఎకరాల భూమిలో 250 ఎకరాల్ని సెజ్‌గా ప్రకటిస్తే పరిశ్రమలు ముందుకు రావచ్చని, అవి యాంకర్ యూనిట్లుగా కూడా నిలుస్తాయని చెప్పారు. 2006 అక్టోబర్‌లో కేంద్ర ప్రభుత్వం దీనికి అనుమతించింది. తరవాత యాంకర్ యూనిట్లను ప్రోత్సహించటం కోసం ఈ సెజ్‌లో ఎకరాకు రూ. 15 లక్షలు వసూలు చేయాలని ధరల నిర్ణయ కమిటీ నిర్ణయించింది. 2006 డిసెంబర్ 31 లోగా ఈ ధరకు భూమిని కేటాయించాలని సూచించింది. నవంబర్‌లోనే దరఖాస్తులు... 2006 నవంబర్‌లో హెటెరో డ్రగ్స్, అరబిందో ఫార్మా సంస్థలు ఏపీఐఐసీకి లేఖలు రాశాయి. తమకు ఆ సెజ్‌లో తలా 75 ఎకరాలు కేటాయించాలని వాటిలో కోరాయి. ఈ లేఖల్ని పరిశీలించిన ఏపీఐఐసీ అధికారులు వాటిని ఎండీ బి.పి.ఆచార్యకు పంపారు. ‘‘ఎకరాకు రూ. 7 లక్షల చొప్పున ధరను నిర్ణయించటానికి ముఖ్యమంత్రి సరేనన్నారని, ఆ ధరతోనే ఆఫర్ లెటర్లు తయారు చేయాలని ఆయన కింది స్థాయి అధికారులను ఆదేశించారు. వారు అలాగే తయారు చేశారు. అనంతరం ఆ లెటర్లను హెటెరో, అరబిందో ఫార్మాలకు అందజేశారు’’ అని సీబీఐ తన చార్జిషీట్‌లో పేర్కొంది. ఇలా ఎకరా భూమిని రూ. 15 లక్షల బదులు రూ. 7 లక్షలకు విక్రయించటం వల్ల ప్రభుత్వానికి మొత్తం 150 ఎకరాలపై రూ. 12 కోట్ల నష్టం వచ్చిందని కూడా పేర్కొంది. అది అమ్మకం... ఇచ్చింది లీజుకు! మరో ముఖ్యాంశమేంటంటే... చుట్టూ కాంపౌండ్ వేసి, మధ్యలో రోడ్లు వేసి, మౌలిక సదుపాయాలు కల్పించాకే ఏపీఐఐసీ తన పారిశ్రామిక వాడల్లో ప్లాట్లు కేటాయిస్తుంది. కానీ జడ్చర్లలోని సెజ్‌కు అలాంటివేమీ చేయలేదు. చుట్టూరా కంచె కానీ, మధ్యలో రోడ్లు కానీ, వీధిలైట్ల వంటి ఇతరత్రా సౌకర్యాలు కానీ అన్నీ ఆ భూమిని తీసుకున్న హెటెరో డ్రగ్స్, అరబిందో ఫార్మా సంస్థలే వేసుకున్నాయి. అభివృద్ధి చేసిన భూమిని ఎకరా రూ. 15 లక్షలకు ఏకమొత్తంగా విక్రయించాలని అనుకున్నపుడు.. అభివృద్ధి చేయని భూమిని ఎకరా రూ. 7 లక్షల చొప్పున.. అది కూడా లీజు ప్రాతిపదికన కేటాయించటం తప్పెలా అవుతుంది? అవన్నీ విస్మరించి.. ఆ 2 కంపెనీలకు ప్రభుత్వం రూ. 12 కోట్లు లబ్ధి చేకూర్చిందని చెప్పటాన్ని ఏమనుకోవాలి? ఇది రాజకీయ కుట్ర అనటానికి ఇంకా ఏం కావాలి? నిజానికిక్కడ సీబీఐ కావాలని విస్మరించిన విషయం ఒకటుంది. అది.. ఎకరాకు రూ. 15 లక్షల ధరను నిర్ణయించింది ఏకమొత్తంగా అమ్మటానికి. కానీ ప్రభుత్వం ఎకరా రూ. 7 లక్షల చొప్పున కేటాయించింది లీజు పద్ధతిన. రూ. 7 లక్షల చొప్పున ధర నిర్ణయించి.. ఆ ధరలో ఒక శాతాన్ని ఏడాదికి లీజు అద్దెగా చెల్లించాలనేది హెటెరో, అరబిందో సంస్థలతో చేసుకున్న ఒప్పందం. పెపైచ్చు ఆ లీజు మొత్తాన్ని ఒకేసారి ముందే చెల్లించాలనేది కూడా ఒప్పందంలోనే ఉంది. దీంతో ఆ రెండు సంస్థలూ భూమిని తీసుకున్న వెంటనే ఎకరాకు రూ. 7 లక్షల చొప్పున లీజు అద్దెను ఒకేసారి చెల్లించేశాయి. అంటే ఎకరాకు రూ. 7 లక్షల చొప్పున సొమ్ము ముందే ఏపీఐఐసీ చేతికి వచ్చింది. పెపైచ్చు లీజు గడువు ముగిశాక ఆ భూమి ఎలాగూ ఏపీఐఐసీ చేతికి వస్తుంది. ఇక్కడ గమనించాల్సిన అంశాలింకా చాలా ఉన్నాయి. ఇది యాంకర్ యూనిట్. అంటే దీన్ని చూసి మరిన్ని పరిశ్రమలు రావటానికి వీలుంటుంది. పెపైచ్చు ఒకటి రెండు ఎకరాలు కాకుండా వందల్లో కేటాయించేటపుడు ఎలాగూ ధరలో రాయితీలుండనే ఉంటాయి. ఏ పారిశ్రామిక విధానమైనా పరిశ్రమల్ని ప్రోత్సహించేలా ఉంటుంది. పరిశ్రమల్ని ఆకర్షించేలా ఉంటుంది. చంద్రబాబు నాయుడి హయాంలో ఫోక్స్‌వ్యాగన్ కోసం విశాఖ జిల్లాలో భూమిని కేటాయించాలనుకున్నపుడు ఎకరాకు ఒక్క రూపాయి చొప్పున ధర నిర్ణయించటం అబద్ధమేమీ కాదు. ఒక పరిశ్రమను ప్రోత్సహించాలనుకున్నపుడు ఇలాంటి రాయితీలివ్వటం కొత్తేమీ కాదు. భూమికి ఎక్కువ ధరను నిర్ణయించి.. తరవాత దాన్ని తగ్గించి పారిశ్రామిక వేత్తలకు కేటాయించటం వల్ల వారు తమకు భారీగా తగ్గింపు లభించిందని భావిస్తారు. త్వరగా ముందుకొస్తారు. అన్ని వ్యాపారాల్లోనూ అనుసరించే సూత్రమే ఇది. అసలు సీబీఐ చూడాల్సిందేమిటి? ఈ నిర్ణయం రాష్ట్రంలో అంతకుముందు ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలకన్నా భిన్నంగా ఉందా? ఇతర రాష్ట్రాల్లో ఎక్కడా ఇలాంటి నిర్ణయమేదీ తీసుకోలేదా? పారిశ్రామిక విధానానికి భిన్నంగా ఏమైనా వ్యవహరించారా? ఇవి కదా చూడాల్సింది!! ట్రైడెంట్ విషయంలోనూ అంతే...! మెదక్ జిల్లా పాశమైలారంలో చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ ప్రభుత్వం ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ ఇండస్ట్రియల్ పార్క్‌ను ఏర్పాటు చేసింది. దీన్లో అరబిందో ఫార్మాకు భూమి కేటాయించటంతో 2003 నాటికే అదొక యూనిట్‌ను (యూనిట్ నెంబర్-4) ఏర్పాటు చేసింది. ఆ తరవాత 2005లో విస్తరణ నిమిత్తం భూమి కోసం దరఖాస్తు చేయటంతో ఏపీఐఐసీ దానికి రెండు విడతలుగా 27.46 ఎకరాలు, 2.87 ఎకరాల చొప్పున భూమి కేటాయించింది. అప్పటి కమిటీ నిర్ణయించిన దాని ప్రకారం చదరపు మీటరుకు రూ. 150 చొప్పున వసూలు చేశారు. అంటే ఎకరాకు రూ. 6,07,029 చొప్పున వసూలు చేశారన్న మాట. అరబిందో సంస్థ ఈ భూమిని పొందాక 2006లో దాన్ని తన అనుబంధ సంస్థయిన ట్రైడెంట్ లైఫ్ సెన్సైస్‌కు ట్రాన్స్‌ఫర్ చేయాలనుకుంది. అరబిందో ఎండీ నిత్యానందరెడ్డి అల్లుడు శరత్‌చంద్రరెడ్డి సంస్థ ఇది. ఈయన అరబిందో చైర్మన్ రాంప్రసాద్‌రెడ్డి తనయుడు కూడా. అయితే ఏపీఐఐసీ నిబంధనల ప్రకారం ఒక కంపెనీకి స్థలం కేటాయిస్తే దాన్లో పరిశ్రమ పెట్టకముందు దాన్ని వేరెవ్వరికీ బదలాయించ కూడదు. కాకపోతే ఇక్కడ అరబిందో ట్రాన్స్‌ఫర్ చేయాలనుకున్నది తన అనుబంధ సంస్థకే. (ఇది ఆ తరవాత అరబిందోలో పూర్తిగా విలీనమైపోయింది కూడా.) అరబిందో స్టాక్‌మార్కెట్లో లిస్టయిన సంస్థ కనుక.. అనుబంధ కంపెనీకి ఏ ఆస్తి బదలాయించినా అది పేరెంట్ సంస్థ చేతిలో ఉన్నట్టే. అందుకని తాను ఈ స్థలాన్ని అనుబంధ కంపెనీకి బదలాయించాలనుకుంటున్నాను కనుక తనకు బదలాయింపు ఫీజులో మినహాయింపు ఇవ్వాలని ఏపీఐఐసీని కోరింది. మామూలుగా బదలాయిస్తే 10 శాతం చొప్పున, అనుబంధ సంస్థలకైతే 2 శాతం చొప్పున ఏపీఐఐసీకి ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. (రిజిస్ట్రేషన్ చార్జీల మాదిరే. బయటివారికి విక్రయిస్తే 11 శాతం.. గిఫ్ట్‌గా కుటుంబీకులకు ఇస్తే 2 శాతం లెక్కన). ఏపీఐఐసీకి మినహాయింపు కోసం దరఖాస్తు చేయగా.. అది అనుబంధ సంస్థే కనుక 2 శాతం చొప్పున ప్రాసెసింగ్ ఫీజు చెల్లిస్తే సరిపోతుందని సంస్థ అనుమతినిచ్చింది. కానీ సీబీఐ వాదన మరోలా ఉంది. ‘‘అప్పుడు అక్కడ ఏపీఐఐసీ ధర చదరపు మీటరు రూ. 500 పలుకుతోంది. కానీ రూ. 150 చొప్పున అరబిందో కొనుగోలు చేసింది. దాన్ని ట్రైడెంట్‌కు బదలాయించింది. అలాకాకుండా చదరపు మీటరుకు రూ. 500 పెట్టి నేరుగా ఏపీఐఐసీ నుంచి ట్రైడెంట్ సంస్థ కొనుగోలు చేసి ఉంటే ప్రభుత్వానికి రూ. 4.3 కోట్లు అదనంగా దక్కేది’’ అనేది సీబీఐ వాదన. తనకు అప్పటికే అక్కడ కావలసిన భూమి అందుబాటులో ఉన్నపుడు మళ్లీ కొత్తగా కొనుక్కోవాలని ఎవరైనా అనుకుంటారా? తన పేరెంట్ సంస్థకు భూమి ఉన్నపుడు తాను కొత్తగా కొనాలని ఏ అనుబంధ సంస్థయినా అనుకుంటుందా? మరి ఈ వాస్తవాల్ని సీబీఐ ఎందుకు పట్టించుకోవటం లేదు? దీని వెనకున్న ఉద్దేశాలు తెలియటం లేదా? ఇలా రూ. 12 కోట్లు, రూ. 4.3 కోట్లు కలిసి మొత్తమ్మీద హెటెరో, అరబిందోలకు రూ. 16.3 కోట్ల లాభం చేకూరిందని అందుకే అవి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సంస్థల్లో రూ. 29.5 కోట్లు పెట్టుబడిగా పెట్టాయని సీబీఐ తన మొదటి చార్జిషీట్లో పేర్కొంది. నాలుగైదు రోజుల కిందట అరబిందో, హెటెరో, జగతి, జనని సంస్థలకు చెందిన కొన్ని ఆస్తుల్ని అటాచ్ చేస్తున్నట్లుగా ప్రకటించిన సందర్భంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ కూడా ఇదే వాదన వినిపించింది. అయితే అది ఈ కంపెనీలకు కలిగిన లబ్ధిని రూ. 21.5 కోట్లుగా పేర్కొంది. సీబీఐ చార్జిషీటునే తన చార్జిషీటుగా మార్చుకున్న ఈడీ.. ఆ లెక్క ఎక్కడి నుంచి వచ్చిందన్నది చెప్పనేలేదు. అసలు రూ. 16 కోట్లు లబ్ధికి ప్రతిఫలంగా రూ. 29.5 కోట్లు పెట్టుబడి పెట్టే వారెవరైనా ఉంటారా? అలా పెట్టారంటే దానర్థం వారు ఆ కంపెనీల్లో లాభాల కోసమే ఇన్వెస్ట్ చేశారని భావించనక్కర్లేదా? ఈ రెండు ప్రాంతాల్లోనూ ఇప్పటికే ఆయా కంపెనీల ప్లాంట్లు వచ్చి.. ఆరు వేల మందికి పైగా ఉపాధి పొందుతున్నారనటం అబద్ధమా? రూ. 1,000 కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయన్న విషయం అసత్యమా? అసలు జడ్చర్ల సెజ్‌కు చంద్రబాబు హయాంలోనే భూములు సేకరించినా.. మూడేళ్ల పాటు అక్కడ పరిశ్రమ పెట్టడానికి ఎవరూ రాకపోవటాన్ని సీబీఐ ఎందుకు ప్రస్తావించలేదు? అన్నీ నాటి ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డికి అంటగడుతున్న సీబీఐ.. కనీసం ఈ ఫైళ్లు వైఎస్ టేబుల్ వద్దకు కూడా రాలేదన్న వాస్తవాన్ని ఎందుకు విస్మరించింది? ఇదంతా జరుగుతున్న కుట్రకు అద్దం పట్టటం లేదా? |
http://www.sakshi.com/main/WeeklyDetails.aspx?Newsid=50497&Categoryid=1&subcatid=1
No comments:
Post a Comment