YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Monday 5 November 2012

మీ మీద నమ్మకం లేకే.. ప్రజలు మాకు అర్జీలిస్తున్నారు

* అధికారం ఉంటే సరిపోదు.. చిత్తశుద్ధి, విశ్వసనీయత ఉండాలి 
* మేం అధికారంలోకి వస్తే చేస్తామనే ప్రజల నమ్మకం
* తన పాలన మళ్లీ తెస్తానని చెప్పే ధైర్యం చంద్రబాబుకు లేదు 
* అందుకే వైఎస్ చేసినట్లే తానూ చేస్తానని హామీలిస్తున్నారు
* బాబుగారూ మీకూ, మీ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే.. అవిశ్వాసం పెట్టరేం? 

షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ సోమవారం యాత్ర ముగిసేనాటికి..
రోజులు: 19, 
కిలోమీటర్లు: 246.80 

‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘న్యూస్‌లైన్’ ప్రత్యేక ప్రతినిధి: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తమ సమస్యలు పరిష్కరిస్తాడన్న నమ్మకం ప్రజలకు ఏ కోశానా లేదని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చెల్లెలు షర్మిల అన్నారు. అందుకే తమ సమస్యలు పరిష్కరించాలని ఆయనకు కాకుండా వారు తమకు వినతిపత్రాలు ఇస్తున్నారని చెప్పారు. ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర 19వ రోజు సోమవారం అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలోని వజ్రకరూర్‌లో ఆమె ప్రసంగించారు. ప్రజా సమస్యలు పట్టని ప్రభుత్వ వైఖరికి, దానికి వంతపాడుతున్న ప్రతిపక్ష టీడీపీ వైఖరికి నిరసనగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తరఫున చేపట్టిన పాదయాత్రలో అడుగడుగునా తమకు ప్రజలు వినతిపత్రాలు ఇవ్వడంపై మాట్లాడారు. 

‘‘ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అంటారట. మేం ఎందుకు పాదయాత్ర చేస్తున్నామని.. మాకు ప్రజలు అర్జీలు ఇచ్చుకుంటే, వినతిపత్రాలు ఇచ్చుకుంటే ఏం లాభమని ఆయన అన్నారట. మీకు విశ్వసనీయత లేదు గనుక మీకు అర్జీలు ఇచ్చుకున్నా ఈ జన్మలో నెరవేరుతాయన్న నమ్మకం ప్రజలకు లేదు. అందుకే మేం వెళ్లినప్పుడు మాకు అర్జీలు ఇస్తే.. కనీసం మేం అధికారంలోకి వచ్చినప్పుడైనా నెరవేరుస్తామన్న నమ్మకం వారికి ఉంది. అందుకే వారు మాకు వినతిపత్రాలు ఇస్తున్నారు. కేవలం అధికారం ఉంటే సరిపోదు ముఖ్యమంత్రి గారూ.. చిత్తశుద్ధి ఉండాలి. విశ్వసనీయత ఉండాలి..’’ అని షర్మిల ఘాటుగా విమర్శించారు. 

‘‘నేనీరోజు చెబుతున్నా ముఖ్యమంత్రి గారికి.. మరణించిన రాజశేఖరరెడ్డి గారు సమాధానం చెప్పుకోలేరని తెలిసి.. కనీస ఇంగిత జ్ఞానం కూడా లేకుండా, మానవత్వం కూడా లేకుండా మీ కాంగ్రెస్ పార్టీ ఆయనను ఎఫ్‌ఐఆర్‌లో దోషిగా చేర్చింది. కానీ మూడేళ్లు గడిచిపోయినా.. వైఎస్సార్‌ను ప్రజలు గుర్తుపెట్టుకుంటున్నారు. అదీ ఆయనకున్న విశ్వసనీయత. జగనన్నను అన్యాయంగా జైలు పాలు చేశారు. దోషి అని రుజువు చేయాలని శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. జగనన్న జైల్లో ఉన్నప్పటికీ ఈ రాష్ట్ర ప్రజలు కిరణ్‌కుమార్‌రెడ్డి మాకు వద్దు.. చంద్రబాబు మాకు వద్దు.. మాకు రాజన్న కొడుకే కావాలి.. మాకు జగనన్న ముఖ్యమంత్రిగా కావాలని కోరుకుంటున్నారంటే.. అదీ జగనన్నకు ఉన్న విశ్వసనీయత’’ అని షర్మిల అన్నారు.

అవిశ్వాసం పెట్టరట:
‘‘చంద్రబాబుకు తన పరిపాలనను మళ్లీ తెస్తానని చెప్పుకొనే ధైర్యం లేదు. వైఎస్ ఐదేళ్లలో ఏం చేశారో అవే చేస్తానని ఇప్పుడు చంద్రబాబు చెప్పుకొంటున్నారు. రాజశేఖరరెడ్డి రుణమాఫీ చేసినట్టే తానూ చేస్తానని చెప్పుకొంటున్నారు. రాజశేఖరరెడ్డి ఉచిత విద్యుత్తు ఇచ్చినట్టే తానూ ఇస్తానని చెబుతున్నారు. రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇచ్చినట్టే తానూ ఇస్తానంటున్నారు. పదవి ఉన్నప్పుడు ఏమీ చేయకుండా రాజశేఖరరెడ్డిని తిట్టుకుంటూ.. ఇప్పుడు మాత్రం రాజశేఖరరెడ్డి పాలనను అందిస్తానని చెప్పకనే చెబుతున్నారు. 

అసలు మీకు పాదయాత్ర చేసే అవసరమే లేదు. మీకు, మీ పార్టీకి, మీ పాదయాత్రకు చిత్తశుద్ధి ఉంటే.. ప్రజలను ఇంత కష్టాలు పెడుతున్న ఈ ప్రభుత్వాన్ని ఎందుకు దించేయడం లేదు? ఎందుకు అవిశ్వాస తీర్మానం పెట్టడం లేదు? ’’ అని షర్మిల చంద్రబాబును ప్రశ్నించారు. కాంగ్రెస్‌కైనా, టీడీపీకైనా కావాల్సింది అధికారమని, అందుకోసం వారు ఏదైనా చేస్తారని దుయ్యబట్టారు. ‘‘చంద్రబాబు ఇప్పుడు కొత్తగా పాదయాత్ర అంటూ డ్రామా ఆడుతున్నారు. తన పాలనలో శ్మశానాలుగా మార్చిన ఆ గ్రామాల నుంచే పాదయాత్ర చేస్తున్నారు’’ అని విమర్శించారు.

మీరు బకాయిలు కట్టనందుకే జైల్లో పెట్టారుకదా:
సాయంత్రం తట్రకల్‌లో షర్మిల మాట్లాడుతూ.. ‘బకాయిలు కట్టొద్దని ఇప్పుడు చంద్రబాబు అంటున్నారు. కానీ ఆయన అధికారంలో ఉన్నప్పుడు బకాయిలు కట్టనందునే రైతులను జైల్లో పెట్టిన సంగతి ఇంకా ప్రజలు మరిచిపోలేదు..’ అని విమర్శించారు. 

రాజన్న పట్టాలిచ్చారు..
పందొమ్మిదో రోజు సోమవారం ఉదయం 10.15కు రాగులపాడులో పాదయాత్రకు బయలుదేరిన షర్మిలకు పందికుంట క్రాస్ సమీపంలో వెంకటాంపల్లి, వీపీపీ తండా, వీపీసీ తండా, జెరుట్ల రాంపురం వాసులు పెద్ద ఎత్తున తరలివచ్చి తమ సమస్యలు విన్నవించుకున్నారు. ‘రాజశేఖరరెడ్డి మాకు భూములకు పట్టాలు ఇచ్చారు. ఇప్పుడు మమ్మల్ని పట్టించుకునే నాథుడే లేరు. పావలా వడ్డీ రుణాలు రావడం లేదు. తాగేందుకు నీళ్లు లేవు. కరెంటు లేదు. ఉన్న పెన్షన్లను తీసేస్తున్నారు..’ అని వాపోయారు. దీనికి షర్మిల స్పందిస్తూ జగనన్న సీఎం కాగానే అర్హులందరికీ పెన్షన్లు, రుణాలు ఇస్తారని, అమ్మ ఒడి పథకం అమలు చేస్తారని భరోసా ఇచ్చారు. అనంతరం తండాల వాసులు షర్మిలకు కొప్పెర(అద్దాల పైట) కప్పి.. కత్తి, డాలు ఇచ్చి తమ అభిమానం చాటుకున్నారు.

షర్మిల 12 గంటలకు పందికుంట చేరుకుని అక్కడ సభలో మాట్లాడారు. తరువాత మార్గం మధ్యలో రామాంజనేయులు అనే రైతు జొన్న విత్తనాలు వేస్తుంటే.. షర్మిల అక్కడికివెళ్లి వారితోపాటు విత్తనాలు వేశారు. మల్లికార్జున, అంపమ్మ అనే రైతులు తమ వేరుశనగ పంటలో కాయ కాయక నష్టపోయామని తమ ఆవేదన వెళ్లబోసుకున్నారు. మధ్యాహ్నం 3.30కు ఎన్‌ఎన్‌పీ తండా వాసులు తమకు రాజశేఖరరెడ్డి భూములకు పట్టాలు ఇచ్చారని, ఆ తరువాత ఇక పట్టించుకున్న నాథుడే లేరని చెప్పుకొచ్చారు. ‘జగనన్నను ఎప్పుడు ఇడుస్తారమ్మా.. ఇడవకపోతే మేం కూడా ధర్నా చేస్తాం..’ అని గొంతెత్తారు. 

సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు వర్షం కురవగా వర్షంలోనే వజ్రకరూర్ చేరుకున్నారు. అక్కడ జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. అనంతరం 6.45కు వజ్రకరూర్‌లో ఏర్పాటుచేసిన రాత్రి బసకు చేరుకున్నారు. 19వ రోజు మొత్తం 10.70 కిలోమీటర్లు నడిచారు. ఇప్పటివరకు మొత్తం 246.80 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తయింది. సోమవారం పాదయాత్రలో ఎమ్మెల్యేలు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, గురునాథరెడ్డి, కాపు రాంచంద్రారెడ్డి, ఎమ్మెల్సీ డి.నారాయణరెడ్డి, పార్టీ నేతలు వాసిరెడ్డి పద్మ, తోపుదుర్తి కవిత, ఉరవకొండ నియోజకవర్గ ఇన్‌చార్జి వై.విశ్వేశ్వర్‌రెడ్డి, కర్నూలు, వైఎస్సార్ జిల్లాల కిసాన్‌సెల్ కోఆర్డినేటర్ వై.మధుసూదన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

source:sakshi

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!